సెహ్వాగ్‌ను ఆహ్వానించాం.. రానన్నాడు..!

Sehwag Refuses BJP Invitation Into Politics Says Top BJP Leader - Sakshi

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ గెలుపుగుర్రాల కోసం ఆయా పార్టీలు గాలింపు చేపట్టాయి. దానిలో భాగంగానే వెస్ట్‌ ఢిల్లీ నుంచి పోటీచేయడానికి వెటరన్‌ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ను సంప్రదించామని ఓ బీజేపీ సీనియర్‌ నేత వెల్లడించారు. రాజకీయాల్లోకి రావాలనే తమ పార్టీ ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించాడని చెప్పుకొచ్చారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజకీయాల్లోకి రావడం లేదని సెహ్వాగ్‌ పేర్కొన్నట్టు సదరు బీజేపీ ప్రతినిధి తెలిపారు.

ఇదిలాఉండగా.. హర్యానాలోని రోహ్‌తక్‌ నుంచి సెహ్వాగ్‌ బీజేపీ తరపున బరిలోకి దిగుతాడనే ప్రచారం ఫిబ్రవరిలో జోరుగా సాగింది. ఆ వార్తలపై సెహ్వాగ్‌ ట్విటర్‌ వేదికగా తనదైన రీతిలో స్పందించారు. ‘గాలి వార్తల ప్రచారంలో ఇక ఏ మార్పు రాదా. 2014లో కూడా ఇలాంటి వార్తలే షికారు చేశాయి. 2019లోనూ అవే వార్తలు. కొత్తదనం ఏమీ లేదు. అప్పుడు చెప్పాను. ఇప్పుడూ చెప్తున్నాను. రాజకీయాంటే నాకు ఆసక్తి లేదు’ అంటూ తెగేసి చెప్పాడు. 
(బీజేపీ అభ్యర్థిగా లోక్‌సభ బరిలో గౌతం గంభీర్‌)
బీజేపీ ‘సంపర్క్‌ ఫర్‌ సమర్థన్‌’ కార్యక్రమంలో భాగంగా గతేడాది జూలైలో ఆ పార్టీ ఎంపీ రాజ్యవర్థన్‌సింగ్‌ రాథోడ్‌, ఢిల్లీ బీజేపీ చీఫ్‌ మనోజ్‌ తివారీ సెహ్వాగ్‌తో భేటీ అయ్యారు. దీంతో సెహ్వాగ్‌ రాజకీయ అరంగేట్రం ఖాయం అంటూ సంకేతాలు వెలువడ్డాయి. కాగా, వెస్ట్‌ ఢిల్లీ నుంచి బీజేపీ నేత పర్వేష్‌ వర్మ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ కూడా పోటీకి దిగుతున్నాడని వార్తలు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు గత శుక్రవారం ఢిల్లీలో బీజేపీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గంభీర్‌ను న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీలో నిలపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి ప్రస్తుతం మీనాక్షి లేఖీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top