వృత్తి నిపుణులు రాజకీయాల్లోకి రావాలి

TPCC leaders at All India Professionals Congress - Sakshi

కాంగ్రెస్‌ వృత్తి నిపుణుల సమావేశంలో ఉత్తమ్, జానారెడ్డి

దేశంలో, రాష్ట్రంలో హక్కుల ఉల్లంఘన

మోదీ, కేసీఆర్‌ పదవుల్లో ఉండేందుకు అనర్హులు

పిలగాడు కేటీఆర్‌ కూడా నెహ్రూపై మాట్లాడటమా అని ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌:  రాజకీయాలతోపాటు దేశాభివృద్ధిలో వృత్తి నిపుణులు భాగస్వామ్యం కావాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. ఆల్‌ ఇండియా ప్రొఫెషనల్స్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శనివారం జరిగిన సదస్సులో ఉత్తమ్‌తోపాటు ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ దక్షిణ భారత ఇన్‌చార్జి జె.గీతారెడ్డి, ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే పద్మావతీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. దేశంలో, రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందని విమర్శించారు. ప్రధానిగా మోదీ, సీఎంగా కేసీఆర్‌ రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి అనర్హులని నిప్పులు చెరిగారు. పెళ్లి, సినిమా, తిండిపై వ్యక్తిగత స్వేచ్ఛను కేంద్ర ప్రభుత్వం హరిస్తోందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేయటంలో సీఎం కేసీఆర్‌ చరిత్ర సృష్టించారని విమర్శించారు. నెహ్రూ, పటేల్‌ మధ్య విభేదాలున్నట్లుగా చరిత్రను మోదీ వక్రీకరిస్తున్నారన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను సర్దార్‌ పటేల్‌ నిషేధించారని, దాన్ని ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు. పిల్లగాడు కేటీఆర్‌ కూడా గాంధీ, నెహ్రూలపై మాట్లాడితే రాజకీయాలపై ఎలాంటి అభిప్రాయం కలుగుతుందో ఆలోచించాలని వ్యాఖ్యానించారు. హుస్సేన్‌సాగర్‌ నీటిని కొబ్బరినీళ్లుగా చేస్తామని కేసీఆర్‌ చెప్పారని.. మరి ‘కొబ్బరినీళ్లు అయినయా’అని ప్రశ్నించారు. స్వాతంత్య్ర ఉద్యమం నుంచి దేశం కోసం, ప్రజల కోసం వృత్తి నిపుణులు పని చేస్తున్నారని ప్రతిపక్ష నేత జానారెడ్డి ప్రశంసించారు. దేశ భద్రత, అభివృద్ధిలో ప్రొఫెషనల్స్‌ బాధ్యత కీలకమన్నారు. రాజకీయాల్లో భాగస్వామ్యం చేసేందుకే రాహుల్‌ గాంధీ ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ ఏర్పాటు చేశారని చెప్పారు. ఇన్‌చార్జి జె.గీతారెడ్డి మాట్లాడుతూ.. వివిధ రంగాల్లోని ప్రొఫెషనల్స్‌ను కాంగ్రెస్‌కు దగ్గర చేసేందుకే ఇది ఏర్పాటైందన్నారు. ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌లో  ప్రస్తుతం  తెలంగాణలో 400 మందికి పైగా సభ్యులు చేరినట్టుగా వెల్లడించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top