కేసీఆర్‌ది నియంత పాలన

Konda surekha commented over kcr - Sakshi

మాజీ మంత్రి కొండా సురేఖ ధ్వజం

అవినీతితో కల్వకుంట్ల ఖజానా నిండిపోయింది

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబంపై మాజీ మంత్రి కొండా సురేఖ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నియంత ధోరణితో ఉన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజల చేతుల్లో ఓటమి తప్పదని హెచ్చరించారు. బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చనిపోయినట్లుగా ప్రతిపక్షాల చేతుల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.

నియంత పోకడలు, దురహంకారాన్ని వదిలిపెట్టి ఆపద్ధర్మ ప్రభుత్వ కాలంలో అయినా సామాన్య ప్రజల కోసం పని చేయాలని సీఎం కేసీఆర్‌కు సూచించారు. రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటామనేది మరో 10 రోజుల్లో చెబుతామన్నారు. 14 పార్టీల నుంచి తమకు ఆహ్వానం ఉందని, కొన్ని పార్టీలు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని చెప్పాయని తెలిపారు. ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావుతో కలసి కొండా సురేఖ మంగళవారం హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖను విడుదల చేశారు. కొండా సురేఖ ప్రసంగం ఆమె మాటల్లోనే...

మీ ఓటమి తప్పదు...
టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్‌ అంటున్నారు. రాజకీయ సన్యాసానికి కేటీఆర్‌ సిద్ధంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ వెంట ఉన్న ఏ వర్గం వారు మీ వెంట ఇప్పుడు లేరు. వారందరూ మీ ఓటమికి కంకణం కట్టుకున్నారు.

టీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదు. మీ రాజకీయ సన్యాసం తప్పదు. కేటీఆర్‌ ఇటీవల సోనియాగాంధీని ఎట్లబడితే అట్ల తిడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మొదటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎంగా కేసీఆర్‌ మాట్లాడిన మొదటి ప్రసంగాన్ని కేటీఆర్‌ వినాలి. కేసీఆర్‌ రాజకీయ పునరేకీకరణ పేరుతో ప్రతిపక్షం లేకుండా చేశారు. ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి నియంత ధోరణితో వ్యవహరించిన మిమ్మల్ని ఓడించేందుకు ప్రతిపక్షాలు నడుంబిగించాయి. ప్రజల చేతుల్లో మీ ప్రభుత్వం కూలిపోతుంది.

దొరల పాలన...
ఎర్రబెల్లి దయాకర్‌రావు టీఆర్‌ఎస్‌లో, ఆయన అల్లుడు కాంగ్రెస్‌లో ఉంటే తప్పులేదు. డి. శ్రీనివాస్‌ టీఆర్‌ఎస్‌లో, ఆయన కొడుకు అరవింద్‌ బీజేపీలో ఉంటే తప్పు. అంటే బీసీలకు ఒక న్యాయం, దొరలకు ఒక న్యాయమా? మా నాన్న చనిపోతే కనీసం కలవడానికి రాలేదు. అదే దయాకర్‌రావు తల్లి చనిపోతే వెళ్లి కలిశారు.బీసీ మహిళగా నాకు ఇచ్చిన గౌరవం ఇది.

ఇతర పార్టీలో గెలిచి వచ్చిన దొరగా దయాకర్‌రావుకు ఇచ్చిన ప్రాధాన్యత అది. మరి దీన్ని దొరల పాలనగా కాకుండా ఏమని పిలవాలి. కేటీఆర్, హరీశ్‌రావు, కవిత, సంతోష్‌ అంతా ఒక్కటే. పార్టీలో ఎవరూ ఏమీ చేయకుండా వర్గాలుగా కనిపిస్తారు. రాత్రికి అన్నీ మాట్లాడుకుంటారు. వచ్చిన దాన్ని పంచుకుంటారు.

