అన్ని అంశాలపైనా చర్చకు సిద్ధం

Prime Minister Narendra Modi says open to discussing all issues - Sakshi

అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ

ఫరూక్‌ అబ్దుల్లా నిర్బంధాన్ని ప్రస్తావించిన ప్రతిపక్షం

నేటి నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం

వాడివేడిగా జరిగేందుకు అవకాశం  

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో అన్ని అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. నేటి నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్షం భేటీలో ఆయన మాట్లాడారు. అయితే, జమ్మూకశ్మీర్‌లో నిర్బంధంలో ఉన్న రాజ్యసభ సభ్యుడు ఫరూక్‌ అబ్దుల్లాను సమావేశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షం కోరింది. ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం వంటి అంశాలపై ప్రతిపక్ష సభ్యులు మాట్లాడారు. సభా నిబంధనలు, నియమాల మేరకు అన్ని అంశాలపై చర్చించేందుకు, మాట్లాడేందుకు అన్ని పక్షాలకు అవకాశం కల్పిస్తామని, వర్షాకాల సమావేశాల మాదిరిగానే ఈసారి కూడా సమావేశాలు ఫలప్రదం కావాలని ప్రధాని ఆకాంక్షించారు. నిర్మాణాత్మక చర్చల ద్వారానే అధికార యంత్రాంగం అప్రమత్తం అవుతుందని ప్రధాని అన్నారని అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు.  

ఆదివారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ,అమిత్‌షా, గులాంనబీ ఆజాద్, విజయసాయిరెడ్డి తదితరులు

ఫరూక్‌ అబ్దుల్లాపై హామీ ఇవ్వని ప్రభుత్వం
జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి రద్దు అనంతరం నిర్బంధించిన ఎన్సీపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఫరూక్‌ అబ్దుల్లాను ఈ సమావేశాలకు హాజరయ్యేలా చూడాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని గట్టిగా కోరాయి. ఫరూక్‌ను నిర్బంధించడంపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు చెందిన ఎంపీ హస్నైన్‌ మసూదీ ప్రస్తావించారు. ఫరూక్‌ను పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యేలా చూడాల్సిన రాజ్యాంగ బాధ్యత ప్రభుత్వానికి ఉందని మసూదీ పేర్కొన్నారు. ‘కశ్మీర్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. సభలో ఈ అంశంపై పట్టుబడతాం’ అని ఆయన తెలిపారు.  

‘ఒక పార్లమెంట్‌ సభ్యుడిని చట్ట విరుద్ధంగా ఎలా నిర్బంధిస్తారు? ఫరూక్‌ అబ్దుల్లాతోపాటు జైల్లో ఉన్న మరో రాజ్యసభ సభ్యుడు మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరంను కూడా పార్లమెంట్‌ సమావేశాలకు అనుమతించాలి’అని ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ అన్నారు. గతంలో ఇలాంటి సందర్భాల్లో సానుకూలంగా స్పందించిన దాఖలాలు ఉన్నాయన్నారు. స్టాండింగ్‌ కమిటీలకు పంపకుండానే అన్ని బిల్లులను ఆమోదించేలా చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.

అన్ని అంశాలపై చర్చకు అవకాశమిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. సభలో మాత్రం మరోవిధంగా వ్యవహరిస్తుందని ఆజాద్‌ ఆరోపించారు. అయితే, ఫరూక్‌ అబ్దుల్లా విడుదలపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వ్యక్తం కాలేదని సమాచారం. ఆర్థిక మాంద్యం, ఉద్యోగాల్లో కోత, వ్యవసాయ సంక్షోభంపై తప్పనిసరిగా చర్చించాలని సభలో కోరతామని లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత ఆధిర్‌ రంజన్‌ చౌధురి వెల్లడించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు అంశాన్ని పాశ్వాన్‌ ప్రస్తావించారు.

