తిరుగుబాట్లు, ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరి | Sakshi
Sakshi News home page

అనిశ్చితి.. అసంతృప్తి

Published Thu, Nov 15 2018 12:49 AM

Telangana Elections 2018 Grand Alliance Seats Distribution Not Completed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గందరగోళం.. తకరారు.. తెగని పంచాయితీ.. అయోమయం.. అనిశ్చితి.. అసంతృప్తి.. అసమ్మతి.. ఈ పదాలన్నీ కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో ఏర్పడిన మహాకూటమి ప్రస్తుత పరిస్థితికి అతికినట్టు సరిపోతాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరేం చేస్తారో.. అభ్యర్థుల జాబితా ఎప్పుడొస్తుందో.. అందులో ఏయే స్థానాలుంటాయో.. సీట్ల సర్దుబాటు ఇంకా ఎన్నాళ్లు సాగుతుందో.. అసలు ఈ పంచాయితీ ఎప్పటికి తేలుతుందో.. ఏమీ అర్థంకాని పరిస్థితి నెలకొంది. గత రెండు నెలలుగా ఎడతెరపి లేకుండా చర్చలు జరుగుతూనే ఉన్నా.. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ నేతలు పదుల సార్లు కూర్చుని మాట్లాడుకున్నా.. సీట్ల పంచాయితీ తేలడం లేదు.. ఎవరెక్కడ పోటీ చేయాలనే లెక్కలు కుదరడంలేదు. కాలం కరిగిపోతూనే ఉన్నా.. ఈ తకరారుకు తెరపడటంలేదు.. కూటమి కోలుకునే పరిస్థితులూ కనిపించడంలేదు.  

ఆది నుంచీ అదే పరిస్థితి 
ఈ ఏడాది సెప్టెంబర్‌ 6న ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. కానీ అప్పటికి చాలా ముందుగానే కూటమికి బీజం పడింది. అప్పుడెప్పుడో తెరవెనుక పడిన ఈ బీజం.. తెరపైకి వచ్చి కూడా రెండు నెలలు దాటిపోయింది. అప్పటి నుంచీ ప్రతి రోజూ గందరగోళం, సందిగ్ధత కనిపిస్తూనే ఉన్నాయి. అసలు కూటమిలో ఏయే పార్టీలుంటాయనే దానిపై కూడా స్పష్టత లేకుండా సాగిన నేతల చర్చలు.. నెలలు గడుస్తున్నా ముగియకపోవడం కూటమి శ్రేణులను నైరాశ్యంలో ముంచెత్తుతున్నాయి. కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐల్లో  ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీచేయాలనే దానిపై ఇప్పటివరకు స్పష్టత రాకపోవడం కూటమిలో ఎండమావి లాంటి ఐక్యతకు అద్దం పడుతోంది. పోలింగ్‌కు కేవలం 23 రోజులు, ప్రచారానికి 21 రోజులు గడువు మాత్రమే మిగిలి ఉన్నా.. సీట్ల సర్దుబాటు కొలిక్కి రాకపోవడంపై ఆయా పార్టీలు శ్రేణులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయి.

కూటమి నేతలు సీట్లు పంచుకునే లోపు తాము స్వీట్లు పంచుకుంటామని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేసి చాలా రోజులు అయినా, ఇప్పటివరకు సీట్ల సర్దుబాటు కుదరకపోవడం గమనార్హం. తాము 26 స్థానాల్లో పోటీచేస్తామని టీడీపీ, 36 స్థానాల జాబితా ఇచ్చామని టీజేఎస్, 12 స్థానాలు తమకివ్వాల్సిందేనని సీపీఐ పట్టు పట్టిన నాటి నుంచి ఇప్పటివరకు అర్థవంతమైన చర్చలకు కూటమిలో ఆస్కారం లేకుండా పోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఎన్ని సీట్లు పోటీ చేస్తామన్నది అప్రస్తుతమని, గెలుపే ధ్యేయంగా సీట్లను ఎంచుకుంటామని అన్ని పార్టీలు చెబుతున్నా, ఏ పార్టీ కూడా తాము అనుకున్న స్థానాల్లో పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా లేకపోవడం కూటమిలోని గందరగోళ పరిస్థితులను తెలియజేస్తోంది.

ఇందుకు నిదర్శనంగా బుధవారం సాయంత్రం టీజేఎస్‌ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాము పోటీచేస్తున్నట్టు ప్రకటించిన స్థానాల్లో ఇప్పటికే కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రకటించిన స్థానాలుండడం విశేషం. ఆయా స్థానాల్లో తమ పోటీ ఖాయమని, తాము పోటీచేసే చోట్ల స్నేహపూర్వక పోటీలుండవని, తాము మాత్రమే బరిలో ఉంటామని చెప్పిన టీజేఎస్‌ నాయకత్వం.. కాంగ్రెస్‌ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన ఆసిఫాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్‌తో పాటు టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన మహబూబ్‌నగర్‌లోనూ పోటీలో ఉంటామని చెప్పడం కూటమిలో నెలకొన్న సందిగ్ధతను తెలియజేస్తోంది. ఆయా స్థానాల్లో పోటీచేస్తామని చెబుతూనే.. కూటమి ఉంటుందని, అవగాహనతో వెళ్తామని టీజేఎస్‌ నేతలు ప్రకటించడం విడ్డూరంగా ఉందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.  

