
సాక్షి, పెద్దపల్లి : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో కాంట్రాక్టర్లకే లాభం జరుగుతుందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. జిల్లాలోని రామగుండం బి పవర్ హౌస్ రాజీవ్ రహదారి నుంచి గోదావరిఖని వరకు జనసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో కోదండరాం పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన రణభేరిలో ఆయన మాట్లాడుతూ.. వేలాది మంది ఉద్యమకారుల ఆత్మబలిదానాల ఫలితమే తెలంగాణ అని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక అమరుల త్యాగాలను మరిచారని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను పక్కనబెడితే.. ప్రభుత్వాన్ని కుల్చేస్తామన్నారు. సింగరేణి కార్మికుల పేరు మార్పిడిపై ఎటువంటి స్పందన లేదని విమర్శించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘వ్యవసాయం చేసుకునే కౌలు రైతులను పట్టించుకోవడం లేదు. రాజకీయం మీ స్వార్ధం కోసం కాకుండా ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా చేస్తే సంతోషిస్తాం. స్థానిక సమస్యలపై రేపటి నుంచే పోరాటాలు మొదలుపెడతాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజలకంటే కాంట్రాక్టర్లకే ఎక్కువ లాభం జరుగుతుంది. వారిని ప్రభుత్వం పెంచి పోషిస్తుంది. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు సరైన పనికి సరైన వేతనం చెల్లించేలా ప్రభుత్వం కొట్లాట చేస్తాం’ అని కోదండరాం అన్నారు.