హోం మంత్రి, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా, కేంద్ర మంత్రి థావర్‌చంద్‌ గహ్లోత్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, ఆ శాఖ సహాయ మంత్రి అర్జున్‌ మేఘ్వాల్, ప్రతిపక్ష నేతలు అధీర్‌ రంజన్‌ చౌధురి, గులాంనబీ ఆజాద్, రాజ్యసభలో ప్రతిపక్ష ఉప నేత ఆనంద్‌ శర్మ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి వి.విజయసాయి రెడ్డి, టీఎంసీ నేత డెరెక్‌ ఒ బ్రియాన్, ఎల్‌జేపీ నేత చిరాగ్‌ పాశ్వాన్, సమాజ్‌ వాదీ పార్టీ నేత రాంగోపాల్‌ యాదవ్‌ సహా 27 పార్టీలకు చెందిన నేతలు ఈ భేటీకి హాజరయ్యారు.

కాగా, ఆర్థికమాంద్యం, నిరుద్యోగ సమస్య, వ్యవసాయ సంక్షోభం, జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు సహా పలు అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్షం సిద్ధమవుతోంది. ఎన్డీఏ నుంచి శివసేన వైదొలగడం, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బలం పుంజుకోవడం వంటి పరిణామాలతో ఈసారి ప్రతిపక్షం దూకుడుగా వ్యవహరిస్తుందని భావిస్తున్నారు. రాజ్యసభలో పెరిగిన బలం, అయోధ్య వివాదంపై ఇటీవలి సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు బీజేపీలో విశ్వాసం పెంచాయి.  

ఎన్డీయే కూటమి ‘ఉమ్మడి కుటుంబం’
పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఆదివారం ఎన్డీయే కూటమి భేటీ జరిగింది. మోదీ సహా  హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా ఈ సమావేశానికి హాజరయ్యారు. మోదీ ఈ కూటమిని ఉమ్మడి కుటుంబంగా అభివర్ణించారు. ఉమ్మడి కుటుంబంలో వ్యక్తుల మధ్య ఉన్నట్లే పార్టీల మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయన్నారు. ఈ చిన్న సమస్యల వల్ల కుటుంబం దెబ్బతినే పరిస్థితి రాకూడదన్నారు.  పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేలా తోడ్పడాలని కోరారు. సభ్య పార్టీల మధ్య సరైన సమన్వయం కోసం ప్రత్యేకంగా కన్వీనర్‌ లేదా సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని ఎల్జేపీ, అప్నాదళ్, జేడీయూ వంటి పార్టీలు అభిప్రాయపడ్డాయి.  ఎన్డీయేలో సరైన సమన్వయం ఉంటే మహారాష్ట్రలో బీజేపీ–శివసేనల మధ్య ఏర్పడ్డ సంక్షోభం సమసిపోయేదని ఎల్జేపీ నేత చిరాగ్‌ పాశ్వాన్‌ చెప్పారు.

ఎంపీల గైర్హాజరు ఆందోళనకరం: వెంకయ్య
న్యూఢిల్లీ: పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీల సమావేశాలకు ఎంపీలు గైర్హాజరవుతుండ టంపై రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. స్టాండింగ్‌ కమిటీల ప్రమాణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 1952లో రాజ్యసభ ప్రారంభ మైన తర్వాత జరగనున్న 250వ భేటీని పురస్కరించుకుని ఆయన ఆదివారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో మాట్లాడారు. ‘దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్యపై చర్చించేందుకు పట్టణాభివృద్ధి శాఖ స్టాండింగ్‌ కమిటీ ఇటీవల సమావేశం కాగా 28 మందికి గాను నలుగురు ఎంపీలు మాత్రమే హాజరయ్యారు.

