స్పందించాల్సిన అవసరం లేదు | Sakshi
Sakshi News home page

స్పందించాల్సిన అవసరం లేదు

Published Sun, Jan 14 2018 2:56 AM

KTR comments on revanth reddy  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విద్యుత్‌ ప్రాజెక్టుల వ్యవహారాల్లో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్‌ నేతలు అనవసర రాద్ధాంతం చేయకుండా ఆధారాలుంటే కోర్టుకు వెళ్లవచ్చని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. నోరుంది కదా అని అడ్డంగా ఏది పడితే అది మాట్లాడడం సబబు కాదన్నారు. శనివారం సచివాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. జైలుకెళ్లి చిప్పకూడు తిన్నవారు కూడా నీతి గురించి మాట్లాడితే ఎలా? అని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఈ సందర్భంగా పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

విద్యుత్‌ కొనుగోళ్లలో అవినీతిపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, ప్రభుత్వం సిద్ధమా? అని రేవంత్‌ విసిరిన సవాల్‌పై కేటీఆర్‌ స్పందించారు. అవినీతి నాయకుడి సవాళ్లకు తాము స్పందించాల్సిన అవసరం లేదన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సరఫరాతో రైతులు పూర్తి సంతృప్తితో ఉన్నారని, ఈ పథకం విజయవం తం కావడంతో కాంగ్రెస్‌ కడుపు మండుతోం దన్నారు. విద్యుత్, సాగునీరు, రైతుకు పెట్టుబడి పథకాలతో టీఆర్‌ఎస్‌ ప్రజల్లో స్థిరపడితే ఇక తమ ఉనికే ప్రశ్నార్థకమన్న భయాందోళన కాంగ్రెస్‌ నేతల్లో నెలకొందన్నారు. ఇక ఎప్పటికీ అధికారంలోకి రాలేమన్న భయంతో కాంగ్రెస్‌ రగిలిపోతోంద ని అన్నారు.  

అఖిలపక్షం అవసరం లేదు..  
కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ మేరకు కొత్త పంచాయతీరాజ్‌ చట్టం రూపకల్పనపై అఖిలపక్ష సమావేశం పెట్టాల్సిన అవసరం లేదని, ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం లభిస్తుందని కేటీఆర్‌ అన్నారు. ఇసుక తవ్వకాలతో మూడేళ్లలో ప్రభుత్వానికి రూ.1,300 కోట్ల ఆదాయాన్ని తెచ్చామని, కాంగ్రెస్‌ హయాంలో ఆ ఆదాయం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిందని విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, రవాణాకు సంబంధించిన సమగ్ర వివరాలను కాంగ్రెస్‌ నేతలు కలవకముందే గవర్నర్‌కు అందించామన్నారు. గవర్నర్‌ స్వయంగా నిజామాబాద్‌ కలెక్టర్, కామారెడ్డి ఆర్డీఓ ద్వారా నివేదికలు తెప్పించుకున్నారన్నారు. ఇసుక తవ్వకాలు, రవాణాపై గవర్నర్‌ క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేస్తే సంతోషమేనని మంత్రి చెప్పారు. గవర్నర్, కాంగ్రెస్‌ నేతల మధ్య జరిగిన వాగ్వాదానికి తమకు సంబంధం లేదని అన్నారు.  

ఎన్నికలపై ఆందోళన లేదు 
ఎన్నికల గురించి తాము ఆందోళన చెందాల్సిన అవసరం లేదని. అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాక కూడా ప్రజలు ఓట్లు వేయకపోతే ఇంట్లో కూర్చొంటామని కేటీఆర్‌ చెప్పారు. శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశాలున్నట్లు సమాచారం ఉందన్నారు. బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ధైర్యం చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఆదివారం నుంచి ఈ నెల 27 వరకు వివిధ దేశాల్లో పర్యటించనున్నట్లు మంత్రి తెలిపారు. 14వ తేదీ నుంచి 22 వరకు దక్షిణ కొరియా, జపాన్‌ దేశాల్లో పర్యటించి అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నట్టు వెల్లడించారు. ఆ తర్వాత స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈ నెల 23న ప్రారంభం కానున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొంటానన్నారు. విదేశీ పర్యటనల్లో భాగంగా పలు కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకుంటామని, ఈ నెల 27న తిరిగి రాష్ట్రానికి చేరుకుంటానని తెలిపారు.

పరిశ్రమలు ఖాయిలా పడకుండా చర్యలు
సూక్ష్మ, చిన్న పరిశ్రమల సమస్యల పరిష్కారంపై నెలకోసారి జిల్లా స్థాయిలో కలెక్టర్లు సమావేశం నిర్వహించాలని, ఈ సమావేశంలో పరిశ్రమలు ఖాయిలా పడకుండా వాటి సమస్యలను పరిష్కరించాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. జిల్లా స్థాయిలోనే బ్యాంకర్లతో సమావేశాలు ఏర్పాటు చేయాలని, రుణ బకాయిల చెల్లింపుల్లో కొంత ఆలస్యమైనా ఖాయిలా పరిశ్రమగా మారకుండా చర్యలు తీసుకోవాలన్నారు. శనివారం కేటీఆర్‌ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గత గురువారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ అక్రమ మైనింగ్, అక్రమ ఇసుక రవాణాపై దృష్టి సారించామని, వాటిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వానికి ఆదాయం, ప్రజలకు అందుబాటులో ఇసుక అనే రెండు ప్రధానమైన లక్ష్యాలతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement