
ఏదైనా సాధించాలన్న పట్టుదల ఆమెకు ఎక్కువ. అందుకే ఇటలీలో పుట్టి పెరిగినా పట్టుబట్టి హిందీ నేర్చుకున్నారు. తనను మించిన వాళ్లెవరూ లేరన్న అహంభావం ఆమెది. అదే విదేశీ మూలాలు ప్రధాని పదవికి అడ్డంకిగా మారినా తెర వెనుక సూపర్ పీఎంగా ఎదిగారు. ఎవరైనా కాస్త ఎదిగితే ఓర్చుకోలేని తత్వం ఆమెది. ఆ లక్షణమే ఎంతోమంది సమర్థులైన నాయకుల్ని కాంగ్రెస్ పోగొట్టుకుంది. ఆమె.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ. రాజీవ్‌గాంధీ హత్యానంతరం కార్యకర్తలు ఎంత బతిమాలినా రాజకీయాల్లోకి రాకుండా ఆరేళ్ల పాటు ఇంటి పట్టునే ఉండిపోయారు. తనకిష్టమైనప్పుడే కార్యకర్తలను అనుగ్రహించి పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆమె జీవితంలో ఎన్నో ఉత్థాన పతనాలున్నాయి.
భారత్‌లో గ్రాండ్ ఓల్డ్ పార్టీని అత్యంత సమర్థంగా నడిపించిన మహిళగా ఆమెది తిరుగులేని చరిత్ర. ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ విదేశాల్లో చికిత్స తీసుకుంటున్నారు. పార్టీ పగ్గాల్ని యువరాజు రాహుల్‌కి అప్పగించి తాను నామమాత్రపు రాజకీయాలకే పరిమితమయ్యారు. మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ, శిశు సంక్షేమం ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైన అంశాలు. సోనియా ఒక పుస్తకాల పురుగు. హిందీ రచయిత మున్షీప్రేమ్‌చంద్ నవలలకి ఆమె అభిమాని. రాజీవ్, రాజీవ్ వరల్డ్ అన్న పేరుతో రెండు పుస్తకాలు రాశారు. ఎంతో రుచిగా వంటలు చేస్తారు. ఐస్‌క్రీమ్, సలాడ్స్ ఇష్టంగా తింటారు. ఆరోగ్యంపై శ్రద్ధతో రోజూ యోగా చేస్తారు.
♦ ఇటలీలో 1946, డిసెంబర్ 9న రోమన్ కేథలిక్ కుటుంబంలో జన్మించారు. తండ్రి స్టీఫెనో మైనో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సోవియట్ యూనియన్‌కి వ్యతిరేకంగా హిట్లర్ ఆర్మీ తరపున పోరాడారు.
♦ సోనియా చిన్నతనమంతా ఇటలీలో ఒర్బాసానో అనే చిన్న పట్టణంలోనే గడిచింది. ఇప్పటికీ సోనియా తల్లి, ఇద్దరు చెల్లెళ్లు అక్కడే ఉంటారు.
♦ ఫుట్‌బాల్ ఆటంటే ప్రాణమిస్తారు. చిన్నప్పుడు ఇరుగుపొరుగుతో కలిసి ఆడేవారు.
♦ 18 ఏళ్ల వయసులో లండన్‌లో కేంబ్రిడ్జిలో ఇంగ్లిష్ కోర్సు చేస్తున్న సమయంలో ఒక రెస్టారెంట్‌లో రాజీవ్‌గాంధీని తొలిసారి కలుసుకున్నారు. మూడేళ్లలో వారిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది.
♦ 1968 జనవరి 13న మొదటిసారిగా ఇందిరాగాంధీని కలుసుకోవడానికి భారత్‌కి వచ్చారు.
♦ రాజీవ్‌తో వివాహానికి ముందు అమితాబ్ బచ్చన్ ఇంట్లోనే కొన్నాళ్లు ఉన్నారు. సోనియా మెహెందీ ఫంక్షన్ కూడా బచ్చన్ ఇంట్లోనే జరిగింది.
♦ 1968, ఫిబ్రవరి 25న రాజీవ్, సోనియా వివాహం జరిగింది.
♦ రాజీవ్‌తో వివాహం తర్వాత ట్యూటర్‌ను పెట్టుకొని మరీ హిందీ నేర్చుకున్నారు. చేనేత చీరలు ధరిస్తూ అచ్చమైన భారతనారిగా మారిపోయారు.
♦ రాహుల్, ప్రియాంక పుట్టాక వారి తోటిదే లోకంగా గడిపారు.
♦ 1984లో ఇందిరాగాంధీ హత్యని కళ్లారా చూసిన ఆమె రాజీవ్‌ను రాజకీయ రొంపిలోకి దిగవద్దని ప్రా«ధేయపడ్డారు. రాజీవ్‌ను కూడా హత్య చేస్తారని భయపడ్డారు. సోనియా భయపడిందే జరిగింది. 1991లో తమిళనాడు ఎన్నికల ప్రచార సభలో రాజీవ్ దారుణ హత్యకు గురయ్యారు.
♦ అత్తగారు, భర్తనూ కోల్పోవడంతో సోనియా మానసికంగా కుంగిపోయారు. రాజకీయాల్లోకి రావాలని కార్యకర్తలు ఎంతగా మొరపెట్టుకున్నా ఆరేళ్లు ఇంటిపట్టునే ఉండిపోయారు.
♦ అన్నివైపుల నుంచి వచ్చిన ఒత్తిళ్లకి తలొగ్గి 1997లో కాంగ్రెస్ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. 1998లో పార్టీ పగ్గాలు చేపట్టి అధ్యక్షురాలయ్యారు.
♦ 1999లో తొలిసారిగా యూపీలో అమేథీ, కర్ణాటకలో బళ్లారి నుంచి పోటీ చేసి రెండు స్థానాల్లోనూ నెగ్గారు. అదే ఏడాది లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా ఎన్నికయ్యారు. ఆపై వరుసగా నాలుగుసార్లు ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
♦ 2004లో ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చినా సుష్మాస్వరాజ్, ఉమాభారతి వంటి బీజేపీ నేతలు ఆమె విదేశీ మూలాల్ని లేవనెత్తి సోనియా గద్దెనెక్కితే గుండు గీయించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఒక విదేశీ వనిత చేతుల్లో దేశాన్ని పెట్టాలా అంటూ భగ్గుమన్నారు. దీంతో సోనియా కాళ్ల దగ్గరకొచ్చిన ప్రధాని పదవిని కాదనుకొని మన్మోహన్ సింగ్‌ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారు. కాంగ్రెస్ శ్రేణులు ఆమె త్యాగం చేశారని కీర్తించినా, ఆమె వ్యతిరేకులు యూపీఏ చైర్‌పర్సన్ హోదాలో సూపర్ పీఎంగా తెరవెనుక వ్యవహారాలు నడిపించే వారని నిందించారు.
♦ 2004లో ప్రపంచంలోనే అత్యంత ప్రభావం చూపిన మహిళల ఫోర్బ్స్ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. 2009 ఎన్నికల్లోనూ సోనియాగాంధీ నేతృత్వంలోనే పార్టీ బ్రహ్మాండమైన విజయాన్ని నమోదు చేసుకుంది.
♦ 2011లో ఆమె తీవ్రమైన అనారోగ్యానికి లోనయ్యారు. ఆమెకు సోకిన వ్యాధిపై కాంగ్రెస్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ప్రతీ ఏడాది అమెరికా వెళ్లి చికిత్స పొందుతున్నారు.
♦ ఇక 2014లో కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ చూడని ఘోర పరాజయాన్ని చవి చూసింది. ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అనంతరం అనారోగ్యం తీవ్రం కావడంతో రాహుల్‌గాంధీకి పార్టీ పగ్గాలను అప్పగించారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్‌కి పెద్దదిక్కుగా మాత్రమే ఉన్నారు.