‘తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా కావాలి’

Kadiam Srihari Demands Center Over Telangana Special Category Status - Sakshi

న్యూఢిల్లీ : విభజన చట్టంలో పొందు పరిచిన హామీలు అమలు చేయలేదని, తెలంగాణకు న్యాయం చేయాలని కోరిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి.. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కడియం శ్రీహరి నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ఎంపీల బృందం గురువారం కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలిశారు. తెలంగాణలో విద్యాసంస్థల ఏర్పాటుపై కేంద్ర మంత్రితో టీఆర్‌ఎస్‌ నేతలు చర్చించారు. విభజన చట్టంలో పొందుపరిచిన తెలంగాణకు సంబంధించిన అంశాలు పట్టించుకోలేదని, హైకోర్టు విభజన, బయ్యారం స్టీల్ ప్లాంట్, విద్యాసంస్థలు లాంటి అన్ని అంశాల్లో అన్యాయం జరిగిందని జవదేకర్‌కు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమకేం అభ్యంతరం లేదని, తెలంగాణకు ప్రత్యేక హోదా ఇచ్చి న్యాయం చేయాలని లేనిపక్షంలో దానికి సమానంగా నిధులిచ్చి సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

‘ప్రత్యేక హోదా ఫలాలు తెలంగాణకు ఇవ్వాలి. పరిశ్రమలు ఏపీకి వెళ్లిపోయే అవకాశం ఉంది. ఏపీ నేతలు తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని పోరాడాలి. ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని రాజకీయ లబ్దికోసం ఏపీలో పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. విభజన చట్టం చేసిన కాంగ్రెస్ రాష్ట్ర ఏర్పాటు సమయంలో తెలంగాణకు అన్యాయం చేసింది. తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేయాలని’  టీఆర్‌ఎస్‌ ఎంపీలు సూచించారు.

సోనియా ఇస్తే కాదు..
తెలంగాణ రాష్ట్రం సోనియా ఇస్తే రాలేదని, ప్రజలు పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారని కడియం శ్రీహరి అన్నారు. విభజన‌ చట్టంలో పొందుపరిచిన గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి‌ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉన్నా కేంద్రం చిన్నచూపు చూస్తుందన్నారు. త్వరలోనే గిరిజన వర్సిటీ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఐఐఎం తెలంగాణకు ఇవ్వాలని నాలుగేళ్ల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్‌ కేంద్రాన్ని అడినట్లు గుర్తుచేశాం. 14 కొత్త జిల్లాలలో కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విధ్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరాం. త్రిపుల్ ఐటీ ఏర్పాటుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరాం. గణిత శాస్త్రం కోసం విద్యార్థులకు అడ్వాన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాథమెటిక్స్‌ను హైదరాబాదులో ఏర్పాటు చేయాలని కోరాం. మధ్యాహ్న భోజన పథకాన్ని 12వ తరగతి విద్యార్థుల వరకు పొడిగించాలని’ కేంద్ర మంత్రి జవదేకర్‌ను కడియం శ్రీహరి కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top