జనసేన వింత పొత్తులు.. లోకేష్‌పై పోటీకి దూరం

Janasena Allots Mangalagiri Seat To CPI For The Sake Of Nara Lokesh - Sakshi

సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జనసేన వింత పొత్తులు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. మంత్రి నారా లోకేష్‌పై పోటీకి జనసేన పార్టీ దూరంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌.. లోకేష్‌ పోటీ చేయనున్న మంగళగిరి స్థానాన్ని సీసీఐకి కేటాయించారు. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుపైనా పోటీకి జనసేన దూరంగా ఉంటోంది. విజయవాడ సెంట్రల్‌ సీటును కూడా సీసీఎంకు కేటాయించింది. ఇక టీడీపీ సైతం గతంలో పీఆర్పీ గెలిచిన సీట్లను పెండింగ్‌లో పెట్టడం గమనార్హం.

ఆ ఇద్దరి కోసమే టీడీపీ సీట్లు పెండింగ్‌లో..
ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు కొన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించినా.. కీలకమైన కొన్ని స్థానాలను మాత్రం పెండింగ్‌లో ఉంచారు. పవన్‌ కల్యాణ్, లక్ష్మీనారాయణల కోసమే ఇలా చేశారన్న అభిప్రాయం తెలుగుదేశం నుంచే వినిపిస్తోంది. పవన్‌కల్యాణ్, లక్ష్మీనారాయణలు పోటీచేయవచ్చని ప్రచారం జరుగుతున్న గాజువాక, భీమిలి, పెందుర్తి తదితర సీట్లకు చంద్రబాబు తన అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. వాళ్లిద్దరూ పోటీచేసే నియోజకవర్గాల్లో డమ్మీ అభ్యర్థులను నిలబెట్టి పరోక్షంగా వాళ్లకు సహకరించేందుకే చంద్రబాబు ఆయా స్థానాలను ప్రకటించలేదని తెలుస్తోంది. గాజువాకలో టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉన్నా ఆయన పేరును ఖరారుచేయలేదు. అలాగే, పెందుర్తిలో ఐదుసార్లు గెలిచిన సీనియర్‌ నేత మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి టికెట్‌ను కూడా చంద్రబాబు పెండింగ్‌లో పెట్టారు. 

జనసేన తీరుపై సీపీఐలో ఆగ్రహ జ్వాలలు
విజయవాడ : జనసేన- సీపీఐ పొత్తుల నేపథ్యంలో సీసీఐలో ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్నాయి. విజయవాడ పశ్చిమ సీటును సీపీఐకి కేటాయించేందుకు జనసేన నిరాకరించింది. దీంతో పశ్చిమ స్థానాన్ని ఆశించిన సీసీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగర కార్యదర్శి పదవికి రాజీనామా చేసేందుకు ఆయన సిద్దమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా శంకర్ బాటలో మరికొందరు కీలక నేతలు అడుగులేస్తున్నారు. దీంతో శంకర్‌ను బుజ్జగించేందుకు రాష్ట్ర నేతలు రంగంలోకి దిగారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top