ఏం చేయాలో అర్థం కావడం లేదు : జగ్గారెడ్డి

Sangareddy MLA Jagga Reddy Criticized KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది పాలన పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి, మంత్రులకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం గాంధీభవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించారు. 17 వేల కోట్ల మిగులు ఆదాయంతో దేశంలో హుందాగా ఉన్న తెలంగాణ, నేడు కేసీఆర్‌ అసమర్థ పాలన వల్ల 3 లక్షల కోట్ల అప్పులతో దివాళా రాష్ట్రంగా మారిపోయిందని విమర్శించారు. ఆయన మాటల్లోనే.. నిరుద్యోగ భృతి, రుణమాఫీ, కొత్త ఉద్యోగాలు, పీఆర్సీ, రైతు బంధు, మద్దతు ధరలు, ధరల నియంత్రణలలో ఏవీ అమలు కాలేదు. అవినీతిలో 5వ స్థానం, విద్యలో 13వ స్థానంలో ఉండడం బాధాకరం. విద్యా, వైద్యం పరిస్థితి దారుణంగా ఉంది. హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. రోడ్లపైన హత్యలు జరుగుతున్నాయి. మహిళల పట్ల ప్రభుత్వానికి చిన్న చూపు ఉంది. శాంతి భద్రతల విఘాతంలో దేశంలో రెండో స్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ అంటే చెడ్డపేరు వచ్చేవిధంగా మారిపోయింద’ని వ్యాఖ్యానించారు. 

ఇంకా ‘రెవెన్యూ ప్రక్షాళన అంటూ ఇంకా 11 లక్షల మంది రైతులకు పాసుబుక్కులు ఇవ్వలేదు. పంచాయితీలకు, మున్సిపాలిటీలకు నిధులు లేవు. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలు, మంత్రులు అడిగే పరిస్థితి లేదు. గతంలో ఎమ్మెల్యేకు ఏడాదికి మూడు కోట్లు ఇచ్చేవారు. ఇప్పుడు ఒక్క పైసా లేదు. ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? సంగారెడ్డి ప్రజలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. గతంలో సింగూరు, మంజీరా నీరు బయటకు వదలొద్దంటే హరీష్‌రావు వినలేదు. ఇప్పుడు సంగారెడ్డి ప్రజలు నీరు లేక ఇబ్బంది పడుతున్నారు. నేను ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు. ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రికి గుర్తు చేస్తున్నా’నంటూ వివరించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top