దళితులకు దగ్గరి బంధువు కరుణానిధి

How Tamil Nadu Changed After Karunanidhi Became CM In 1969 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అన్నాదురై మరణంతో 1969లో ఎం. కరుణానిధికి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించింది. అప్పటి వరకు అన్నాదురై మంత్రి వర్గంలో హిందీ వ్యతిరేక, ఢిల్లీ వ్యతిరేక ఉద్యమాల స్ఫూర్తి కలిగిన వారు, విద్యావేత్తలు, వాక్ఛాతుర్యం కలిగిన వారు, యువకులు ఉండేవారు. ఆ తర్వాత 1969 నుంచి 1976 వరకు వరుసగా ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధి తన మంత్రివర్గంలోకి, ముఖ్యంగా అధికార యంత్రాంగంలోకి ఈ రంగాలతోపాటు వెనకబడిన వర్గాలు, మరీ ఎక్కువ వెనకబడిన వర్గాల వారు, దళితులను తీసుకున్నారు.

పాలనా వ్యవహారాల్లో కిందిస్థాయి పార్టీ కార్యకర్తలకు ప్రత్యక్ష భాగస్వామ్యం కల్పించారు. పంచాయతీ స్థాయి, జిల్లా స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. వాటి పరిష్కారం కోసం కృషి చేయాలి. ప్రజా సమస్యల పరిష్కార సలహా కమిటీల్లో అధికారులతోపాటు పార్టీ నాయకులకు కూడా కరుణానిధి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అధికారులుగానీ, పార్టీ నాయకులుగానీ అవినీతికి పాల్పడకుండా ఈ సలహా సంఘాలు పర్యవేక్షణ సంస్థలుగా పనిచేసేవి.

1969 నుంచి 1976 మధ్య తమిళనాడు పబ్లిక్‌ కమిషన్‌ సర్వీస్‌ నియామకాల తీరును పరిశీలించగా, అంతకుముందు ఎన్నడు లేని విధంగా వెనకబడిన వర్గాలు, బాగా వెనకబడిన వర్గాల వారు, దళితులు ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఉద్యోగాలు రావడం విశేషం. పోలీసులు, రెవెన్యూ అధికారుల్లో దళితులకు ఎక్కువ ఉద్యోగాలు లభించాయి. రాష్ట్రంలోని సామాజిక వర్గాలు, వాటి సంఖ్యా బలం, ఇప్పటికే ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం ఎంత ? అన్న అంశాలను పరిగణలోకి తీసుకొని ఏ వర్గం వారికి ఎన్ని ఉద్యోగాలో ముందుగా ఓ ప్రణాళికను రచించి దానికి అనుగుణంగా నియామక ప్రక్రియను పూర్తి చేయడం వల్ల వెనకబడిన వర్గాల వారికి, దళితులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువ అవకాశం లభించింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో అన్ని వర్గాల ప్రజలకు సరైన ప్రాతినిధ్యం కల్పించినప్పుడే సమాజంలో కూడా వారికి సరైన ప్రాతినిధ్యానికి బాటలు వేయవచ్చన్నది కరుణానిధి ఆచరించిన సిద్ధాంతం.

దళితులకు, బీసీలకు సామాజిక హక్కులను సాకారం చేయాలంటూ 1925లో జరిగిన కాంచీపురం కాంగ్రెస్‌లో పెరియార్‌ రామస్వామి ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకొనే వారి అభ్యున్నతికి కరుణానిధి ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. కరుణానిధి నాటి యంత్రాంగం గ్రామీణాభివృద్ధియే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ పంచాయతీ స్థాయి, సమతి స్థాయి కార్యక్రమాలనే ఎక్కువగా అమలు చేసింది.

బ్రిటీష్‌ కాలం నాటి నుంచి పరిపాలనారంగంలో కలెక్టర్లదే ప్రధాన పాత్ర. జిల్లా డీఎంకే నాయకులకు నేరుగా ఇటు జిల్లా కలెక్టర్లు, అటు పార్టీ అదిష్టాన నేతలతో నేరుగా మాట్లాడే అవకాశం ఉండేది. అందుకని రోజువారి పాలనా వ్యవహారాల్లో జిల్లా పార్టీ నాయకులు జోక్యం చేసుకునే వారు. గ్రామీణస్థాయి నుంచి వచ్చిన ఉద్యమం కారణంగా డిఎంకే బలపడడంతో దిగువ స్థాయిలో కూడా పార్టీకి ప్రాధాన్యత ఏర్పడింది. 1971లో జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో డీఎంకే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ జిల్లా నాయకులు మరింతగా బలపడ్డారు. జిల్లా అభివృద్ధిలో కలెక్టర్‌తోపాటు జిల్లా డిఎంకే నాయకుడు ప్రత్యక్ష ప్రధాన పాత్రదారుడయ్యారు. ఇటు పార్టీది, అటు ప్రభుత్వ యంత్రాంగానిది ఒకటే లక్ష్యం. రాష్ట్రాభివృద్ధి. అందులోనూ అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం జరగడం.

(గమనిక: ‘ది ద్రావిడియన్‌ ఇయర్స్‌’ పేరిట ఎస్‌. నారాయణ్‌ రాసిన పుస్తకంలోని కొన్ని అంశాలివి. నారాయణ్, కరుణానిధి ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేయడమే కాకుండా ఆ తర్వాత వాజపేయి ప్రధానికి ఉన్నప్పుడు ఆయనకు ఆర్థిక సలహాదారుగా పనిచేశారు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top