మోదీని కావాలని అవమానించలేదు

KCR did not insult PM Modi, clarifies Kavitha - Sakshi

ఎంపీ కల్వకుంట్ల కవిత

సాక్షి, హైదరాబాద్‌: రైతు సమస్యలపై సీఎం కేసీఆర్‌ భావోద్వేగంగా మాట్లాడిన సందర్భంలో దొర్లిన తప్పిదమే తప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అవమానించాలనే సంకుచిత ఉద్దేశం లేదని ఎంపీ కె.కవిత అన్నారు. నిజామాబాద్‌ జిల్లాలోని పోతంగల్‌ గ్రామాన్ని దత్తత తీసుకున్న సన్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ కావేరి శుక్రవారం ఇక్కడ కవితతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో కవిత మాట్లాడుతూ ప్రధానిని అవమానిస్తే దేశంలోని ప్రజలంతా ఎవరికివారే అవమానించుకున్నట్టు అని అన్నారు. చిన్న పొరపాటుపై బీజేపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు.

దేశంలో 130 కోట్ల మంది ఉంటే 600 మంది ఓట్లేసి తనను గెలిపించినట్టుగా దావోస్‌ పర్యటనలో మోదీ తప్పుగా మాట్లాడలేదా అని ప్రశ్నించారు. రైతుల కష్టాల పట్ల ఆవేదనతోనే సీఎం కొంచెం కటువుగా మాట్లాడారని చెప్పారు. రైతు బడ్జెట్‌ అని చెప్పిన కేంద్రం రైతులకు కేటాయించిందేమీ లేదని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్‌కు మద్దతునిస్తూనే ఉన్నామని, విభజన చట్టంలోని అన్ని హామీలను అమలు చేయాలని అన్నారు. వ్యాపార రంగానికి సంబంధించి 30 బిల్లులు పెట్టిన కేంద్రం రైతుల కోసం ఒక్క బిల్లు కూడా పెట్టలేదని విమర్శించారు. రైతుల హక్కులు, నిధుల కోసం పార్లమెంటు సమావేశాల్లో పోరాడుతామన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top