ప్రకటించిన అభ్యర్థుల్లో మార్పు ఉండదు..

There Is No Change In Announced Candidates  Said By KCR - Sakshi

టీఆర్‌ఎస్‌ అధిష్టానం స్పష్టీకరణ

విపక్ష అభ్యర్థుల వెల్లడిలోగా ఒక దశ ప్రచారం పూర్తికి కేసీఆర్‌ ఆదేశం

నియోజకవర్గాలవారీగా ప్రచార వ్యూహంతో ముందుకు...

ప్రచార సరళిని పర్యవేక్షిస్తున్న కేసీఆర్‌

రోజూ నివేదికలు, ఫోన్లలో సూచనలు

అసమ్మతి, అసంతృప్తులకు మంత్రి కేటీఆర్‌ బుజ్జగింపులు

భవిష్యత్తులో పదవులపై హామీలు

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికల వ్యూహంలో తెలంగాణ రాష్ట్ర సమితి దూసుకుపోతోంది. అసెంబ్లీ రద్దు రోజునే 90 శాతం సీట్లలో అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్‌... ఆ జాబితాలో మార్పులు ఉండవని స్పష్టం చేస్తోంది. ఆయా నియోజకవర్గాలకు అనుగుణంగా గెలుపు కోసం అవసరమైన ప్రచార సామగ్రిని సైతం అభ్యర్థులకు పంపించింది. ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసేలోపే నియోజకవర్గాల్లో ఒక దశ ప్రచారం పూర్తి చేయాలని ఆదేశించింది. ఇందుకోసం నియోజకవర్గాలవారీగా అవసరమైన ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసి అభ్యర్థులకు తెలియజేస్తోంది.

అభ్యర్థుల ప్రచార సరళిని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. రోజువారీ నివేదికలను తెప్పించుకొని అవసరమైన సూచనలు చేస్తున్నారు. అభ్యర్థులతోనూ స్వయంగా ఫోన్లలో మాట్లాడుతున్నారు. ప్రత్యర్థి పార్టీలు ఏ అభ్యర్థిని బరిలో దింపే అవకాశం ఉందో చెబుతూ అందుకు అనుగుణంగా ప్రచార సరళి ఉండాలని సూచిస్తున్నారు. ప్రచార సామగ్రి పంపిణీ పూర్తి కావడం, నియోజకవర్గాలవారీగా ప్రచార సరళిపై సమీక్షల నేపథ్యంలో అభ్యర్థుల మార్పు ఉండబోదని స్పష్టమవుతోంది. మరోవైపు అసమ్మతి, అసంతృప్త నేతలను దారికి తెచ్చే విషయంలోనూ ముందుగానే సర్దుబాటు చేస్తోంది. 

ముందస్తు ప్రకటనతో... 
గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఎన్నికల షెడ్యూల్‌ సైతం విడుదల కాక ముందే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించింది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండటంతో అప్పటి పరిస్థితులను బట్టి అభ్యర్థుల్లో మార్పు ఉంటుందని పలువురు ఆశావహులు భావించారు. చివరి నిమిషంలో అవకాశం వస్తుందనే ఉద్దేశంతో సొంతంగా ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. మరికొందరు ప్రస్తుత అభ్యర్థులను మార్చాలనే డిమాండ్లను తెరపైకి తెచ్చారు. ముందస్తు ఎన్నికల కోసం అసెంబ్లీని రద్దు చేస్తూ ఈ నెల 6న మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకోవడం, అమోదం పొందడం వెంటవెంటనే జరిగిపోయాయి. రాజకీయ వర్గాలు, టీఆర్‌ఎస్‌ శ్రేణులను ఆశ్చర్యపరుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అదే రోజు ఒకేసారి 105 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించారు.

టీఆర్‌ఎస్‌లోని 90 మంది తాజా మాజీ ఎమ్మెల్యేల్లో 83 మందికి టికెట్‌ కేటాయించారు. నల్లాల ఓదెలు (చెన్నూరు), బాబూమోహన్‌ (అంథోల్‌)లకు అభ్యర్థిత్వాలను నిరాకరించారు. కొండా సురేఖ (వరంగల్‌ తూర్పు), ఎం. సుధీర్‌రెడ్డి(మేడ్చల్‌), సి. కనకారెడ్డి (మల్కాజ్‌గిరి), బొడిగె శోభ (చొప్పదండి), బి. సంజీవరావు (వికారాబాద్‌) టికెట్లను పెండింగ్‌లో పెట్టారు. అయితే ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్న కొందరిని అభ్యర్థులుగా ప్రకటించారనే చర్చ మొదలైంది. కొన్ని నియోజకవర్గాల్లో గతంలో టికెట్‌ హామీ పొందిన వారికి అవకాశం ఇవ్వలేదని, ఎన్నికల షెడ్యూల్‌ వచ్చాక మార్పులు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇదే ఉద్దేశంతో కొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి, అసంతృప్తులు కార్యక్రమాలు మొదలుపెట్టారు.

అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి పలు నియోజకవర్గాల్లో నిత్యం ఇవే జరుగుతున్నాయి. భూపాలపల్లి, ములుగు, స్టేషన్‌ ఘన్‌పూర్, జనగామ, మహబూబాబాద్, వేములవాడ, రామగుండం, మంచిర్యాల, నల్లగొండ, మునుగోడు, ఆలేరు, దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, ఇబ్రహీంపట్నం, షాద్‌ నగర్, మక్తల్, పటాన్‌చెరు, నారాయణఖేడ్, వైరా, సత్తుపల్లి, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, ఉప్పల్‌ నియోజకవర్గాల టికెట్లు తమకే ఇవ్వాలని కొందరు, ఆయా చోట్ల అభ్యర్థులను మార్చాలని మరికొందరు ప్రతిరోజూ నిరసనలు చేపడుతున్నారు. ఇన్నాళ్లూ అయోమయంలో ఉన్న పార్టీ శ్రేణులు సైతం అభ్యర్థల ప్రచారంపర్వంలో పాల్గొంటున్నారు. అసమ్మతి నేతలు మాత్రం ఆఖరి నిమిషం వరకు అవకాశాల కోసం వేచి చూస్తూ సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

అసలు వ్యూహం... 
2014 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన బంగారు తెలంగాణ కోసం రాజకీయ పునరేకీకరణ నినాదంతో రాష్ట్రంలో రాజకీయాలు మారిపోయాయి. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీ, బీఎస్పీ, సీపీఐలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు... ఇలా అన్ని స్థాయిల్లోని వారు టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో టీఆర్‌ఎస్‌ బలోపేతమైంది. అయితే క్షేత్రస్థాయిలో గ్రూపులకు అస్కారం ఏర్పడింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై ఉండే సహాజ వ్యతిరేకతతో తమకు అవకాశాలు వస్తాయని చాలా మంది భావించారు. సీఎం కేసీఆర్‌ గతంలో చెప్పిన ప్రకారం సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో ఏడుగురికి మినహా అందరికీ అవకాశం ఇచ్చారు.

అవకాశం దక్కని వారూ ఎక్కువగానే ఉండటంతో అసమ్మతి, అసంతృప్తి పెరిగాయి. ఆశావహులు ఎక్కువగా ఉండటమే ప్రస్తుత పరిస్థితికి కారణమని, గెలుపు అవకాశాలు ఉన్నందునే పార్టీ టికెట్‌ కోసం పోటీ పెరిగిందని టీఆర్‌ఎస్‌ అధిష్టానం భావిస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యేలోపే అన్ని నియోజకవర్గాల్లోనూ అసమ్మతులు, అసంతృప్తులను లేకుండా చేయాలని నిర్ణయించింది. టీఆర్‌ఎస్‌ కీలక నేత కె. తారక రామారావు ఈ బాధ్యతలను చేపట్టారు. అన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి, అసంతృప్తి నేతలతో చర్చలు జరిపే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. జిల్లాలవారీగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. మంత్రులు, తాజా మాజీ ఎమ్మెల్యేలు, టికెట్లు ఆశించిన భంగపడిన వారిని, ద్వితీయ శ్రేణి నేతలను హైదరాబాద్‌ పిలిచి మాట్లాడుతున్నారు.

గతంలో టికెట్‌ హామీతో పార్టీలో చేరిన వారికి అభ్యర్థుల మార్పు ఉండబోదని, భవిష్యత్తులో ఎమ్మెల్సీ వంటి ఇతర కీలక పదవులు ఇస్తామని చెబుతున్నారు. నియోజవర్గాలవారీగా అసంతృప్తితో ఉన్న ద్వితీయశ్రేణి నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల మార్పు ఉండబోదని, అందరూ కలసికట్టుగా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేయాలని స్పష్టం చేçస్తున్నారు. అభ్యర్థుల ప్రచార సరళిని అడిగి తెలుసుకుంటున్నారు. మార్పులు ఉండబోవనే స్పష్టత రావడంతో పలువురు అభ్యర్థులు నియోజకవర్గాల్లో ప్రచార ప్రక్రియను పెంచారు. నియోజకవార్గాలవ్యాప్తంగా ప్రచార ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రచార రథాలను సిద్ధం చేసుకుంటున్నారు. గ్రామాల వారీగా నేతలతో భేటీలు జరుపుతున్నారు. 

జలగంకు సీఎం కేసీఆర్‌ ఫోన్‌ 
కొత్తగూడెం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జలగం వెంకట్‌రావుకు సీఎం కేసీఆర్‌ శనివారం ఫోన్‌ చేశారు. ఎన్నికల ప్రచార సరళిని అడిగి తెలుసుకున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో ఎలాంటి స్పందన ఎలా ఉందని అడిగారు. ఈ సందర్భంగా జలగం మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజల అనారోగ్య పరిస్థితులను కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కేసీఆర్‌ స్పందిస్తూ ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top