తేలని అభ్యర్థుల ఎంపిక

TDP not Confirm Tirupati Assembly Seats - Sakshi

వెనుదిరిగిన నేతలు 4 వతేదీ తరువాత ప్రకటించే అవకాశం!

ఎమ్మెల్యే నువ్వా.. మీ అల్లుడా? చెప్పాలని నిలదీసినట్టు సమాచారం

చిత్తూరు, తిరుపతి తుడా: తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కిరాకపోవడంతో ఆశావహుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. రెండు రోజుల పాటు అమరావతిలోని సీఎం క్యాంప్‌ ఆఫీస్‌లో తిష్టవేసిన నేతలకు చుక్కలు చూపించిన పార్టీ అధినేత లెక్క తేల్చకుండానే వెనక్కి పంపించారు. తమ అభ్యర్థనలను, అవకాశాలను పరిశీలించాలని అధినేతకు చెప్పుకునే అవకాశం రాకపోవడంతో కొందరు నేతలు సన్నిహితుల ముందు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పరిశీలకుడు డాక్టర్‌ శివప్రసాద్‌ ముందు మాత్రమే ఆశావహులు తమ గోడు చెప్పుకునే అవకాశం దక్కింది. దీంతో సంతృప్తి చెందని నేతలు అధినేతను కలిసే అవకాశం కూడా ఇవ్వకపోవడంపై గుర్రుగా ఉన్నారు.

అన్ని నియోజకవర్గాల నేతల ముందు పార్టీ కోసం పనిచేయాలి, ఎవరికి టికెట్టు ఇచ్చినా పనిచేయాలనే మాటలతో కార్యక్రమాన్ని ముగించినట్టు సమాచారం. తిరుపతి పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెట్లలో గూడూరు అసెంబ్లీకి అభ్యర్థిగా పాశం సునీల్‌ పేరును దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాలతో పాటు సూళ్లూరుపేట స్థానాలకు అభ్యర్థుల ఎంపికను సీఎం చంద్రబాబు పెండింగ్‌లో పెట్టారు. కనీసం సూత్రప్రాయంగా కూడా ఎవరు అభ్యర్థనే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదని తెలుస్తోంది. ఈ స్థానా లకు అభ్యర్థులను ఈ నెల 4న జిల్లా పర్యటన తరువాతనే ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. పర్యటన ముందు ప్రకటిస్తే వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందని గుర్తించే ఎంపికను వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

నువ్వా.. అల్లుడా?
తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా చైర్మన్‌ నరసింహాయాదవ్‌ మధ్య తలెత్తిన విభేదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరితో వేర్వేరుగా మాట్లాడారు. ముందుగా ఎమ్మెల్యే సుగుణమ్మకు పిలుపువచ్చింది. ఆమె చంద్రబాబు వద్ద మాట్లాడే సమయంలో ఎస్సీవీ నాయుడితోపాటు జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీకూడా అక్కడే కూర్చొని ఉన్నారు. ‘తిరుపతిలో మీ పెత్తనం ఎక్కువైంది. పార్టీ నేతలతో మీ విభేదాలు ఎక్కువయ్యాయి. అసలు ఎమ్మెల్యే మీరా? మీ అల్లుడా? చెప్పండి. ఇకనైనా పద్ధతి మార్చుకోండి? విభేదాలు వీడండి.’ అని చంద్రబాబు గట్టిగా మందలిం చినట్టు ఓ నేత చెప్పారు.

ఇంకోసారి ఫిర్యాదులు రాకుండా చూసుకోండని సూచించారు. తుడా చైర్మన్‌తో ఉన్న విభేదాలను పరిష్కరించుకోవా లని చెప్పినట్టు తెలుస్తోంది. బయటకు వచ్చిన ఎమ్మెల్యే నరసింహయాదవ్‌తో మాట్లాడుతూ ‘మన మధ్య విభేదాలు ఉన్నాయా.. ఇద్దరం కలిసే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పాను. మీరూ అదే చెప్పండి.’ చెప్పినట్టు తెలిసింది. చం ద్రబాబు వద్దకెళ్లిన తుడా చైర్మన్‌ ఎమ్మెల్యేతో ఎదురైన అవమానాలు, ఇబ్బందులు, తన అనుచరులను పెట్టిన ఇబ్బందులను చెప్పినట్టు తెలిసింది. పార్టీలోని చాలా మందిపై కేసులు పెట్టించారని, ఆర్థికంగా దెబ్బతీశారని, సీనియర్లను గౌరవించడంలేదని సీఎంకు వివరించినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎంపీ శివప్రసాద్‌ అల్లుడు వేణుగోపాల్‌ తిరుపతి ఎంపీతోపాటు సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని మంత్రి నారా లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top