బహుజన కిరణం మాయావతి

Mayawati Uttar Pradesh Political Legend - Sakshi

యూపీ రాజకీయ మాయావతి

సాక్షి, వెబ్ ప్రత్యేకం : దేశంలోనే అత్యధిక లోక్‌సభ​స్థానాలున్న మెగా (ఉత్తరప్రదేశ్‌) రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా ఎన్నికై ఖ్యాతికెక్కిన తొలి మహిళ మాయావతి. మూడుస్లారు సీఎంగా తన పాలనా దక్షత, శాంతి భద్రతల పరిరక్షణలో తెగువ చూపించి విపక్షాల ప్రశంసలను సైతం దక్కించుకున్నారు. తన హయాంలో  రాష్ట్రంలో కరుడు గట్టిన నేరస్తులకు ఆమె సింహ స్వప్నం. ముఖ్యంగా  2010లో అయోధ్య తీర్పు సందర్భంగా హై ప్రొఫైల్డ్‌, మాఫియా డాన్‌లను సైతం కటకటాల వెనక్కి పంపించారు. 2007లో భూమి ఆక్రమణ కేసులో సొంత పార్టీ ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేయించిన సాహసం ఆమెది. ఆమె ఏది చేసినా సంచలనమే. కోటానుకోట్లు ఖర్చు చేసి నివాస భవనాన్ని నిర్మించుకున్నా, తన పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రత్యేక విమానంలో చెప్పులు తెప్పించుకున్నా, గెస్ట్‌ హౌస్‌ వివాదాన్ని ధీటుగా ఎదుర్కొన్నా.. కరెన్సీ మాల వేయించుకున్నా.. ప్రాజెక్టుల అమలులో ప్రపంచ బ్యాంకుకే చుక్కలు చూపించినా, ప్రతిపక్షాల విమర్శలకు సైతం వెరవకుండా వేలాది విగ్రహాలను ఏర్పాటు చేసినా ఆమెకు ఆమే సాటి. ఉత్తరప్రదేశ్‌ రాజకీయ నాయకురాలిగా ప్రస్తుతం దేశ ప్రధానమంత్రి పదవికి పోటీలో వినిపిస్తున్న పేరు మాయావతి. 

మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మాయావతి ఐఏఎస్‌ కావాలనుకుని అధినేత అయ్యారు. చిన్నప్పటినుంచి మాయావతికి  ఐఏఎస్‌ కావాలని కనేవారు.  అందుకే మూడు పరీక్షలు ఒకేసారి  పాస్‌ కావాలని  భావించి,  అధికారులు అనుమతితో 9వ, 10వ ,11 వ తరగతి  పరీక్షలను ఒకేసారి విజయవంతంగా పూర్తి చేశారు. అలా మూడేళ్లు జంప్‌ చేసి 16 ఏళ్ళ వయస్సులో (1972)12వ తరగతి పాసయ్యారు. అనంతరం ఐఏఎస్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో 1977లో బహుజన సమాజ్ పార్టీ  వ్యవస్థాపకులు కాన్షీరాంతో పరిచయం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. తదనంతర కాలంలో పార్టీ అధినేత్రిగా పగ్గాలు చేపట్టిన ఆమె రాజకీయ జీవితం నల్లేరు మీద నడకేమీకాదు. ఎంపీగా, డైనమిక్‌ సీఎంగా మాయావతి తన ప్రాధాన్యతను చాటుకున్నప్పటికీ పురుషాధిక్య సమాజంలో ఒక దళిత మహిళగా జాతి, కుల వివక్షను ఎదుర్కోక తప్పలేదు. అయినా అనేక అడ్డంకులను, అవమానాలను తోసి రాజన్నారు. 2008లో ప్రపంచంలోని 100 మంది శక్తివంతమైన మహిళల ఫోర్బ్స్‌ జాబితాలో 59వ స్థానంలో నిలిచారు. 20017లో న్యూస్‌ వీక్స్‌ విజయవంతమైన టాప్‌ మహిళల్లో ఒకరుగా బరాక్‌ ఒబామా ఆఫ్‌ ఇండియాగా మాయావతిని  అభివర్ణించడం విశేషం


   
వ్యక్తిగత వివరాలు 
1956, జనవరి 15న రాంరాఠి, ప్రభుదాస్‌ దంపతులకు జన్మించారు. బీఈడీ, అనంతరం లాకోర్సు చదివారు. ఐఏఎస్‌కు ప్రిపేర్‌ అవుతున్న సమయంలోఢిల్లీలో కొంతకాలం ఉపాధ్యాయురాలిగా కూడా పనిచేశారు. తన తాతాగారు మంగళసేన్‌ తనకు ఆదర్శమని మాయావతి  స్వయంగా చెప్పేవారు.  ఆయన చూపించే  మానవతా దృక్పథం, కుటుంబంలోని  పిల్లలపట్ల ఆడ, మగ అనే వివక్ష లేకుండా సమానంగా చూసే విధానం తనను ప్రభావితం చేసిందనేవారు.  

రచనలు
బహుజన్‌ సమాజ్‌ ఔర్‌ ఉస్కి రాజ్‌నీతి (హిందీ). బహుజన్‌ సమాజ్‌ ఔర్‌ ఉస్కి రాజ్‌నీతి (ఇంగ్లీషు) మేరా సంఘర్ష్‌ మే జీవన్‌ అవమ్‌ బహుజన్‌ మూమెంట్‌ కా సఫర్‌నామా (హిందీ). దీనితోపాటు  సీనియర్‌ జర్నలిస్టు మహమ్మద్‌ జమీల్‌ అక‍్తర్‌‘ ఐరన్‌ లేడీ కుమారి మాయావతి’ అనే పుస్తకాన్ని రాయగా,   మరో ప్రఖ్యాత జర్నలిస్టు  అజయ్‌ బోస్‌  ‘బెహన్‌జీ’  అనే పొలిటికల్ బయోగ్రఫీని ప్రచురించారు.

వివాదాలు
రాష్ట్రవ్యాప్తంగా తన విగ్రహాలతోపాటు, తమ పార్టీ వ్యవప్థాపకుడు కాన్షీరాం, పార్టీ గుర్తు ఏనుగు విగ్రహాలు, మాయావతి ఏర్పాటు చేయడం అప్పట్లో పెను దుమారం రేపింది. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంపై సుప్రీం కోర్టు మొట్టికాయలేసింది. మరోవైపు ఆమెపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు కూడా ఇంకా కొనసాగుతోంది. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చక్కెర మిల్లులను అతి తక్కువ ధరకు అమ్మేశారన్న కేసూ ప్రస్తుతం కోర్టులో ఉంది. అలాగే ఆమె సోదరుడు ఆనంద్ కుమార్ నకిలీ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టాడన్న కేసులు ఎదుర్కొంటున్నారు.
- టి. సూర్యకుమారి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top