టీఆర్‌ఎస్‌ ప్రచారాస్త్రాలివే..

TRS campaign guarantees in telangana elections 2018 - Sakshi

నల్లగొండ జిల్లాలో స్థానిక సమస్యలే ప్రధాన ప్రచారాస్త్రాలు

కీలకంగా మారనున్న సాగునీటి ప్రాజెక్టులు

అభ్యర్థులకు చుక్కలు చూపించేవి ఆ సమస్యలే..

నల్లగొండ జిల్లాలో ఈసారి రాష్ట్ర సమస్యల కంటే.. ఆయా నియోజకవర్గాల్లోని స్థానిక సమస్యలు, సాగునీటి ప్రాజెక్టు అంశాలే అభ్యర్థులకు సవాల్‌ విసరబోతున్నాయి. జిల్లాలోని దాదాపు అన్ని స్థానాల్లో ముఖాముఖి పోటీ ఉండబోతోంది. ఒకటి రెండుచోట్ల బీజేపీ అభ్యర్థులు పోటీ ఇచ్చే అవకాశం ఉన్నా.. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులు హోరాహోరీ తలపడనున్నారు. టీఆర్‌ఎస్‌ గడిచిన నాలుగున్నరేళ్లలో చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూనే.. యాదాద్రి పవర్‌ప్లాంట్‌ ఏర్పాటు, బీబీ నగర్‌లో ఎయిమ్స్‌ ఏర్పాటుకు చేస్తున్న యత్నాలను వివరించనుంది.

కాంగ్రెస్‌ పార్టీ మాత్రం 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదంటూ ఆరోపణాస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. రూ.3 వేల కోట్లతో చేపట్టిన శ్రీశైలం సొరంగ మార్గం నత్తకు నడకలు నేర్పుతోందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఈ పనులు పూర్తయితే లబ్ధి చేకూరే దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు ప్రత్యామ్నాయ ప్రాజెక్టులను ముందుకు తేవడంతో సొరంగ మార్గం పూర్తి చేయాలన్న డిమాండ్‌ పలచబడింది.

అయితే, డిండి ఎత్తిపోతల కొత్త పథకం, రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌ ఎత్తిపోతల పథకాల ద్వారా ఈ రెండు నియోజకవర్గాలకు సాగునీరు అందుతుందన్న విషయాన్ని టీఆర్‌ఎస్‌ విస్తృతంగా ప్రచారం చేయడంతో ఎస్‌ఎల్‌బీసీపై దృష్టి తగ్గింది. మొత్తంగా నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో సాగర్‌ ఆయకట్టు చివరి భూములకు నీరందించాలన్న డిమాండ్‌ ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికలపై కొంత ప్రభావం చూపనుంది.

సాగునీటి ప్రాజెక్టులపైనే ఇరు పార్టీల దృష్టి
నల్లగొండ నియోజకవర్గంలోని బ్రాహ్మణవెల్లం ప్రాజెక్టు పూర్తికాకున్నా.. త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ఈ ప్రాంత ప్రజలు నమ్ముతున్నారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలకు ఎస్సారెస్పీ నీరు అందినా.. స్థానిక చెరువుల్లో నీరు నిండలేదన్న అసంతృప్తి ప్రజల్లో ఉంది. హుజూర్‌నగర్‌లోని పులిచింతల నిర్వాసితుల సమస్యనూ కాంగ్రెస్‌ ప్రచారంగా ఎంచుకుంటోంది. కోదాడ నియోజకవర్గంలో సాగునీటితో పాటు వంద పడకల ఆసుపత్రి, మహిళా డిగ్రీ, పాలిటెక్నిక్‌ కాలేజీలు, స్టేడియం ఏర్పాటు అంశాలూ ఓటర్లను ప్రభావితం చేయనున్నాయి.

