ఎన్డీయేలో కొనసాగడంపై జేడీయూ స్పష్టత | Sakshi
Sakshi News home page

ఎన్డీయేలో కొనసాగడంపై జేడీయూ స్పష్టత

Published Sun, Jul 8 2018 3:25 PM

Nitish Kumar Says JDU Alliance Continue With BJP - Sakshi

న్యూఢిల్లీ : జేడీయూ అధ్యక్షుడు, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఆర్జేడీ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల నితీశ్‌ బిహార్‌కు ప్రత్యేక హోదా కావాలంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేయడంతో.. ఎన్డీయే నుంచి జేడీయూ వైదొలగనుందనే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో నితీశ్‌ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఎన్డీయే నుంచి జేడీయూ బయటకు రానుందనే వార్తలకు నితీశ్‌ తెరదించారు. తాము ఎన్డీయేలోనే కొనసాగనున్నట్టు స్పష్టం చేశారు. ఆదివారం నితీశ్‌ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 

2019లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో, 2020లో జరగనున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తలెత్తే ప్రధాన సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి ముందు నితీశ్‌ శనివారం సాయంత్రం పార్టీ సీనియర్‌ నేతలతో కూడా చర్చలు జరిపారు. పార్టీ సీనియర్‌లలో ఎక్కువ మంది ఎన్డీయేలో కొనసాగేందుకే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ 17 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement