
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలోని రామచంద్రాపురంలో జరిగిన బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టీడీపీపై మండిపడ్డారు. కుల దూషణలకు పాల్పడుతున్న టీడీపీ నేతలను సహించబోమని హెచ్చరించారు. ‘తేడా వస్తే నాలో ఉన్న మరో వ్యక్తిని చూస్తారు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కులాలను వెనకేసుకొస్తున్న నీచ రాజకీయాలతో విసిగిపోయామని అన్నారు. ఇప్పటికే మా తరం తెలంగాణాలో అవమానాలు ఎదుర్కొందని వ్యాఖ్యానించారు.
విశాఖ ఎయిర్‌పోర్టులో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనను ఉటంకిస్తూ.. ‘కోడి కత్తులతో హత్యలు చేసే స్థాయికి రాజకీయాలు దిగజారాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టులో భారీ అవినీతి జరుగుతోందని పవన్ ఆరోపించారు. డ్రెడ్జింగ్ కార్పోరేషన్ మూసివేసే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేనకు ఒక్క అవకాశమిచ్చి చూడండని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులకు, ఆడపడుచులకు అండగా నిలబడతామని భరోసానిచ్చారు.