చదువు కోసం మారుపేరుతో చలామణి 

Rahul Gandhi Interesting Facts About Congress President - Sakshi

రాహుల్‌ గాంధీ

సాక్షి వెబ్ ప్రత్యేకం : లోక్‌సభ సాక్షిగా దేశ ప్రధానమంత్రిని కౌగిలించుకుని ఆ తర్వాత తన స్థానం నుంచి కన్నుగీటి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ చర్యతో ఆయనపై సోషల్ మీడియాలో లెక్కలేనన్ని సెటైర్లు. ఈమధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రాహుల్‌ గాంధీ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. భారత తొలి ప్రధాన మంత్రి పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూకు ముని మనవడు. తొలి మహిళా ప్రధాన మంత్రి ఇందిరాగాంధీకి మనవడు. ఎల్‌టీటీఈ తీవ్రవాదుల దాడిలో మరణించిన రాజీవ్‌ గాంధీకి, రెండు యూపీఏ ప్రభుత్వాలను తెర వెనకనుంచి నడిపించిన సోనియా గాంధీకి స్వయాన పుత్రుడు. 2004 లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అంతకుముందు తన తండ్రి ప్రాతినిథ్యం వహించిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథి నుంచి పోటీ చేశారు. 2007 సెప్టెంబర్‌ 24వ తేదీన కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. పదేళ్లకుపైగా అదే పదవిలో కొనసాగిన ఆయన 2017 డిసెంబర్‌ 16వ తేదీన పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర వహించి, ఆ మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను కూల్చారు. పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో చురుకైన పాత్ర వహించారు. ఈ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పదవిపై ఏర్పడిన పోటీని సోదరి ప్రియాంక గాంధీ చొరవతో పరిష్కరించి, వ్యూహాత్మకంగా ఆమెను పార్టీ క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 

విద్యాభ్యాసం
రాహుల్‌ గాంధీ 1970 జూన్‌ 19వ తేదీన ఢిల్లీలో పుట్టారు. ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. తర్వాత డెహ్రూడూన్‌ వెళ్లారు. ఆ తర్వాత ఫ్లోరిడాలోని హార్వర్డ్‌ కాలేజీ, రోలిన్స్‌ కాలేజీల్లో ‘బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌’లో డిగ్రీ పూర్తి చేశారు. అక్కడి నుంచి కేంబ్రిడ్జి యూనివర్శిటీకి వెళ్లి ట్రినిటీ కాలేజీ నుంచి డెవలప్‌మెంట్‌ స్టడీస్‌లో ఎంఫిల్‌ పూర్తి చేశారు. విద్యాభ్యాసం పట్ల అంతగా ఆసక్తి చూపక పోవడం వల్ల, ఎల్‌టీటీఈ తీవ్రవాదులు చేతుల్లో ఆయన తండ్రి రాజీవ్‌ గాంధీ హత్యకు గురవడం వల్ల, మరో పక్క సిక్కు ఉగ్రవాదుల నుంచి తన కుటుంబానికే ముప్పు పొంచి ఉన్నందు వల్ల రాహుల్‌ పలు కళాశాలలతోపాటు పలు ప్రాంతాలకు మారాల్సి వచ్చింది. 

