వైఎస్‌ జగన్‌ ప్రతి అడుగు నారా వారి...

MLA Roja Slams Chandrababu At Public Meeting in Chittoor - Sakshi

వడమాల పేట, నగరి నియోజకవర్గం(చిత్తూరు) : ఇడుపులపాయలో మొదలుపెట్టిన ప్రజాసంకల్పయాత్రలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వేసే ప్రతి అడుగు నారా వారి నరాల్లో వణుకు పుట్టిస్తోందని వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం వడమాలపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.

‘అడుగడుగునా పేద ప్రజల కన్నీళ్లు తుడుస్తూ ప్రజాసంకల్పయాత్ర ద్వారా వస్తున్న మన అన్న.. రాజన్న ముద్దు బిడ్డ.. జగనన్నకి నగరి నియోజకవర్గంలోకి స్వాగతం.. సుస్వాగతం. ఇడుపులపాయలో మొదలుపెట్టిన ప్రజాసంకల్పయాత్రలో జగనన్న వేసే ప్రతి అడుగు టీడీపీ గుండెల్లో గునపమై దిగుతోంది. సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత నిజమో.. రాబోయే ఎన్నికల్లో జగనన్న గెలవడం అంతే నిజం.

పాదయాత్రలో జగనన్నతో కలసి అడుగులు వేయడం మనం చేసుకున్న అదృష్టం. అప్పట్లో వైఎస్‌ పాదయాత్ర ఓ చరిత్ర. నేడు జగనన్న పాదయాత్ర ఆధునిక చరిత్ర. జగనన్న ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడో అప్పుడే మా ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు.

రాష్ట్రంతో పాటు నగరి నియోజకవర్గం కూడా అభివృద్ది చెందుతుంది. వైఎస్‌ రైతు బాంధవుడిగా పేరొందారు. ప్రతిపక్షం అధికారంలో ఉన్న జిల్లా అయిన కూడా పెద్ద మనసుతో గాలేరు నగరి ప్రాజెక్టును ప్రారంభించారు. ఆ రోజు చిత్తూరు జిల్లా ప్రజలు అందరూ సంతోషించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎంతో ఖర్చు చేశారు. మధ్యలోనే మనల్ని వదలి వైఎస్‌ వెళ్లి పోయారు.

ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ప్రాజెక్టుకు ఏదో అలా విదిలించారు. 65 శాతం పూర్తైన ప్రాజెక్టులో మిగిలిన 35 శాతాన్ని నాలుగేళ్లో పూర్తి చేయలేకపోయిన చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. చంద్రబాబు నాయుడు గాలేరు నగరి ప్రాజెక్టును సమాధి రాయిగా మార్చారు. మొన్ననే గాలేరు నగరి ప్రాజెక్టు సాధన కోసం నాలుగు రోజుల పాటు 88 కిలోమీటర్ల పాదయాత్ర చేశాం.

వైఎస్‌ ప్రారంభించిన ప్రాజెక్టు జగనన్న చేతుల మీదుగానే ప్రారంభం కావాలి. సీఎం కాగానే చంద్రబాబు చిత్తూరు ప్రజల నోట్లోని తీపిని చేదుగా(చక్కెర పరిశ్రమల మూతను ఉద్దేశించి) మార్చారు. రేణిగుంట షుగర్‌ ఫ్యాక్టరీల వద్ద ప్రతిపక్ష పార్టీ ధర్నా చేస్తే రెండు సార్లు బకాయిలు ఇచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులను రోడ్డుమీదకు తెచ్చాడు చంద్రబాబు. 

‘జాబు కావాలంటే బాబు రావాలి. బాబు వస్తేనే జాబు వస్తుంది’ అంటూ యువతను మోసగించారు బాబు. కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. లక్షా నలభై వేల ఉద్యోగాలు ఉంటే కనీసం ఒక్కటి కూడా భర్తీ చేయలేదు. వార్డు మెంబర్‌గా గెలవలేని నారా లోకేష్‌ను ఎమ్మెల్సీని చేసి, మంత్రి పదవిలో కూర్చొబెట్టాడు బాబు. ఆయనకు ప్రజల మీద కంటే లోకేష్‌పై ఎక్కువ ప్రేమ ఉంది.

నా 18 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇద్దరికి రుణపడి ఉన్నాను. ఒకటి పార్టీ తరఫున నాకు సీటు ఇచ్చిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి. రెండు నన్ను ఎమ్మెల్యేగా నిలిపిన మీ అందరికీ. నా ఆత్మ సాక్షిగా చెబుతున్నా. రాజన్న రాజ్యం వచ్చే వరకూ నీ వెంటే ఉంటాను జగనన్నా. ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే ప్రజల కోసం పోరాడే నాయకుడు జగన్‌ అన్న ఒక్కడే. వైఎస్‌ కాలంలో జరిగిన అభివృద్ధి మళ్లీ జగన్‌ అన్న ముఖ్యమంత్రి కావడంతోనే మొదలవుతుంది.’

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top