చిదంబరం అరెస్ట్‌

P Chidambaram Arrested By CBI In INX Media Case - Sakshi

ఐఎన్‌ఎక్స్‌ మీడియా నగదు అక్రమ చలామణి కేసులో అదుపులోకి తీసుకున్న సీబీఐ 

అరెస్ట్‌కు ముందు.. రోజంతా హైడ్రామా

ముందస్తు బెయిల్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో అదృశ్యమైన కేంద్రమాజీ మంత్రి

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు చిదంబరం

శుక్రవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు 

రాత్రి కాంగ్రెస్‌ ఆఫీసులో చిదంబరం ప్రత్యక్షం

అక్కడి నుంచి నేరుగా తన నివాసానికి...

చిదంబరం నివాసంలోనే సీబీఐ అరెస్ట్‌

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు సంబంధించిన నగదు అక్రమ చలామణి కేసులో యూపీఏ హయాంలో కీలక హోం, ఆర్థిక శాఖల మంత్రిగా విధులు నిర్వర్తించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీ చిదంబరంను సీబీఐ అధికారులు బుధవారం రాత్రి అరెస్ట్‌ చేశారు. థ్రిల్లర్‌ సినిమాను తలపించే ఉత్కంఠభరిత మలుపుల నడుమ ఎట్టకేలకు చిదంబరం నివాసంలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి ఆయనను సీబీఐ ప్రధాన కార్యాలయంలోనే ఉంచనున్నారు. గురువారం ఉదయం సీబీఐ ప్రత్యేక కోర్టులో చిదంబరంను హాజరుపర్చే అవకాశముంది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ముందస్తు బెయిల్‌ను నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ అరెస్ట్‌ చోటు చేసుకుంది. అరెస్ట్‌ నుంచి తక్షణమే ఊరట కోరుతూ బుధవారం సుప్రీంకోర్టులో చిదంబరం తరఫు న్యాయవాదులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తక్షణ విచారణ కుదరదని, శుక్రవారం లోపు ఈ కేసును విచారించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దాంతో మంగళవారం సాయంత్రం నుంచి కనిపించకుండా ఉన్న చిదంబరం తప్పనిసరి పరిస్థితుల్లో.. బుధవారం సాయంత్రం కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. తాను ఎక్కడికీ పారిపోవడం లేదని, ఈ కేసులో తాను నిందితుడిని కాదని పేర్కొంటూ తన వాదనను మీడియాకు వినిపించారు. ఆ వెంటనే అక్కడినుంచి జోర్‌ బాఘ్‌లోని తన నివాసానికి వెళ్లారు. కాసేపటికి అక్కడికి వెళ్లిన సీబీఐ అధికారులు ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. ఆయనను అదుపులోకి తీసుకుని సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించారు. చిదంబరం అరెస్ట్, అంతకుముందు చోటు చేసుకున్న పరిణామాలపై కాంగ్రెస్‌ మండిపడింది. ఇది మోదీ సర్కారు కక్ష సాధింపేనని, తామంతా చిదంబరం వెనకే ఉన్నామని స్పష్టం చేసింది. 

(చదవండి : ఇదీ.. చిదంబరం చిట్టా)

ఢిల్లీలో హై ఓల్టేజ్‌ డ్రామా.. 
ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ముందస్తు బెయిల్‌ను నిరాకరిస్తూ మంగళవారం ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిన క్షణం నుంచి.. చిదంబరం కేంద్రంగా దేశ రాజధానిలో ఉత్కంఠభరిత మలుపులతో హైడ్రామా కొనసాగింది. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి చిదంబరం అనూహ్యంగా అదృశ్యమయ్యారు. రెండు గంటల్లోగా తమ ముందు విచారణకు హాజరుకావాలంటూ మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత చిదంబరం ఇంట్లో సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థల అధికారులు నోటీసులు అంటించారు. అయినా, ఆచూకీ తెలియకపోవడంతో చివరకు లుక్‌ ఔట్‌ నోటీసులు జారీచేశారు. చిదంబరం దేశం విడిచి వెళ్లకుండా నిరోధించాలని అన్ని విమానాశ్రయాలకూ సమాచారమిచ్చారు. ఈ లోపు, ఢిల్లీ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలంటూ చిదంబరం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను తక్షణమే విచారించలేమన్న సుప్రీంకోర్టు.. ఆ విచారణను ఏకంగా శుక్రవారానికి వాయిదా వేస్తూ బుధవారం సాయంత్రం నిర్ణయం తీసుకుంది. 

