సప్పుడు సమాప్తం!

Telangana ZPTC And MPTC Elections Third Phase Campaign End - Sakshi

నారాయణపేట: జిల్లాలో తుదివిడత ప్రాదేశిక  ప్రచారం ముగిసింది. నారాయణపేట నియోజకవర్గంలోని ధన్వాడ, నారాయణపేట, మరికల్, దామరగిద్ద మండలాల్లో వారంరోజుల పాటు హోరాహోరీగా సాగిన ప్రచారం ఆదివారం సాయంత్రం 5గంటలకు ముగిసింది. ఇన్నాళ్లూ పార్టీ నినాదాలు, సమావేశాలు, రోడ్‌షోల్లో మోగిసన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఇక  పోలింగ్‌ మాత్రమే మిగిలింది.
 
చివరిరోజు హోరెత్తిన ప్రచారం 
నామినేషన్ల ఉపసంహరణతో ప్రారంభమైన ప్రచారం వారంరోజుల పాటు హోరాహోరీగా సాగింది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఒక్కటై పలు స్థానాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను అంతర్గత ఒప్పందంతో బరిలో దింపారు. అధికార పార్టీని ఎదుర్కొనేందుకు ఇరు పార్టీల నేతలు ఒకరికి మించి ఒకరు ప్రచారాన్ని నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగూరావు నామాజీ, రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్, రాష్ట్ర కార్యవర్గసభ్యులు రతంగ్‌పాండురెడ్డి తమ పార్టీ అభ్యర్థులతో పాటు మద్దతు తెలిపిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు.

కేంద్ర ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాబోతోందని, ప్రజాసంక్షేమం కోసం అందరు కలిసి రావాలని పిలుపునిచ్చారు. మరోపక్క కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి కాంగ్రెస్, బీజేపీ మద్దతు దారులతో జెడ్పీటీసీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని పల్లెలో రోడ్‌షోలు నిర్వహించారు. తీలేర్, పూసల్‌పహాడ్‌లో డీసీసీబీ చైర్మన్‌ వీరారెడ్డి, పెద్దచింతకుంటలో హర్షవర్ధన్‌రెడ్డి తదితరులు కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. అలాగే నారాయణపేట ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి తనదైనశైలిలో ముందుకు సాగుతూ నారాయణపేట, దామరగిద్ద మండలాల్లోని ప్రచారాన్ని చేపట్టారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో చేపడుతున్న ప్రజాసంక్షేమ పథకాలను వివరిస్తూ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగాలని కోరారు.అదే విధంగా దామరగిద్ద మండలంలో సీపీఎం రాష్ట్ర నాయకులు సాగర్‌ సైతం తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
 
తాయిలాలతో ఎర 
మూడో విడత పోలింగ్‌కు సమయం ఆసన్నం కావడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకొని వారికి తాయిలాలను అందజేసేందుకు అభ్యర్థులు వారి వారి స్థాయిలో ప్రలోభాలకు తెరలేపారు. ఎలాగైనా తమవైపు తిప్పుకునేందుకు డబ్బు, మద్యం పంపిణీని చేస్తూ తమవలలో వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలాఉండగా కోటకొండలో రాజకీయం రసవత్తరంగా మారింది. సీపీఐ (ఎంఎల్‌)న్యూడెమోక్రసీ, సీపీఎం పార్టీల మైత్రితో కోటకొండ–1 ఎంపీటీసీకి సీపీఎం అభ్యర్థిగా అక్కమ్మ, రెండో ఎంపీటీసీకి సీపీఐ (ఎంఎల్‌) అభ్యర్థి కె.సునీతలు రంగంలో ఉన్నారు.

ఆ పార్టీనుంచి జెడ్పీటీసీ అభ్యర్థి సరళను పోటీలో దింపారు. అధికార పార్టీని ఎదుర్కొనేందుకు మండలంలో కాంగ్రెస్‌ బీజేపీలు చేయి కలిపాయి. కాని కోటకొండలో మాత్రం వామపక్షాలను ఢీ కొనేందుకు టీఆర్‌ఎస్, బీజేపీలు ఒకటయ్యాయి. ఒకటవ ఎంపీటీసీకి బీజేపీ నుంచి కెంచి అనసూయ, రెండో ఎంపీటీసీకి టీఆర్‌ఎస్‌ నుంచి కావలి నాగేంద్రమ్మ రంగంలో ఉన్నారు. బీజేపీ పొత్తుకు సహకరించకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ తామేమి తక్కువ కాదని రెండు ఎంపీటీసీ స్థానాల్లో  పూజ, పెంటమ్మలను పోటీలో పెట్టారు. ఏది ఏమైనప్పటికీ  అందరి దృష్టి కోటకొండపైనే ఉంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top