అగ్ర నేతలకు అగ్నిపరీక్ష

Huge test to Congress Top Leaders - Sakshi

లోక్‌సభ బరిలో దిగ్గజాలను నిలిపిన కాంగ్రెస్‌ అధిష్టానం

ఉత్తమ్‌ పోటీ చేసే అంశాన్ని స్వయంగా ప్రతిపాదించిన రాహుల్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ పెద్దలకు లోక్‌సభ ఎన్నికలు కఠిన పరీక్షగా మారనున్నాయి. తాడోపేడో తేల్చుకోవాలనే వ్యూహంతో పార్టీ అధిష్టానం ఈసారి అగ్రనేతలను రంగంలోకి దింపడంతో ఏం జరుగుతుందోననే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా ఏడు స్థానాల్లో కీలక నేతలను బరిలోకి దించిన నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి చావోరేవో అనే పరిస్థితి తెచ్చిపెట్టనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల ఫలితాలనుబట్టి పార్టీ నేతల సత్తా ఏమిటో తెలుస్తుందని, ఎన్నికల ఫలితాల సరళికి అనుగుణంగా అవసరమైతే పార్టీని ప్రక్షాళన చేసేందుకే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందనే చర్చ గాంధీ భవన్‌ వర్గాల్లో జరుగుతోంది. 

దిగ్గజాలతో జాబితాలు విడుదల... 
కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటివరకు ఖమ్మం మినహా 16 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ (నల్లగొండ)తోపాటు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్‌ (కరీంనగర్‌), ఎ. రేవంత్‌రెడ్డి (మల్కాజిగిరి), మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (భువనగిరి), ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ గౌడ్‌ (నిజామాబాద్‌), కార్యదర్శి వంశీచందర్‌రెడ్డి (మహబూబ్‌నగర్‌), కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ (మహబూబాబాద్‌), ప్రస్తుత ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (చేవెళ్ల), మాజీ పార్లమెంటు సభ్యులు మల్లురవి (నాగర్‌కర్నూలు), రమేశ్‌ రాథోడ్‌ (ఆదిలాబాద్‌) తదితరులున్నారు. జైపాల్‌రెడ్డి, జానారెడ్డి, డి.కె. అరుణ లాంటి నేతల పేర్లు కూడా వినిపించినా వారు పోటీకి విముఖత చూపడంతో వారిని బరిలోకి దించలేదు. అయితే ఉత్తమ్‌ని నల్లగొండ నుంచి పోటీ చేయాలని స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీయే ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ విషయంలో నల్లగొండ జిల్లా నేతల మధ్య కొన్ని తర్జనభర్జనలు జరిగినా ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేయాల్సిందేనని రాహుల్‌ ఆదేశించడంతో ఉత్తమ్‌ బరిలోకి దిగాల్సి వచ్చిందనే చర్చ జరుగుతోంది. ఇంతమంది ముఖ్య నేతలను ఈసారి పోటీకి నిలపడం వెనుక కాంగ్రెస్‌ అధిష్టానం వ్యూహం భారీగానే ఉందని తెలుస్తోంది.  

కష్టకాలంలో నిలబడాల్సిందే...! 
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు రాజకీయ ప్రయోజనం చేకూరకపోగా నష్టమే జరిగింది. వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ చేతిలో భంగపడింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలనే గెలుచుకుంది. దీనికితోడు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి క్యూ కడుతుండటం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలను రెండు రకాలుగా ఉపయోగించుకోవాలనే ఆలోచనతోనే కీలక నేతలను రంగంలోకి దింపిందనే చర్చ జరుగుతోంది. నేతల చరిష్మాతోపాటు సామాజిక సమీకరణాలు, జాతీయ పార్టీగా కాంగ్రెస్‌కు ఉండే సానుకూలతలను కలిపితే మెరుగైన ఫలితాలు వస్తాయనే అంచనాతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందనే చర్చ జరుగుతోంది. దీంతోపాటు ఎన్నికల బరిలో లేని జానా, భట్టి, డి.కె. అరుణ, శ్రీధర్‌బాబు, షబ్బీర్‌ అలీ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చిన్నారెడ్డి లాంటి మరికొందరు కీలక నేతలకు లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌చార్జులుగా బాధ్యతలు అప్పగించి అభ్యర్థులను గెలిపించే బాధ్యత అప్పగించింది. దీంతో ఈ ఎన్నికల్లో రాష్ట్ర నేతల సత్తా తేలిపోతుందని, ఫలితాలకు అనుగుణంగా మార్పుచేర్పులు చేసి పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఆలోచనతో అధిష్టానం ఉందని తెలుస్తోంది.

ఖమ్మం ఎందుకు ఆపారో..?
రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకుగాను 16 చోట్ల అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం ఖమ్మం నియోజకవర్గాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టింది. రెండో జాబితాలోనే ఖమ్మం అభ్యర్థి పేరు కూడా వెలువడాల్సి ఉన్నా కీలక పరిణామం జరుగుతుందేమోననే భావనతోనే ప్రకటించలేదనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. వాస్తవానికి మొదట్లో చాలా మంది నేతలు ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు వచ్చినా చివరి నిమిషంలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్‌ (తూర్పు) నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వద్దిరాజు రవిచంద్రలు మాత్రమే రేసులో మిగిలారు. వారిద్దరిలో ఎవరో ఒకరికి నచ్చజెప్పి అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం అధిష్టానానికి కష్టం కానప్పటికీ కావాలనే పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌ నుంచి కీలక నాయకుడైన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టికెట్‌ దక్కకపోతే ఆయన కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశముందని, ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించేందుకే వ్యూహాత్మకంగా ఆపారనే చర్చ బహిరంగంగానే జరుగుతోంది. ఈనెల 21న టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తానని కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో అదే రోజు లేదా 22న ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి ఖరారవుతారని తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top