
ఆకుల రాజేందర్ ,బండారి లక్ష్మారెడ్డి
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో రాజకీయం మరింత రంజుగా మారుతోంది. టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి, కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం జోరందుకుంది. కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ పొత్తును నిరసిస్తూ బుధవారం ఉప్పల్ నియోకజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండారి లక్ష్మారెడ్డి భారీ అనుచరగణంతో టీఆర్‌ఎస్‌లో చేరిపోగా, టీఆర్‌ఎస్‌లో ప్రజాస్వామ్యం లేదంటూ మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ తన అనుచరులతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ఇదిలా ఉంటే త్వరలో ఇరు పార్టీల నుండి వలసలు, చేరికలు భారీగా కొనసాగే ఛాన్స్
కనిపిస్తోంది. టీఆర్‌ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాపై పలు నియోజకవర్గాల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తిని చల్లార్చే పనిలో మంత్రి కేటీఆర్ సంప్రదింపులు చేస్తున్నా పలు నియోజకవర్గాల్లో అవి ఫలితం ఇస్తున్న దాఖలాలు కనిపించటం లేదు. నగరంలో మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో ముఖ్యనాయకులు ఇంకా అసంతృప్తితోనే ఉన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఐతే పార్టీ ముఖ్య నాయకుడు హరీష్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే సంకేతాలు ఇచ్చినా ఆయన ఏ మాత్రం తగ్గకుండా తానే టీఆర్‌ఎస్ పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం.
అభ్యర్థులు ప్రకటించని స్థానాల్లో.. అదే టెన్షన్
నగరంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రకటించని స్థానాల్లో అదే టెన్షన్ సాగుతోంది. ఐతే మల్కాజిగిరిలో తాజా మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు చింతలవిజయశాంతికి, అంబర్‌పేటలో కాలేరు వెంకటేష్‌కు, గోషామహల్‌లో మాజీ మంత్రి దానం నాగేందర్‌కు టికెట్లు దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ముషీరాబాద్, ఖైరతాబాద్, మేడ్చల్ స్థానాల్లోనే ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఉంది. ముషీరాబాద్ సీటు కోసం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పట్టుబడుతుండగా, ఖైరతాబాద్‌లో కార్పొరేటర్ విజయారెడ్డి, నియోకజవర్గ ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డిలు టికెట్‌పై పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఇక మేడ్చల్ అంశాన్ని ఎటూ తేల్చని వైనంతో తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సన్నిహితుల వద్ద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయన కేసీఆర్‌ని కలిసే ప్రయత్నం చేసినా అపాయిట్‌మెంట్ దొరకలేదు. కాగా, ఈ సీటుపై అభ్యర్థి ఎంపిక బాధ్యతను మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డికే పార్టీ వదిలేసినట్లు సమాచారం. ఐతే ఈ స్థానంలో తాను పోటీ చేయాలా లేక తన కుటుంబానికి చెందిన వారిని పోటీ పెట్టాలా అన్న అంశంలో ఎంపీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పార్టీ వర్గాలు పేర్కొన్నారు.
కార్పొరేటర్ పదవికి కావ్య రాజీనామా..?
కూకట్‌పల్లి నియోకజవర్గం బాలాజీనగర్ నుండి టీఆర్‌ఎస్ టికెట్‌పై విజయం సాధించిన కార్పొరేటర్ పన్నాల కావ్య తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. కూకట్‌పల్లి నియోకజవర్గ ఎమ్మెల్యే టికెట్‌ను టీడీపీ నుండి వచ్చిన తాజా మాజీ ఎమ్మెల్యే కృష్ణారావుకు ఇవ్వటాన్ని కావ్య భర్త హరీష్‌రెడ్డి తీవ్రంగా నిరసిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని కూడా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో హరీష్‌రెడ్డికి మద్దతుగా టీఆర్‌ఎస్‌కు, కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసే అంశాన్ని ఆమె పరిశీలిస్తున్నట్లు సమాచారం.