కాంగ్రెస్‌ ఏకపక్ష ప్రకటన... 
సర్దుబాటు పరిస్థితి అలా ఉంటే.. టికెట్ల పంచాయతీ వారం రోజులుగా కూటమి పక్షాల్లో అప్రతిహతంగా సాగుతోంది. తమ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల జాబితా ఖరారు కోసం టీపీసీసీ నాయకత్వాన్ని ఢిల్లీకి పిలిపించిన నాటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వారం రోజులుగా జాబితాపై కుస్తీలు పట్టిన కాంగ్రెస్‌ నాయకత్వం చివరకు గత సోమవారం 65 మందితో తొలి జాబితా ప్రకటించింది. అందులో టీజేఎస్‌ అడుగుతున్న స్థానాల్లో కూడా అభ్యర్థులను ఏకపక్షంగా ప్రకటించింది. అంతకుముందు ఢిల్లీలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఆర్‌.సి.కుంతియా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ 93 చోట్ల, టీడీపీ 14, సీపీఐ 3, టీజేఎస్‌ 8, ఇంటిపార్టీ 1 స్థానంలో పోటీచేస్తుందని ఏకపక్షంగా చెప్పేశారు. భాగస్వామ్య పక్షాలతో సర్దుబాటు పూర్తికాక ముందే ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీచేస్తుందో చెప్పేసి అన్ని పార్టీలను గందరగోళంలో పడేశారు. అయితే, ఇంటిపార్టీకి ఇస్తామని చెప్పిన ఒక్క స్థానాన్ని కూడా తేల్చకపోవడంతో ఆ పార్టీ బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇక, మిగిలిన పార్టీల్లోనూ ఏ పార్టీ ఎక్కడ పోటీచేయాలన్న దానిపై ఇంతవరకు సరైన అభిప్రాయానికి రాలేకపోయారు.  

కాంగ్రెస్‌లోనూ పెండింగే...! 
కూటమిలోని భాగస్వామ్య పార్టీలే కాదు.. కూటమికి నేతృత్వం వహిస్తున్నామని, పెద్దన్న పాత్ర పోషిస్తున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌లోనూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ టీవీ సీరియల్‌లా సాగుతూనే ఉంది. తాము పోటీ చేస్తామని చెబుతున్న స్థానాల్లో 19 చోట్ల అభ్యర్థులను ప్రకటించలేకపోయింది. ఇక, టీడీపీ అడుగుతున్న చోట్ల 11 స్థానాల్లో మాత్రమే స్పష్టత రాగా, మిగిలిన స్థానాలు ఎక్కడెక్కడన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. టీజేఎస్‌ పరిస్థితి మరీ గందరగోళంగా ఉంది. ఆ పార్టీ అడుగుతున్న స్థానాలు వచ్చే పరిస్థితి లేకపోగా, పోటీ చేయాలనుకుంటున్న చోట కూడా కాంగ్రెస్‌ మెలికలు పెడుతోంది. దీంతో చేసేదేమీ లేని పరిస్థితుల్లో టీజేఎస్‌ నాయకత్వం తాము పోటీచేయాలనుకుంటున్న 12 స్థానాలను ప్రకటించి బంతిని కాంగ్రెస్‌ కోర్టులోకి నెట్టేసింది.

సీపీఐ కూడా దింపుడు కళ్లెం ఆశలతో 3 సీట్లకు సరిపెట్టుకుంటామని చెబుతూనే.. దేవరకొండ స్థానం కాంగ్రెస్‌ వదిలిపెడుతుందని నమ్మకముందని వ్యాఖ్యానించింది. మరోవైపు అభ్యర్థులను ప్రకటించిన చోట్ల తిరుగుబాట్లు, ఆందోళనతో కూటమి పక్షాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఇక, అందరం ఒకేచోట కూర్చుని అభ్యర్థులను ప్రకటిస్తామని, అక్కడే కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ)ని ప్రకటిస్తామని చెప్పినప్పటికీ అవేవీ జరిగే పరిస్థితులు కనిపించడంలేదు. ఎవరికి వారే టికెట్లు ప్రకటించుకుంటుండగా, సీఎంపీ ఎప్పుడు ప్రకటిస్తారన్నది కూడా తేలడంలేదు. ఈ పరిస్థితుల్లో అసలు కూటమి ఏ తీరం చేరుతుందో అర్థంకాని పరిస్థితులు అటు రాష్ట్ర రాజకీయ వర్గాలను, ఇటు ఆయా పార్టీలను గందరగోళానికి గురిచేస్తున్నాయి.  

Advertisement

తప్పక చదవండి

Advertisement