అసెంబ్లీలో పుష్పశ్రీవాణి కంటతడి

Pushpa Sreevani Gets Emotional In AP Assembly - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి భావోద్వేగానికి గురయ్యారు. స్పీకర్‌కు ధన్యవాద తీర్మానం సందర్భంగా ఆమె గురువారం సభలో కంటతడి పెట్టారు. ఒక గిరిజన మహిళ అయిన తనను డిప్యూటీ సీఎంగా నియమించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. అట్టుడుగు వర్గాల గొంతు కూడా చట్టసభల్లో వినిపించేలా అవకాశం కల్పించారన్నారు. అదేవిధంగా గత సభలో విలువలు, విశ్వసనీయతకు పాతర వేశారని, ఈ సభ గొప్పగా నడుస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. 

అ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ...‘ముందుగా స్పీకర్‌గా ఎన్నికైనందుకు అభినందనలు. మీరు మా పక్క జిల్లాకు చెందిన వ్యక్తి. అలాంటి మీరు స్పీకర్‌గా ఎన్నికైనందుకు సంతోషంగా ఉంది. మిమ్మల్ని స్పీకర్‌గా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రికి కూడా ధన్యవాదాలు. స్పీకర్‌ అంటే ఇక్కడున్నటువంటి 174 మంది సభ్యులకు కూడా మీరు కుటుంబ పెద్దలాంటి వారు. ఆరుసార్లు శాసన సభకు ఎన్నికై..మంత్రిగా అనేక సంవత్సరాలుగా పని చేసిన మీకు స్పీకర్‌ పదవి అప్పగించడం సహేతుకంగా భావిస్తున్నాను. చట్టసభలపై, రాజ్యంగంపై మీకు సంపూర్ణమైన అవగాహన ఉంది. మీరు ఈ సభను గొప్పగా నడిపిస్తారని నమ్మకం ఉంది. పరిపాలన, ప్రజా సమస్యలపై మీకు పూర్తిగా పట్టు ఉంది కనుక మీరు విజయవంతంగా పని చేస్తారని ఆకాంక్షిస్తున్నాను.

నేను రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. మొదటిసారి ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో అడుగుపెట్టాను. అయితే ఈ సభలో విలువలు, విశ్వసనీయతను గత సభలో చూడలేకపోయాం. రాజ్యాంగ విలువలు దెబ్బతీసిన తీరు చూసి బాధపడ్డాను. ఇదే సభలో అప్పుడు చిన్న వయసులో ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చూపిన తీరు చూసి గర్వపడ్డాను. ఏ సభలో అయితే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారో అదే సభను గొప్పగా నడిపిస్తారని ఆశిస్తున్నాను. మా నాయకుడు వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో ఈ సభ దేశంలోనే గర్వంగా ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాను. ప్రజా గొంతుకను గర్జనలా వినిపించిన మీరు ఐదుకోట్ల ప్రజల గొంతుకను వినిపిస్తారని సంపూర్ణ నమ్మకం ఉంది. 

ఎంతో గొప్ప ఆదర్శాలకు మన ముఖ్యమంత్రి స్వీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించారు. ఒక గిరిజన మహిళ అయిన నన్ను ఒక ఉప ముఖ్యమంత్రిగా చేసి దేశానికే గొప్ప సంకేతాన్ని పంపించారు. అదే స్పూర్తితో మీరు గిరిజనులకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాకు గొప్ప అవకాశం ఇచ్చి గిరిజన అభివృ ద్ధికి సహకరించాలని కోరుతున్నాను. ఆనాటి సభలో మహిళా ఎమ్మెల్యే అయిన ఆర్కే రోజాను ఏడాది పాటు సస్పెండ్‌ చేసిన తీరును చూశాం. మహిళల సమస్యలను మీ వద్ద విన్నవించుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. ప్రతిపక్ష నాయకుడికి కూడా మైక్‌  ఇవ్వని సాంప్రదాయం చెరిపి..ఈ సభలో అందరికి మైక్‌ ఇచ్చి మాట్లాడే అవకాశం కల్పించాలని కోరుతున్నాను. మిమ్మల్ని స్పీకర్‌గా ఎన్నిక చేసినందుకు బడుగు, బలహీన వర్గాల నాయకుడు వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.’  అని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top