ఎన్నికల అభ్యర్థులు నిబంధనలు పాటించాల్సిందే..

Political Leaders Awareness on Party Campaign - Sakshi

ఎన్నికల అభ్యర్థులు నిబంధనలు పాటించాల్సిందే..

అతిక్రమిస్తే వేటు గండం తప్పదు

సమావేశాలకూ ముందస్తు అనుమతి తప్పనిసరి

సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎలక్షన్‌ కమిషన్‌ విధించిననియమాలను తప్పనిసరిగా పాటించాల్సిందే. ఇప్పటికే ‘కోడ్‌’ కూయడంతో ప్రతీ అభ్యర్థి జాగ్రత్తగా ఉండాల్సిందే. ఒకవేళ ఆ నిబంధనలను అతిక్రమించడానికి ఎవరైనాప్రయత్నిస్తే.. వారికి వేటు గండం వెంటే ఉంటుంది. ఏప్రిల్‌ 11న జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే! ఎన్నికలయ్యే వరకు అభ్యర్థులను కట్టడి చేసేందుకు ఎన్నికల కమిషన్‌ కోడ్‌ అమలులోకి తేవడంతోపాటు పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు ఎవరైనా వీటిని పాటించాల్సిందే. శ్రుతిమించిన కార్యకలాపాలను బట్టి ఒక్కో ఉల్లంఘనకు ఒక్కో రకమైన శిక్ష పడుతుంది. ఒక్కోసారి జరిమానా, జైలుశిక్ష రెండింటినీ విధించే అవకాశాలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తేప్రజాప్రాతినిధ్య చట్టం–1961 ప్రకారం ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకుంటుంది.మనుగడలో ఉన్న పథకాలను మాత్రమే అమలు చేయాలని, కొత్త పనులు చేపట్టకూడదని ఈసీ ఇది వరకే స్పష్టం చేసింది.

నేర చరిత్ర ఉంటే..
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిపై గతంలో నేర చరిత్ర ఉంటే ఓటర్లకు ఆ చరిత్ర తెలిసేలా స్వయంగా పోటీ చేస్తున్న అభ్యర్థియే మూడు స్థానిక దినపత్రికలకు, ఎలక్ట్రానిక్‌ మీడియా చానళ్లలో ఆ కేసుల వివరాలను ప్రచురిస్తూ ప్రజలకు తెలియపర్చాలి. ఇలా అభ్యర్థినేర చరిత్ర తెలుసుకోవడం కూడా ఓటర్ల హక్కు కిందకు వస్తుందని గతంలో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది.

ప్రచారం..నామినేషన్‌..
రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం నుంచి వంద మీటర్ల పరిధిలోకి మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థి సహా ఐదుగురికి మాత్రమే కార్యాలయంలోకి వెళ్లే అనుమతి ఉంటుంది.
అభ్యర్థి లోక్‌సభ ఎన్నికల్లో రూ.70 లక్షల కంటే ఎక్కువ ఖర్చుచేయరాదు.

అధికార పార్టీకి ప్రత్యేకం..
అధికార పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రభుత్వ పర్యటనలో కలిపి చేయకూడదు.
ప్రచారంలో అధికార యంత్రాంగాన్ని గానీ, ప్రభుత్వ వాహనాలను గానీ వాడకూడదు.
విశ్రాంతి గృహాలు, డాక్‌బంగ్లాలు, ఇతర ప్రభుత్వ వసతి భవనాలకు అందరినీఅనుమతించాలి.
వాటిని ఎన్నికల ప్రచార కార్యాలయంగా ఉపయోగించరాదు.

పోలీసులఅనుమతి..
ఎన్నికల సమావేశాలకు ముందుగానే లిఖిత పూర్వకంగా పోలీసులఅనుమతి తీసుకోవాలి. దీని కోసం మోబైల్‌ యాప్‌ సువిధ ద్వారా కూడా అనుమతులు పొందవచ్చు.
నిషేధాజ్ఞలు, ఆంక్షలు ఉన్న ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహించకూడదు.
సమావేశంలో మైక్, లౌడ్‌ స్పీకర్ల వినియోగానికి కూడా ముందుగాఅనుమతి తీసుకోవాలి.

ఉద్యోగులకు మార్గదర్శకాలు..
ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు లబ్ధి చేకూరేలా వ్యవహరించడం చట్టరీత్యా నేరం.
ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు
ఉద్యోగులు సైతం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున ఎలాంటి ప్రచారాన్ని నిర్వహించకూడదు.