ఆసక్తికర అంశాలు

 • 1991లో రాజీవ్‌ గాంధీ హత్యానంతరం భద్రతా కారణాల రీత్య రాహుల్‌ గాంధీని ఫ్లోరిడాలోని రోలిన్స్‌ కాలేజీకి మార్చారు. అక్కడ రాహుల్‌ గాంధీ, రాహుల్‌ విన్సీ అనే మారు పేరుతో చెలామణి అయ్యారు. ఆయన ఎవరో కాలేజీ ఉన్నతాధికారులు, భద్రతా ఏజెన్సీలకు తప్ప మరెవరికి తెలియనీయలేదు. 
 • రాహుల్‌ గాంధీ, అదితి సింగ్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్నారంటూ 2017లో సామాజిక మీడియా కోడై కూసింది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఐదు సార్లు విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు అఖిలేష్‌ కుమార్తె అదితి సింగ్‌ (29) 2017లో రాయబరేలి అసెంబ్లీ సీటుకు పోటీ చేసి సమీప ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థిపై 90 వేల మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల సందర్భంగా, ఆ తర్వాత కూడా రాహుల్‌ గాంధీ, ఆమె రాసుకుపూసుకు తిరుగుతున్నారంటూ వదంతులు వచ్చాయి. వీటిపై రాహుల్‌ గాంధీ స్పందించలేదు. తమ మధ్య ఎలాంటి వ్యవహారం లేదంటూ అధిత సింగ్‌ ఆ తర్వాత తేల్చి పారేశారు. ఆమె అమెరికాలోని డ్యూక్‌ యూనివర్శిటీలో మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేశారు.
 • రాహుల్‌ గాంధీ 2012లో నోవల్‌ జహర్‌ అనే అమ్మాయితో పలు చోట్ల కనిపించడంతో వారిరువు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వదంతులు వచ్చాయి. 40 ఏళ్లపాటు అఫ్ఘాన్‌ రాజుగా అధికారంలో ఉన్న మొహమ్మద్‌ జహిర్‌ షాకు ఆమె మనవరాలు అవడం, ఆమె తండ్రి ఇటాలియన్‌ మదర్‌ను చేసుకోవడం, సోనియా గాంధీ ఇటలీ ఇంట్లో, ఢిల్లీలోని ఓ జిమ్‌లో రాహుల్‌తో కలిసి ఆమె కనబడడంతో పెళ్లంటూ వార్తలు వచ్చాయి. 2013లో ఆమె ఈజిప్టు యువరాజు మొహమ్మద్‌ను పెళ్లి చేసుకోవడంతో ఆ వార్తలకు తెరపడింది.
 • రాహుల్‌ గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకి రాకముందు, వచ్చాక కూడా అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్, జవహర్‌లాల్‌ నెహ్రూ మెమోరియల్‌ ఫండ్, సంజయ్‌ గాంధీ మెమోరియల్‌ ట్రస్ట్, రాజీవ్‌ గాంధీ ఛారిటబుల్‌ ట్రస్ట్, ఇందిరా గాంధీ మెమోరియల్‌ ట్రస్ట్‌ కార్యక్రమాలతో ఆయనకు అనుబంధం ఉంది. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్‌లో ఆయన లాభాపేక్ష లేకుండా కంటి చికిత్స కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.
 •  2009 లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాహుల్‌ గాంధీ దేశవ్యాప్తంగా సుడిగాలిలా తిరుగుతూ ఆరు వారాల్లో 125 ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు.

ముఖ్యమైన ఘట్టాలు 

 • రాహుల్‌ గాంధీ 2004లో మొదటి సారి అమేథి నుంచి లోక్‌సభకు పోటీ చేసి లక్షకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 
 • 2004 నుంచి 2006 వరకు హోం వ్యవహరాల పార్లమెంట్‌ స్థాయీ సంఘంలో సభ్యునిగా ఉన్నారు. 
 • 2007లో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అలాగే  యువజన కాంగ్రెస్, విద్యార్థి సంఘాలకు జనరల్‌ సెక్రటరీ ఇంచార్జిగా వ్యవహరించారు. 
 • 2007 నుంచి 2009 వరకు పార్లమెంట్‌లో మానవ వనరుల అభివద్ధి స్థాయీ సంఘంలో సభ్యునిగా కొనసాగారు. 
 • 2009లో మళ్లీ అమేథి నుంచి లోక్‌సభలో రెండోసారి ఎన్నికయ్యారు. ఈ సారి ఆయన అనూహ్యంగా సమీప ప్రత్యర్థిపైన 3,70,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నాడు యూపీలో కాంగ్రెస్‌ పార్టీ 21 లోక్‌సభ సీట్లను గెలుచుకోవడం రాహుల్‌ సాధించిన ఘనతగా పేరు వచ్చింది. 
 •  2013లో కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షునిగా రాహుల్‌ గాంధీ నియమితులయ్యారు. 
 • 2014 ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ మరోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాలు, కన్సల్టేటివ్‌ కమిటీ అనే మూడు పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో సభ్యునిగా చేరారు. 
 •  రాహుల్‌ గాంధీ 2017 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
  - వి. నరేందర్‌ రెడ్డి
Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top