ఇంత మొండితనమా?

TRS MPs fires on Central Govt - Sakshi

రిజర్వేషన్లపై ఇన్ని రోజులుగా పోరాడుతున్నా అర్థమైతలేదా?

కేంద్రంపై నిప్పులు చెరిగిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు

సాక్షి, న్యూఢిల్లీ: జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునే అధికారం తెలంగాణకు ఇవ్వాలని ఇన్నిరోజులుగా అడుగుతున్నా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని టీఆర్‌ఎస్‌ ఎంపీలు విమర్శించారు. కేంద్రానికి అర్థమైతలేదా.. లేక మొండితనమా..? అని దుయ్యబట్టారు. రిజర్వేషన్ల అంశంపై లోక్‌సభలో గురువారమూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిరసన చేపట్టారు. పార్టీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత, బి.వినోద్‌కుమార్, అజ్మీరా సీతారాం నాయక్, బూర నర్సయ్య గౌడ్, సీహెచ్‌ మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బాల్క సుమన్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీబీ పాటిల్, నగేశ్, పసునూరి దయాకర్‌ సభ వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలు స్తంభించడంతో సభాపతి సభ పలుమార్లు వాయిదా వేశారు. అనంతరం టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. సెంట్రల్‌ హాల్‌లోనూ ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టామని, వివిధ పార్టీలు మద్దతు తెలిపాయని చెప్పారు.  

రాష్ట్రానికో తీరుండాలా?: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి 
రిజర్వేషన్ల అంశంపై రెండు వారాలుగా సభలో నిరసన తెలుపుతున్నామని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు. సెంట్రల్‌ హాల్‌లోనూ ఆందోళన చేపట్టామన్నారు. ‘తమిళనాడులో 69 శాతం, మహారాష్ట్రలో 52 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. రిజర్వేషన్ల పెంపు అధికారం రాష్ట్రాలకు ఉండాలా? లేక కేంద్రానికా?.. దేశానికంతటికీ ఒకే విధానం ఉండాలా? లేక రాష్ట్రానికో తీరుండాలా?.. మేమడిగేది కేంద్రానికి అర్థమైతలేదా? లేదా మొండితనమా? కేంద్రం ఇప్పటికైనా కళ్లు తెరవాలి’అని హితవు పలికారు.  

తొలిసారి సెంట్రల్‌ హాల్‌లో నిరసన: ప్రభాకర్‌ రెడ్డి 
రిజర్వేషన్లపై 2 వారాలుగా ఆందోళన చేస్తున్నా కేంద్రానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి విమర్శించారు. తొలిసారిగా సెంట్రల్‌ హాల్‌లో గురువారం నిరసన తెలిపామన్నారు. ‘తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్రం బిల్లు ఆమోదించింది. దానిపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ బడ్జెట్‌ను అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవచ్చు. బడుగు, బలహీన వర్గాలకు తగిన విధంగా కేటాయింపులు చేశారు’ అని అన్నారు.  

దున్నపోతుపై వానపడ్డట్లు..: బాల్క సుమన్‌ 
దున్నపోతుపై వాన పడ్డట్లు మొండివైఖరి ప్రదర్శిస్తోందంటూ కేంద్రంపై ఎంపీ బాల్క సుమన్‌ నిప్పులు చెరిగారు. తెలంగాణలో మారిన జనాభా శాతాలకు అనుగుణంగా రిజర్వేషన్లు మారాల్సి ఉందన్నారు. ‘ఎస్టీ, బీసీ కోటా పెంపును కేంద్రం సహృదయంతో అర్థం చేసుకోవాలి. యూనివర్సిటీల్లో పోస్టుల రిక్రూట్‌మెంట్లకు రోస్టర్‌ పాయింట్లు పాటించడంలో ఇప్పటివరకు వర్సిటీని యూనిట్‌గా తీసుకునేవారు. ఇప్పుడు డిపార్ట్‌మెంట్‌ను యూనిట్‌గా తీసుకుంటుండటం వల్ల అవకతవకలు జరిగే అవకాశం ఉంది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి గెహ్లాట్‌ను కలిశాం’ అని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top