తాత్కాలికకార్యాలయాలు..
ప్రార్థనా స్థలాలకు, పాఠశాలలకు, పోలింగ్‌ కేంద్రాలకు 200 మీటర్ల లోపు అభ్యర్థి తాత్కాలికకార్యాలయం ఉండకూడదు.
రాత్రి 10 గంటల తర్వాత, ఉదయం 6 గంటల్లోపు ఎన్నికల ప్రచారం కోసం మైకులు, లౌడ్‌ స్పీకర్లువాడకూడదు.
రాత్రి 10 గంటల తర్వాత పబ్లిక్‌ సమావేశాలు ఏర్పాటు చేయరాదు. పోలింగ్‌ ముగిసే సమయానికి 48 గంటల ముందే ప్రచారం సమాప్తం కావాలి.
పోలింగ్‌ ఏజెంట్‌ ఆ పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి.
సోషల్‌ మీడియా ద్వారా అభ్యంతరకర వార్తలను ప్రచారం చేయరాదు.
పోలింగ్‌ కేంద్రం నుంచి 100 మీటర్ల లోపు ప్రచారం నిషేధం. మొబైల్‌ ఫోన్‌ కూడా వాడకూడదు.ఆయుధాలతో సంచరించరాదు.

ఊరేగింపు నియమాలు..
ఊరేగింపు మార్గాన్ని పోలీసులకు ముందుగానే తెలియజేయాలి.
మార్గంలో ఏవైనా నిషేదాజ్ఞలున్నాయో ముందుగా తెలుసుకోవాలి.
ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకూడదు.
ఎవరి దిష్టిబొమ్మలను కూడా దహనం చేయకూడదు.

రెచ్చగొడితే కుదరదు..
అభ్యర్థి, పార్టీల నాయకులు కుల, మత, భాషా విద్వేషాలురెచ్చగొట్టకూడదు.
విధానాలు, కార్యక్రమాలపైనేవిమర్శలు ఉండాలి. వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయరాదు.
కుల, మత ప్రాతిపదికపై ఓట్లుఅడగకూడదు. దేవాలయాలు, మసీదులు, చర్చీలు, ఇతర ప్రార్థనా ప్రదేశాలను ఎన్నికల ప్రచారం కోసం వాడకూడదు.
విద్యాసంస్థల్లో గానీ, వాటికి చెందిన మైదానాల్లో గానీ ఎన్నికల ప్రచారం చేయరాదు.
ఓటు కోసం డబ్బు, మద్యం ఇవ్వడం, బెదిరించడం నిషేధం. ఒక వ్యక్తి ఓటును మరో వ్యక్తి వేయడం కూడా చట్టరీత్యా నేరం.

వాహన నిబంధనలు..
ఎన్నికల ప్రచారానికి ఎన్ని వాహనాలనైనా వాడుకోవచ్చు. కానీ ఎన్ని
ఉపయోగిస్తున్నారో రిటర్నింగ్‌ అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఒరిజినల్‌ అనుమతి పత్రాన్ని స్పష్టంగా కనిపించేలా వాహనానికి ముందు అంటించాలి. పర్మిట్‌ మీద వాహనం నంబర్, అభ్యర్థి వివరాలు ఉండాలి. పర్మిట్‌ వాహనాన్ని అదే అభ్యర్థికి వాడాలి. ఇంకో అభ్యర్థికి ఉపయోగిస్తే భారతీయ
శిక్షాస్మృతి సెక్షన్‌–171 హెచ్‌ కింద చర్యలు తీసుకుంటారు.
రిటర్నింగ్‌ అధికారికి చూపించిన వాహనాలు కాకుండా..ఇతర వాహనాన్ని ఎన్నికల కోసం వాడకూడదు. ∙ప్రచారవాహనాలకు మోటారు వెహికిల్‌ యాక్ట్‌కు లోబడివాహనాలకు అదనపు ఫిటింగ్‌లు పెట్టుకోవచ్చు. ∙ఎక్కడ పడితే అక్కడ గోడలకు పోస్టర్లు అంటించకూడదు. ఎక్కడైనా ప్రైవేటు వ్యక్తుల భూములు, భవనాలు, గోడలపై అంటించాలనుకుంటే ఆయా ఆస్తుల యజమానుల లిఖిత పూర్వక అనుమతి తీసుకుని రిటర్నింగ్‌ అధికారికి అందించిన తర్వాతే అంటించాల్సి ఉంటుంది. ∙ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లపై ముద్రణాలయాల పేరు, అడ్రస్‌ విధిగా ఉండాలి.∙

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top