అందులో కమిటీ సభ్యుడిగా ఉన్న ఢిల్లీకి చెందిన ఏకైక ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ ఆ భేటీకి రాకుండా ఇండోర్‌లో జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌కు వ్యాఖ్యానం చేస్తూ కనిపించారు’అని వెంకయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘రాజ్యసభ: ది జర్నీ సిన్స్‌ 1952’అనే పుస్తకాన్ని విడుదల చేశారు. హిందూ వివాహ, విడాకుల చట్టం–1952 మొదలుకొని ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ బిల్లు–2019 వరకు, 1953లో ధోతీలపై అదనపు ఎౖMð్సజ్‌ పన్ను నుంచి 2017లో జీఎస్టీ అమల్లోకి తేవడం వరకు రాజ్యసభ పయనం సుదీర్ఘంగా సాగిందని వెంకయ్య అన్నారు. ఈ సందర్భాన్ని పురస్క రించుకుని రూ.250 వెండి నాణెం, పోస్టల్‌స్టాంపును విడుదల చేయనున్నామ న్నారు. కాగా, రాజ్యాంగం ఆమోదం పొంది70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 26వ తేదీన ఉభయ సభల సంయుక్త సమావేశం ఉంటుందన్నారు.

అరుదైన సందర్భం..
67 ఏళ్ల రాజ్యసభ చరిత్రలో ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొన్న సందర్భాన్ని ‘రాజ్యసభ: ది జర్నీ సిన్స్‌ 1952’ పుస్తకం వివరించింది. ‘మే 8, 1991న కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ సవరణ బిల్లుపై ఓటింగ్‌ జరుగుతోంది. అధికార, విపక్షాలకు సమానంగా  ఓట్లు వచ్చాయి. ఆ సమయంలో సభ డెప్యూటీ చైర్మన్‌గా ఉన్న ఎంఏ బేబీ విపక్షాలకు అనుకూలంగా ఓటేశారు’ అని వివరించింది.

పౌరసత్వ బిల్లు సహా 35 బిల్లులు
నేటి నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే రెండోదఫా సమావేశాలివి. దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ భేటీలో ప్రభుత్వం 35 బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వీటిల్లో పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లుతోపాటు అక్రమ వలసదారుల నిర్వచనంపై స్పష్టతనిచ్చే వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు కూడా ఉంది. ఈనెల 18వ తేదీన మొదలై డిసెంబర్‌ 13వ తేదీతో ముగిసే ఈ సమావేశాల్లో పార్లమెంట్‌ 20 సార్లు భేటీ కానుంది. పార్లమెంట్‌ వద్ద 43 బిల్లులు పెండింగ్‌లో ఉండగా ఈ సమావేశాల్లో ప్రభుత్వం 27 బిల్లులను ప్రవేశపెట్టి, చర్చించి, ఆమోదం పొందేందుకు సిద్ధం చేసింది.

పౌరసత్వ బిల్లులో ఏముంది?
1955 పౌరసత్వ చట్టాన్ని సవరిస్తూ బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ తదితర దేశాల నుంచి వచ్చిన హిందు, బౌద్ధ, క్రైస్తవ, సిక్కు, జైన, పార్సీ మతాలకు చెందిన వారిని భారత పౌరులుగా గుర్తించేందుకు వీలు కల్పించేందుకు పౌరసత్వ సవరణ బిల్లులో వీలు కల్పించారు. దీంతోపాటు ప్రభుత్వం కార్పొరేట్‌ ట్యాక్స్‌ను తగ్గింపు ఆర్డినెన్స్‌ స్థానంలో బిల్లును ప్రవేశపెట్టనుంది. వ్యక్తిగత సమాచార పరిరక్షణ (పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌) బిల్లు, అన్ని రకాలైన వివక్ష నుంచి ట్రాన్స్‌జెండర్లకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ బిల్లు, ఎలక్ట్రానిక్‌ సిగరెట్స్‌పై నిషేధం బిల్లు, జలియన్‌ వాలాబాగ్‌ నేషనల్‌ మెమోరియల్‌ ట్రస్టీగా కాంగ్రెస్‌ చీఫ్‌కు ఉన్న హోదాను రద్దు చేయడంతోపాటు ఆ ట్రస్ట్‌ సభ్యులను తొలగించే అధికారాలను ప్రభుత్వానికి కల్పించే బిల్లు ఉన్నాయి.

విద్యుత్‌ దీపాల కాంతిలో పార్లమెంట్‌ భవనం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top