నాడు దళితుల హక్కులు గుర్తుకు రాలేదా..?

MLA Merugu Nagarjuna Comments On Chandrababu - Sakshi

చంద్రబాబుపై ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ధ్వజం

సాక్షి, తాడేపల్లి: దళితుల హక్కులను కాలరాస్తూ.. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ నేతలు గవర్నర్‌ను కలిశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లి  వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో టీడీపీ తీరుపై నిప్పులు చెరిగారు. టీడీపీ పాలనలోని తప్పులు ఆ నేతలకు కనిపించవా అని దుయ్యబట్టారు. టీడీపీ అడ్డగోలుగా పరిపాలన చేసిందని.. దళితులను అవమానించారని ధ్వజమెత్తారు. దళిత చట్టాలను అవహేళన చేసిన టీడీపీ నేతలు ఇవాళ హక్కులు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గత ఐదేళ్లలో చంద్రబాబు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసునన్నారు. నాడు దళితుల హక్కులు చంద్రబాబుకు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.

ఫిర్యాదు చేసినంతా మాత్రానా అభివృద్ధి ఆగదు..
రాజ్యాంగ వ్యవస్థను టీడీపీ భ్రష్టు పట్టించిందని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన చూసి ఓర్వలేక టీడీపీ కుయుక్తులు పన్నుతోందని విమర్శించారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేసినంతా మాత్రాన ఏపీ అభివృద్ధి ఆగదన్నారు. గవర్నర్‌ దగ్గరకు టీడీపీ ఎంపీ కేశినేని నాని, టీడీపీ నేతలు ఎందుకు వెళ్లారో అర్థం కాలేదన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వర్శిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ దామోదర్‌ నాయుడు దళితుడైన మురళిని కులం పేరుతో దూషిస్తే కేసు పెట్టారా అని ప్రశ్నించారు. దామోదర్‌ నాయుడిపై చాలా మంది సిబ్బంది ఫిర్యాదు చేశారన్నారు. ‘మీ సామాజిక వర్గానికి చెందిన వైస్ ఛాన్సలర్ దళితుడిని తిడితే వైఎస్‌ జగన్‌ పాలన బాగోలేదని గవర్నర్ కు ఫిర్యాదు చేస్తారా’ అని దుయ్యబట్టారు.

వెనకేసుకురావడానికి సిగ్గులేదా..?
దళితులను తన ఛాంబర్ చుట్టూ పక్కలకు కూడా రావద్దని చెప్పిన దామోదర్ నాయుడును వెనకేసుకు రావడానికి టీడీపీ నేతలకు సిగ్గులేదా అని ధ్వజమెత్తారు. కాంట్రాక్టు ఉద్యోగిగా చేరిన మురళీకృష్ణను వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడనే ఉద్దేశ్యంతోనే ఉద్యోగం నుంచి తీసివేశారన్నారు. దామోదర్‌ నాయుడికి, చంద్రబాబుకు సంబంధం ఉందని మేరుగ ఆరోపించారు. ఉద్యోగ విప్లవానికి సీఎం జగన్‌ నాంది పలికారన్నారు. అనేక సంక్షేమ పథకాలను పేదలకు సీఎం అందిస్తున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలు సీఎం జగన్‌ వెనుక ఉన్నారనే కారణంతో చంద్రబాబు కక్ష కట్టారన్నారు. టీడీపీ మోసాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం 19 చట్టాలను సీఎం జగన్‌ ప్రవేశపెట్టారని మేరుగ నాగార్జున పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top