కాంగ్రెస్‌కు సబితా ఇంద్రారెడ్డి గుడ్‌బై

MLA Sabitha Indra Reddy Leaves Congress Joins TRS - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. మాజీ హోం మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది. తనయుడు కార్తీక్‌ రెడ్డితో సహా ఆమె రేపు(బుధవారం) టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో తమ ఎమ్మెల్యేను పార్టీ మారకుండా బుజ్జగించేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్‌ అధిష్టానం వ్యూహాలు బెడిసికొట్టినట్లైంది. కాగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో సబిత ఇటీవల భేటీ అయినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌..ఆమెకు మంత్రి పదవి ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది.

చదవండి : రాహుల్‌ సభ ముగిసిన మరుసటి రోజే అనూహ్య పరిణామం

ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సీనియర్‌ నేత జానారెడ్డి సబిత ఇంటికెళ్లి పార్టీలోనే కొనసాగాలని, తగిన ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆమె ఇందుకు ససేమీరా అనడంతో కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డిని రంగంలోకి దించారు. పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న సబితకు పార్టీ మారకుండా నచ్చచెప్పిన రేవంత్‌.. ఢిల్లీలో రాహుల్‌ గాంధీతో సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమకు కంచుకోటగా ఉన్న చేవెళ్ల ఎంపీ టికెట్‌ను తన తనయుడు కార్తిక్‌ రెడ్డికి ఇవ్వాలని సబితా డిమాండ్‌ చేసినట్లు సమాచారం. అయితే చేవెళ్ల సిట్టింగ్‌ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఇటీవలే టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయనకు అవకాశం కల్పించేందుకే కార్తిక్‌ రెడ్డికి టికెట్‌ నిరాకరించినట్లు తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top