క్రికెట్‌, రాజకీయాల్లో తనదైన ముద్ర

Sharad Pawar Profile - Sakshi

సాక్షి, వెబ్‌ ప్రత్యేకం : శరద్‌ పవార్‌ పేరు వినగానే రాజకీయాలతో పాటు, క్రికెట్‌ కూడా కళ్లెదుట మెదులుతుంది. భారతదేశంలో విపరీతమైన క్రేజ్‌ ఉన్న ఈ రెండు రంగాల్లో తనదైన ముద్ర వేశారు శరాద్‌ పవార్‌. క్రికెట్‌లో రాజకీయాలు చేసినా, రాజకీయాలను ఓ ఆటాడుకున్నా ఆయనకే చెల్లింది. ముంబై క్రికెట్‌ అసోసియేషన్, బీసీసీఐ సారథ్యంతో పాటు ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. అటు రాజకీయ క్రీడలోనూ ఆరితేరారు. అంశమేదైనా అనర్గళంగా మాట్లాడగలరు. శరద్‌ పవార్‌ రాజకీయ గురువు వైబీ చవాన్‌. ఆయన సలహా సూచనలు పాటిస్తూ 1978లో, అత్యంత పిన్న వయసులో (37) మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. నోటి కేన్సర్‌ను జయించి విజేతగా నిలిచారు.

బాల్యం, విద్యాభ్యాసం..
మహారాష్ట్ర పూణెలోని బారామతి పట్టణంలో గోవిందరావ్‌ పవార్‌, శారదా బాయ్‌ పవార్‌ దంపతులకు 1940, డిసెంబరు 12 న జన్మించారు శరాద్‌ పవార్‌. ఆయన అసలు పేరు శరాద్‌ చంద్రా గోవిందరావ్‌ పవార్‌. ఈయనకు తొమ్మిది మంది తోబుట్టువులు. మహారాష్ట్ర ఎడ్యుకేషన్‌ సొసైటీలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు పవార్‌. అనంతరం పూణె యూనివర్సిటీ పరిధిలోని బ్రిహాన్‌ మహారాష్ట్ర కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ నుంచి బీకాం డిగ్రీ పొందారు. చదువులో వెనకబడినప్పటికీ క్రీడలు, ఉపన్యాసం వంటి అంశాల్లో ఆయన చురుగ్గా ఉండేవారు. గోవా స్వతంత్రం కోసం 1956లో ప్రవరానగర్‌లో నిర్వహించిన నిరసన ర్యాలీతో పవార్‌ రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఈ సమయంలోనే ఆధునిక మహారాష్ట్ర నిర్మాతగా ప్రసిద్ధి చెందిన యశ్వంత్‌ చవాన్‌.. పవార్‌లోని నాయకత్వ లక్షణాలను గుర్తించడం ఆయన జీవితంలో కీలక మలుపుగా చెప్పవచ్చు. ఆ తరువాత పవార్‌ యూత్‌ కాంగ్రెస్‌ నాయుకుడిగా.. ఆపై ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీలో సభ్యుడిగా పని చేశారు.

ప్రత్యక్ష రాజకీయ జీవితం..
1967లో ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించారు పవార్‌. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి నియోజకవర్గం నుంచి ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికల్లో పాల్గొని విజయం సాధించారు. ఎమర్జెన్సీ కాలంలో వచ్చిన విబేధాల ఫలితంగా 1978లో కాంగ్రెస్‌ పార్టీని వీడి ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ పార్టీ తరఫున మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించి.. విపక్షాల మద్దతుతో తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండేళ్ల పాటు సీఎంగా పని చేశారు. ఆ తరువాత 1988 - 91 వరకు ఒకసారి, 1993 - 95 వరకు మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పీవీ హాయాంలో 1991  - 93 వరకూ రక్షణ శాఖ మంత్రిగా కూడా పని చేశారు. ఆ తరువాత 1999లో పీఏ సంగ్మాతో కలిసి నేషనలిస్ట్‌  కాంగ్రెస్‌ పార్టీని స్థాపించారు. 2004లో యూపీఏ కూటమిలో చేరి వ్యవసాయ, ఆహార శాఖ మంత్రిగా పని చేశారు. కేంద్ర మంత్రిగా పని చేస్తూనే 2005లో బీసీసీఐ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 2007లో ఐసీసీ వైస్‌ ప్రెసిడెంట్‌గా.. 2010లో ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2014 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

ఆరోపణలు...
శరాద్‌ పవార్‌.. పలు అవినీతి ఆరోపణలే కాక అండర్‌ వరల్డ్‌ మాఫియాతో సంబంధాలు ఉన్నట్టు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంతేకాక సంచలనం సృష్టించిన స్టాంప్‌ పేపర్‌  కుంభకోణం, గోధుమల ఎగుమతి, భూ కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇవే కాక ఐపీఎల్‌కు పన్ను మినహాయింపు ఇవ్వడం, నీరా రాడియా టేపుల వ్యవహారం, ఆస్తుల డిక్లరేషన్‌ వంటి వివాదాల్లో కూడా పవార్‌ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇవన్ని పవార్‌ రాజకీయ జీవితానికి ఓ మచ్చలా మారాయి. అయినా పవార్‌ రాజకీయ ఎదుగుదలకు అవేవీ అడ్డంకి కాలేదు.

కుటుంబం..
శరాద్‌ పవార్‌ భార్య ప్రతిభా పవార్‌. వీరికి ఒక్కతే కుమార్తె. పేరు సుప్రియా సూలే. ఇమే 2009 లోక్‌సభ ఎన్నికల్లో బారామతి నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

ఇష్టాఇష్టాలు
పవార్‌కు వ్యవసాయం, హార్టీకల్చర్‌ అంటే మక్కువ ఎక్కువ. వీటితో పాటు పుస్తక పఠనం, ప్రయాణాలు చేయడం అన్నా పవార్‌కు చాలా ఆసక్తి. ఇక ఆహారం విషయానికొస్తే పవార్‌ సీ ఫుడ్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. కారమిల్‌ కస్టర్డ్‌ పవార్‌కు అత్యంత ప్రీతిపాత్రం.
పిల్లి ధరణి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top