కాంగ్రెస్‌ కార్యాలయంలో ప్రత్యక్షం..  
బుధవారం రాత్రి 8 గంటల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో చిదంబరం అనూహ్యంగా దర్శనమిచ్చారు. అక్కడి విలేకరుల సమావేశంలో తన వాదన వినిపించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, ప్రాణం కన్నా స్వేచ్ఛకు ప్రాధాన్యమిచ్చే తత్వం తనదని చెప్పారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసేందుకు రాత్రంతా(మంగళవారం) తన లాయర్లతో కలిసి పిటిషన్‌ను రూపొందించానన్నారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసుకు సంబంధించి సీబీఐ చార్జిషీట్లో తన పేరు లేదని వివరించారు. ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో శుక్రవారం ఉన్నందున.. చట్టాన్ని గౌరవిస్తూ అప్పటివరకు తనను అదుపులోకి తీసుకోవద్దంటూ దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలను నర్మగర్భంగా కోరారు. చిదంబరం కాంగ్రెస్‌ కార్యాలయంలో ఉన్న విషయం తెలుసుకున్న సీబీఐ అధికారులు అక్కడికి వెళ్లేలోపే.. చెప్పాల్సింది చెప్పేసి వెంటనే కాంగ్రెస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి వెళ్లిపోయారు. అక్కడి నుంచి తన న్యాయవాదులు అభిషేక్‌ మను సింఘ్వీ, కపిల్‌ సిబల్‌లతో కలిసి నేరుగా జోర్‌బాఘ్‌లోని తన ఇంటికి వెళ్లారు. చిదంబరంను అరెస్ట్‌ చేసేందుకు కాంగ్రెస్‌ కార్యాలయానికి వెళ్లిన సీబీఐ అధికారులు.. అక్కడి నుంచి ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడ వారికి కాంగ్రెస్‌ శ్రేణుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. చిదంబరం ఇంటి గేట్‌ కూడా వేసి ఉండటంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఓ పక్క నుంచి గోడ దూకి వారు ఇంట్లోకి వెళ్లారు. మరో పది నిమిషాల్లో సీబీఐకి చెందిన మరో టీమ్, ఈడీ అధికారుల బృందం కూడా అక్కడికి చేరుకున్నాయి. శాంతిభద్రతల నిమిత్తం సీబీఐ కోరడంతో ఢిల్లీ పోలీసులు కూడా అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు కాసేపు చిదంబరంను ప్రశ్నించి, అనంతరం అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయనను తీసుకుని నేరుగా సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.  

చిదంబరం నివాసం వద్ద మీడియాను, కార్యకర్తలను అదుపుచేస్తున్న అధికారులు

బుధవారం ఉదయం నుంచీ సుప్రీంకోర్టులో.. 
బుధవారం ఉదయం నుంచి చిదంబరం బెయిల్‌ కేసుకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానంలో హైడ్రామా కొనసాగింది. చిదంబరం బెయిల్‌కు సంబంధించిన పిటిషన్‌ను తక్షణమే విచారించాల్సిందిగా కపిల్‌ సిబల్‌ నేతృత్వంలోని న్యాయవాదులు పదేపదే జస్టిస్‌ ఎన్వీ రమణ ధర్మాసనాన్ని కోరారు. వారి అభ్యర్థనలను తోసిపుచ్చిన జస్టిస్‌ రమణ.. ఆ పిటిషన్లపై విచారణ ఎప్పుడు జరపాలన్నది ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగోయి నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. ఆ తరువాత సాయంత్రం 5 గంటల సమయంలో శుక్రవారం ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తామని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ ప్రకటించారు. అయితే, ఆ పిటిషన్‌ను ఎవరి నేతృత్వంలోని ఏ ధర్మాసనం విచారిస్తుందనేది గురువారం సాయంత్రం మాత్రమే తెలుస్తుంది. 

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న పార్టీ శ్రేణులు

‘అయోధ్య’హాళ్లోకి.. 
మొదట జస్టిస్‌ రమణ, జస్టిస్‌ శంతనుగౌండర్, జస్టిస్‌ అజయ్‌ రస్తోగిల ధర్మాసనం ముందు కపిల్‌ సిబల్‌ మొదట ఈ పిటిషన్‌ అంశం లేవనెత్తారు. తక్షణ విచారణ అవసరమా లేదా అని నిర్ణయించాల్సిందిగా ఆ పిటిషన్‌ను జస్టిస్‌ రమణ నేతృత్వంలోని ధర్మాసనం సీజేఐ వద్దకు పంపించింది. ఏ సమాచారం రాకపోవడంతో మధ్యాహ్న భోజన విరామం అనంతరం మళ్లీ సిబల్‌ జస్టిస్‌ రమణ ధర్మాసనం ముందు ఈ విషయాన్ని లేవనెత్తారు. పిటిషన్‌లో పొరపాట్లు ఉన్నాయని రిజిస్ట్రీ తమకు సమాచారమిచ్చారని, అందువల్ల, ఈ పిటిషన్‌ను తాము విచారించలేమని వారు స్పష్టం చేశారు. దాంతో కాసేపటి తరువాత ఆ కోర్టు హాలుకు వచ్చిన రిజిస్ట్రీ సూర్యప్రతాప్‌ సింగ్‌ ఆ పొరపాట్లు ఇప్పుడే సరిచేశారని, విచారణ జరిపే ధర్మాసనాన్ని నిర్ణయించే నిమిత్తం ఆ పిటిషన్‌ను సీజేఐ కార్యాలయానికి పంపించామని జస్టిస్‌ రమణ ధర్మాసనానికి తెలిపారు. సీజేఐ అయోధ్య కేసు విచారణలో ఉన్నారని, అది ముగిసేందుకు సాయంత్రం అవుతుందని, అందువల్ల మీరే విచారించాలంటూ కపిల్‌ సిబల్‌ జస్టిస్‌ రమణ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. వారు నిర్ద్వంద్వంగా నిరాకరించడంతో.. సీజేఐ జస్టిస్‌ గొగోయి నేతృత్వంలో అయోధ్య కేసు విచారణ జరుగుతున్న కోర్టు హాళ్లోకి కపిల్‌ సిబల్‌ వెళ్లారు.  

అక్కడ అయోధ్య విచారణ మధ్యలో.. అసాధారణ రీతిలో అ అంశాన్ని సిబల్‌ లేవనెత్తుతారేమోనన్న పలువురు భావించారు. కానీ రాజ్యాంగ ధర్మాసనం ముందు అలాచేయడానికి నిబంధనలు ఒప్పుకోనందువల్ల ఆ అంశాన్ని లేవనెత్తలేకపోయానని అనంతరం సిబల్‌ విలేకరులకు తెలిపారు. శుక్రవారం విచారణకు సీజేఐ నిర్ణయం తీసుకున్నారని తెలిసిన తరువాతే సుప్రీంకోర్టు ఆవరణ నుంచి కపిల్‌ సిబల్‌ బృందం వెళ్లిపోయింది.

థ్రిల్లర్‌ మూవీలా..
చిదంబరం అరెస్ట్‌ వ్యవహారం బుధవారం దేశ రాజధానిలో థ్రిల్లర్‌ సినిమాలా సాగింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుప్రీంకోర్టులో ఒక ఎపిసోడ్‌ కొనసాగింది. చిదం బరానికి అరెస్ట్‌ నుంచి ఊరట కల్పించేం దుకు అక్కడ ఆయన తరఫు లాయర్లు కపిల్‌ సిబల్, సల్మాన్‌ ఖుర్షీద్, ఇందిరా జైసింగ్‌ శతవిధాలా ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. అనూహ్యంగా రాత్రి 8 గంటల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన చిదంబరం మీడి యాకు తన వాదనను చెప్పేసి.. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. సీబీఐ మొదట ఏఐసీసీ ఆఫీస్‌కు, తర్వాత ఆయన ఇంటికి వెళ్లారు. దాదాపు ఓ 30 నిమిషాల తరువాత చిదంబరంను అదుపులోకి తీసుకున్న అధికారులు ఆయనను అక్కడినుంచి సీబీఐ హెడ్‌ క్వార్టర్స్‌కు తరలించారు. 

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో నేను కనీసం నిందితుడిని కూడా కాను. చట్టం నుంచి దాక్కోలేదు. చట్టపరంగా రక్షణ కోరుతున్నాను. నేను చట్టం నుంచి దాక్కుంటున్నానని అంటుండటం చూసి విస్మయం చెందాను. న్యాయం కోసం పోరాడుతున్నాను. ఐఎన్‌ఎక్స్‌ కేసులో నేను కానీ, నా కుటుంబీకులు కానీ, లేదా మరెవ్వరూ నిందితులు కాదు.     – చిదంబరం

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసు 2008లో జరిగిన పరిణామాలకు సంబంధించినది. కేవలం రాజకీయ దురుద్దేశాలతోనే ఇప్పుడు ఈ కేసును అడ్డం పెట్టుకుని మా నాన్నను వేధిస్తున్నారు. – కార్తీ  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top