మునుగోడు నియోజకవర్గంలోనూ సాగునీటి జలాలే ప్రధాన ప్రచారాస్త్రం. మిర్యాలగూడ నియోజకవర్గంలోనూ నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ చివరి భూములకు సాగు నీరు, దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల్లో కృష్ణా నదిపై ఎత్తిపోతల ఏర్పాటుపై కాంగ్రెస్‌ గళమిప్పుతోంది. భువనగిరి నియోజకవర్గంలో మూసీ ప్రక్షాళన పెద్ద సమస్యగా మారింది. సూర్యాపేట నియోజకవర్గంలో.. పాలేరు నుంచి కృష్ణా జలాలను పేటకు రప్పించడం అనే అంశం దీర్ఘకాలిక సమస్యగా ఉంది. ఇక, నకిరేకల్‌ నియోజకవర్గంలోనూ ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి కాల్వలను పూర్తి చేసి సాగునీటి అందిస్తామనే హామీ ఈసారి టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల మధ్య ప్రధాన ప్రచారాస్త్రంగా మారనుంది.

టీఆర్‌ఎస్‌ ప్రచారాస్త్రాలివే..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేస్తోంది. ప్రత్యేకించి జిల్లాలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులను ప్రచారాస్త్రాలుగా వినియోగించుకుంటోంది.
  యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి అభివృద్ధికి రూ.2000 కోట్లు వెచ్చిస్తోంది. టెంపుల్‌ సిటీ నిర్మాణంపై ప్రధానంగా ప్రచారం చేస్తోంది. ఈ జిల్లా పరిధిలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో 1.54 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టులో చివరి ప్యాకేజీ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్లు పూర్తయితే, కాళేశ్వరం నుంచి సాగునీటిని అందిస్తామని చెబుతోంది.
    భువనగిరిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేసిన అంశాన్ని ప్రచారంలో చేర్చింది. భువనగిరి నియోజకవర్గానికి మూసీ నీటిని అందించేందుకు ఉద్దేశించిన బునాదిగాని కాల్వ, పిల్లాయిపల్లి కాల్వ, ధర్మారెడ్డి కాల్వల ఆధునీకరణ కోసం రూ.280 కోట్లు వెచ్చిస్తోంది.
 సూర్యాపేట జిల్లా పరిధిలో చేపట్టిన పనులూ ఆ పార్టీకి ప్రచారాంశాలుగా ఉన్నాయి. ఎస్సారెస్పీ కాల్వల నుంచి గోదావరి జలాలను తరలించి తుంగతుర్తి, సూర్యాపేట జిల్లాల్లోని చెరువులు నింపారు. ఇది రైతులకు ఎంతో ఊరటనిచ్చింది. సూర్యాపేట కొత్త జిల్లా ఏర్పాటుపై బాగా ప్రచారం చేస్తోంది.
 జిల్లా కేంద్రం నల్లగొండకు కొత్త మెడికల్‌ కాలేజీని సాధించిన అంశాన్నీ వివరిస్తోంది.
   మూసీ ప్రాజెక్టు నుంచి పాతికేళ్ల తర్వాత తొలిసారిగా రెండు పంటలకూ (ఖరీఫ్, రబీ) నీరందించడం కూడా టీఆర్‌ఎస్‌ ఘనతగా చెప్పుకుంటున్నారు.
    మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల తాగు, సాగునీటి బాధలు తీర్చేందుకు చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకం గురించి ప్రచారం చేస్తోంది.
   మునుగోడు నియోజకవర్గం పరిధిలో 12 టీఎంసీల సామర్థ్యంతో రూ.1480 కోట్లతో చేపట్టిన చర్లగూడెం రిజర్వాయరు, 8 టీఎంసీల సామర్థ్యంతో రూ.500 కోట్లతో చేపట్టిన లక్ష్మణపురం రిజర్వాయర్ల గురించి ప్రచారం చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టింది.
   మిర్యాలగూడెం నియోజకవర్గంలోని దామరచర్లలో చేపట్టిన యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ కోసం రూ.29 వేల కోట్లు వెచ్చిస్తోంది. 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు తన ప్రచారంలో పెద్దపీట వేస్తోంది.

- కె.శ్రీకాంత్‌రావు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top