హైదరాబాద్‌కు మారిన కర్ణాటక రాజకీయం

Karnataka MLAs Shifted To Hyderabad  - Sakshi

రూట్‌ మార్చిన కాంగ్రెస్‌-జేడీఎస్‌ ఎమ్మెల్యేలు

నగరానికి రానున్న కర్ణాటక ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌ శివారు రిసార్ట్స్‌, హోటల్స్‌లో బస చేసే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌ : నిన్నటి దాకా కర్ణాటక కేంద్రంగా సాగిన కన్నడ రాజకీయం.. ఇప్పుడు హైదరాబాద్ వేదికగా మారింది. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసినా... కర్ణాటకలో అధికార పీఠం కోసం రాజకీయ పార్టీల మధ్య రసవత్తర పోరు కొనసాగుతున్నాయి. బీజేపీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వారం గడువు ఇవ్వడంతో కాంగ్రెస్-జేడీఎస్‌ పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. తమ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రలోభాలకు లొంగకుండా నిరోధించేందుకు కాంగ్రెస్, జేడీఎస్‌లు సమాయత్తమయ్యాయి. ఇందులో భాగంగా తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌ తరలించింది.

దీంతో కన్నడ రిసార్ట్‌ రాజకీయాలకు హైదరాబాద్‌ కేంద్రమైంది. ప్రత్యేక విమానానికి అనుమతి లేకపోవడంతో కర్నూలు-హైదరాబాద్‌ రోడ్డు మార్గం ద్వారా మూడు ప్రయివేట్‌ ట్రావెల్స్‌ బస్సుల్లో ఎమ్మెల్యేలు చేరుకున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ నేతృత్వం వహిస్తున్నారు. వీరికి హైదరాబాద్‌లోని రెండు ప్రముఖ హోటళ్లలో బస ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. మరోవైపు ఎమ్మెల్యేల తరలింపును జేడీఎస్‌ నేత థామస్‌ ధ్రువీకరించారు.

జేడీఎస్ ఎమ్మెల్యేలను వివిధ ప్రదేశాలకు తరలించడంపై జేడీఎస్ నేత కుమారస్వామి స్పందించారు. తమ ఎమ్మెల్యేల మీద పూర్తి నమ్మకముందని.. కానీ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే కొందరు జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రోడ్డు మార్గాన హైదరాబాద్ చేరుకున్నారు.

కాగా కర్ణాటకలో రిస్టారు రాజకీయాలు కొత్తేమీ కాదు. ఎమ్మెల్యేలు చేజారి పోకుండా గత రెండురోజులుగా కాంగ్రెస్ పార్టీ బెంగళూరు శివార్లలో ఉన్న ఈగల్టన్ రిసార్ట్ శిబిరం నిర్వహించిన విషయం విదితమే.  అలాగే గత ఏడాది గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల సమయంలోనూ వలసలు నివారించేందుకు కాంగ్రెస్‌ పార్టీ తమ ఎమ్మెల్యేలను ఈ రిసార్టులోనే ఉంచింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top