తెలంగాణలో ఎవరిని కొట్టారో చెప్పాలి

Posani Krishna Murali Comments On Pawan Kalyan - Sakshi

పవన్‌కళ్యాణ్‌కు పోసాని సవాల్‌

చంద్రబాబు మాటలే..మాట్లాడుతున్నావు..

మీ అన్న, మీ ఆస్తులను లాక్కుని కొట్టారా? 

విద్వేషాలు రెచ్చగొట్టి.. ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేయొద్దు

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రవాళ్లని కొడుతున్నారని చెబుతున్న పవన్‌కళ్యాణ్‌ ఎవరెవర్ని కొట్టారో చెప్పాలని ప్రముఖ సినీనటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళీ సవాల్‌ చేశారు. పైగా ఆంధ్రులపై దాడులు జరుగుతుంటే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భుజాలకెత్తుకుంటున్నారని ఆంధ్రజ్యోతి పలుకులనే పవన్‌కళ్యాణ్‌ పలికారని విమర్శించారు. గతంలో పవన్‌ ఎవరిని భుజాలకెత్తుకున్నారో ప్రజలకు తెలుసని సంబంధిత వీడియోలను చూపించారు. శనివారం అమీర్‌పేటలో విలేకరులతో మాట్లాడుతూ నాలుగు ఓట్ల కోసం తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టకూడదని హితవు పలికారు. మంచి సీఎం కేసీఆర్‌ అని, తెలంగాణ నాయకులనే స్ఫూర్తిగా తీసుకోవాలని పవన్‌ చెప్పిన మాటలను గుర్తు చేశారు.

సీఎం కూతురు కవిత గురించి మాట్లాడుతూ ‘బంగారు చెల్లీ వేల వేల అభినందనలు, హ్యాప్పీ బర్త్‌డే  అంటూ ట్వీట్‌లు చేసింది మీరు కాదా’ అని ప్రశ్నించారు . ‘కేసీఆర్‌ భూములను ఆక్రమించారని అంటున్నావు ఎక్కడైనా ఆంధ్రావారి భూములు లాక్కున్నట్లు చూపిస్తే పాదాభివందనం చేస్తానని’ పోసాని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో  కేసీఆర్‌ను విమర్శిస్తూ వ్యతిరేకంగా వ్యాసాలు రాసినా ఎవరూ తన జోలికి రాలేదని గుర్తు చేశారు. ‘తెలంగాణ రాష్ట్రంలో నీ ఆస్తులు, మీ అన్న ఆస్తులు ఉన్నాయి కదా.. ఏనాడైనా మిమ్మల్ని బెదిరించారా’ అని పోసాని ప్రశ్నించారు

తెలంగాణలో.. ఎన్టీఆర్‌ను చంపిందెవరు?..
తెలంగాణ నడి బొడ్డులో  ఆంధ్రాకు చెందిన గ్రేట్‌ నాయకుడు, తెలుగు ప్రజల ముద్దు బిడ్డ ఎన్టీరామారావు చనిపోవడానికి కారకుడైన వ్యక్తి చంద్రబాబునాయుడని చెప్పారు. ఆంధ్రా వారిని ఆంధ్రా నాయకుడే చంపించారని తెలిపారు. ఇక ఆంధ్రాలో ఆంధ్రా ప్రజలు క్షేమంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. ‘నిజాయితీగా పనిచేసే మహిళా అధికారి వనజాక్షిని వెంటపడి వెంటపడి కొట్టారు. కొట్టింది తెలంగాణ వారు కాదని, చంద్రబాబు మనుషులని తెలియదా’ అన్నారు. ‘మైక్రో ఫైనాన్స్‌ను అడ్డం పెట్టుకుని ఎంతోమంది మహిళల జీవితాలను నాశనం చేసింది తెలంగాణ వారు కాదే..ఆంధ్రాలో ఉండి  ఏనాడైనా వెళ్లి ఆడవాళ్లకు అండగా నిలిచి కేసులు పెట్టించావా’ అన్ని ప్రశ్నించారు. ఎందుకు చంద్రబాబునాయుడి మాటలు మాట్లాడాల్సి వస్తోందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఒక స్థలం కోసం టీఆర్‌ఎస్‌ నాయకులు ఒక ఎమ్మెల్యేను బెదిరిస్తే.. భయపడి వైఎస్సార్‌సీపీలో చేరతాడా..ఇదే నిజమైతే ఆంధ్రాలో చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను బెదిరించి తీసుకువెళ్లాడా? ఆ ఎమ్మెల్యేలు అమాయకులని చెప్పదలుచుకున్నావా? మీ అన్న పార్టీ పెట్టినప్పుడు మీ ఇంట్లో ఆడవారిని కూడా కించపరిచే విధంగా చంద్రబాబు టీడీపీ నాయకుల చేత మాట్లాడించిన విషయాన్ని మరచిపోయి వైఎస్సార్‌సీపీ నాయకులపై ఆరోపణలు చేస్తున్నావా. విద్వేషాలను రెచ్చగొట్టి జరగరాని ఘనటలు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని’ ప్రశ్నించారు. ఇలాగే  గతంలో రెచ్చగొడితే ముంబాయిలో సేన వాళ్లు ఏమి చేశారో గుర్తు తెచ్చుకో అన్నారు. ‘ఆంధ్ర ప్రజలారా కేసీఆర్‌ విషయంలో పవన్‌కళ్యాణ్, చంద్రబాబునాయుడి మాటలు నమ్మవద్దు. తెలంగాణలో ఆంధ్రా ప్రజలు అంతా క్షేమంగా ఉన్నారు. పవన్‌ కొత్త పార్టీ పెట్టావు. ప్రజలకు మంచిచేయి.చెడు మాత్రం చేయవద్దని  పోసాని హితవు పలికారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top