కేటీఆర్‌ను ప్రజలు అంగీకరించరు...
ఆస్తి రాసిచ్చినట్లుగా కొడుక్కి సీఎం పదవి కట్టబెట్టడానికి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ కాదు. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. అంత పుత్రవాత్సల్యం ఉంటే ప్రపంచంలో ఎనిమిదో వింతను నిర్మించి కొడుక్కి ఇస్తే బాగుంటుంది. అంతేగానీ తెలంగాణ ప్రజల బతుకులతో మాత్రం ఆడుకోవద్దని కోరుతున్నా. ప్రజల్లోంచి వచ్చిన వాడు నాయకుడవుతాడు. ప్రజల్లోకి తెచ్చినవాడు ఎప్పుడూ నాయకుడు కాలేడు. నా భర్త కొండా మురళీ ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పుడు డీసీసీబీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు.

అప్పుడు మా పాపను చైర్మన్‌గా చేసే అవకాశం ఉండె. అయినా చేయలేదు. మా పాప ఎమ్మెల్యే కావాలని ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నారు. కేటీఆర్‌ను ప్రజలు ఎప్పుడూ కోరుకోలేదు. ఆయన ఎమ్మెల్యే కావాలని కోరుకోలేదు. సీఎం కావాలని కోరుకోవడంలేదు. ఎంపీ కవిత మొదట అమెరికా నుంచి వచ్చినప్పుడు ఒక నెల ఉంటానని వచ్చింది. ఒక కార్ల తిరిగింది. ఆ కారు ఎవరు కొనిచ్చారో చెప్పాలి. ఆమెకు ఉండే లాక్మె బ్యూటీ పార్లర్‌ను అభివృద్ధి చేసుకోవడానికి ఏం చేసిందో చెప్పాలి.

లష్కర్‌ బోనాల సందర్భంగా కవిత బంగారు బోనం ఎత్తింది. మాకొక అనుమానం ఉంది. అది ప్రభుత్వపరంగా ఎత్తిన బోనమా లేక కుటుంబపరంగా ఎత్తిన బోనమా ప్రజలకు చెప్పాలి. ప్రభుత్వపరంగా అయితే కవిత బోనం ఎత్తడానికి ఎవరు? ఏ ప్రొటోకాల్‌ ప్రకారం ఆమె బోనం ఎత్తింది? మాతంగి లేదా? జోగిని శ్యామల లేదా? వారితో ఎందుకు ఎత్తీయలేదు. మాతంగి, జోగిని శ్యామల పెట్టిన శాపనార్థాలే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పతనానికి నాంది. ప్రభుత్వ బోనమైతే ఇప్పుడు అది ఎక్కడుంది. కుటుంబ బోనమైతే కవిత బంగారు బోనం ఎత్తితే బంగారు తెలంగాణ వచ్చినట్లేనా?

బీజేపీతో ఒప్పందం ఏమిటి...?
ప్రతిపక్షాలు ఏకమైతే కేటీఆర్‌ తప్పుబడుతున్నారు. మీ స్వార్థం కోసం, అధికారం కోసం బీజేపీతో అంతర్గత ఒప్పందం చేసుకోవడం తప్పు కాదా? జోనల్‌ వ్యవస్థ ఇస్తావా, చస్తావా అని ప్రధాని మోదీ మెడలు వంచి తెచ్చానని కేసీఆర్‌ గొప్పగా చెప్పుకుంటున్నారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్, 31 జిల్లాలకు ఆమోదం అదే విధంగా ఎందుకు తేలేకపోయారు.

మైనారిటీల రిజర్వేషన్ల అంశం కేంద్రం దగ్గర ఉంటే ఆ మేరకు వారికి టికెట్లు ఎందుకు ఇవ్వలేకపోయారు. మోదీ దగ్గరికి వెళ్లి జమిలి ఎన్నికలన్నారు. మళ్లీ అధికారంలోకి రాలేమనే భయంతో ముందస్తు ఎన్నికలను తెచ్చి తెలంగాణ ప్రజలపై రూ. 300 కోట్ల భారం మోపారు.

