తెలుగు డ్రామా పార్టీ నాటకాలు ఆపాలి

GVL Calls TDP As Telugu Drama Party Slams AP Government - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. కడప స్టీల్‌ ప్లాంటు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరాలు పంపడం లేదని చెప్పారు. తెలుగు డ్రామా పార్టీ నాటకాలు ఆపాలని అన్నారు. ముడి సరుకు అందుబాటులో ఉందా? లేదా? అన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వడం లేదని పేర్కొన్నారు. దీంతో ఏడాదిగా మెకాన్‌ సమాచారం కోసం ఎదురుచూస్తోందని చెప్పారు. మెకాన్‌ ఇచ్చే ఫీజిబిలిటీ రిపోర్టు ఆధారంగా కేంద్రం కడప స్టీల్‌ ప్లాంట్‌పై నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.

ఏడాదిగా రాష్ట్ర ప్రభుత్వం కుంభకర్ణుడిలా నిద్రపోతూ కేవలం ప్రచారానికే పరిమితమైందని మండిపడ్డారు. దీక్షలు చేస్తున్న నాయకులు స్టీల్‌ ప్లాంట్‌కు ముడిసరుకు అందుబాటుపై వివరాలు పంపాలని చం‍ద్రబాబును అడగాలని సూచించారు. గతంలో స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ వద్దని నాడు యనమల చెప్పారని, ఎస్పీవీ కావాలని మళ్లీ అడిగితే కేంద్రం అందుకు తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

ప్రత్యేక ప్యాకేజి కింద నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోందని తెలిపారు. ఏపీకి ప్రపంచ బ్యాంకు నుంచి 2,220 కోట్ల డిజాస్టర్‌ ఫండ్‌, గ్రామీణ అభివృద్ధికి రూ. 642 కోట్లు, విద్యుత్‌ ప్రాజెక్టుకు రూ. 3584 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు నుంచి వైజాగ్‌-చెన్నై కారిడార్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రూ. 12,472 కోట్లను చెల్లించేందుకు కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top