సీఎంకు పరామర్శించే తీరిక లేదా...?
హరికృష్ణ ఉద్యమకారుడా.. కేసీఆర్‌ చుట్టమా.. తెలం గాణ పోరాట యోధుడా... అమరవీరుల కుటుంబ సభ్యుడా? ఆయన మరణించిన 5 నిమిషాల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ వెళ్లారు. అంత్యక్రియలు అయ్యేదాకా కేటీఆర్‌ అక్కడే ఉన్నారు. హరికృష్ణ స్మారక స్తూపం కోసం 450 గజాల స్థలం కేటాయిస్తామన్నారు.

ఎవడబ్బ సొమ్మని హరికృష్ణకు భూమిని ధారాదత్తం చేశారు. రాష్ట్రం కోసం పోరాడిన కొండా లక్ష్మణ్‌ చనిపోతే నీకు టైం దొరకలేదు. మాజీ సీఎం అంజయ్య భార్య, మాజీ ఎమ్మెల్యే మణెమ్మ చనిపోతే తీరిక దొరకలేదు. కొండగట్టులో 60 మంది చనిపోతే తీరిక దొరకలేదు. ఇదేనా సీఎం స్పందించే తీరు. తెలంగాణ జాతిపిత కేసీఆర్‌ కాదు. జయశంకర్‌ సార్‌. ఆయన ఇప్పుడు బతికి ఉంటే ఆత్మహత్య చేసుకునే వారు. జయశంకర్‌ సార్‌ పేరు మీద హైదరాబాద్‌లో స్మారక స్తూపం ఎందుకు కట్టలేదు?

అవినీతి పాలన...
కేసీఆర్‌ పాలన అంటేనే అవినీతి పాలన. రూ. వేల కోట్ల ప్రజాధనంతో కల్వకుంట్ల వారి ఖజానా నిండిపోయింది. హైదరాబాద్‌లో కేటీఆర్‌ సెటిల్‌మెంట్ల పేరిట ఎన్ని ఇళ్లు, భూములను ఆక్రమించుకున్నారో, ఆయన బినామీలు ఎవరో, ఎన్ని బార్లకు పర్మిట్లు పొందారో చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. ఏ కంపెనీలకు ఏ పనులను కట్టబెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలి. మీ రాజకీయ వారసుడు కేటీఆర్‌ ఇందులో ఎంత పర్సేంటేజీ తీసుకున్నారో బహిర్గతం చేయాలి.

మందు గోలీలు అందించిన వారికి, భోజనం పెట్టిన వారికి, వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి రాజ్యసభ పదవులు ఇచ్చారు. తెలంగాణ వచ్చాక నిరుద్యోగ సమస్యను తీర్చలేకపోయారు. పోరాటం చేసిన వారికి రాజకీయ పదవులు సైతం ఇవ్వలేకపోయారు. 105 మందికి టికెట్‌ ఇచ్చి హరీశ్‌రావుకు దగ్గర అనుకున్న వారి స్థానాల్లో వేరే నేతలతో గొడవలు పెట్టించి కేటీఆర్‌ అనుకూల వర్గాన్ని నియమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైతుబంధు పేరిట ధనిక రైతులు, బడా భూస్వాములకు మేలు జరుగుతోంది.

ఆత్మగౌరవమే ముఖ్యం...
ఆత్మగౌరవం మా ఊపిరి. టీఆర్‌ఎస్‌లో చేరే సందర్భంలోనూ కేటీఆర్‌కు ఇదే చెప్పాం. మమ్మల్ని అవమానపరిచారు. ఏడాదిగా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. నమ్మకద్రోహం చేశా రు. మెడపట్టి బయటకు వెళ్లగొట్టినట్లుగా వ్యవహరించారు. భూపాలపల్లి, వరంగల్‌ తూర్పు నియోజకవర్గాల్లోని పరిస్థితులపై కేటీఆర్‌కు ఎంత చెప్పినా సర్ది చెప్పే ప్రయత్నం చేయలేదు. మేం ఏ పార్టీలో అయినా క్రమశిక్షణతోనే ఉన్నాం. ఎక్కడా క్రమశిక్షణ ఉల్లంఘించలేదు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top