సింహం, పులి కలిసి పోటీ చేస్తాయి: ఫడ్నవిస్‌

Fadnavis hints BJP Shiv Sena jointly contesting Lok Sabha Polls - Sakshi

ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఎలుకల గురించి బీజేపీ సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ ఖడ్సే  చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారితీశాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మండలిలో ఆసక్తికర చర్చ చోటుచేసుకుంది. మండలిలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సింహం, పులి కలిసి 2019 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని పరోక్షంగా బీజేపీ- శివసేన బంధం గురించి పేర్కొన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నేత రాధాకృష్ణ వీకే పాటిల్‌.. సచివాలయంలో ఎలుకలు ఉన్నాయన్న ఏక్‌నాథ్‌ ఖడ్సే వ్యాఖ్యలను ఉటంకిస్తూ ‘ఎలుకలన్నీ కలిసి బీజేపీని సింహాసనం నుంచి కూలదోస్తాయి అంటూ ఎద్దేవా చేశారు.

దీనికి స్పందనగా సీఎం మాట్లాడుతూ.. ‘పులి(శివసేన గుర్తు), సింహం కలిసే ఉన్నాయి. ఎలుకలు మమ్మల్ని ఏమీ చేయలేవు. సింహం, పులి కలిసి ఎలుకల్ని నాశనం చేస్తాయంటూ’ ధీటుగా బదులిచ్చారు. స్పందించిన ఎన్సీపీ నేత జయంత్‌ పాటిల్‌ మాట్లాడుతూ.. ‘మాకు పులి గురించి తెలుసుగానీ, సింహం ఎవరనేదీ తెలియడం లేదంటూ’ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ‘ఎలుకలు మీకు దారి ఇవ్వచ్చు. కానీ రాష్ట్ర ప్రజలు 2019 ఎన్నికల్లో జంతువులకు వాటి స్ధానాన్ని తప్పక తెలియజేస్తార’ని ఎద్దేవా చేశారు. సీఎం వ్యాఖ్యలను వీకే పాటిల్‌ ఉటంకిస్తూ.. ‘సింహం, పులిల మధ్య ఉన్న ప్రేమానురాగాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న వారి బంధం ఎంతటి బలమైందో కూడా వారికి తెలుసు అంటూ’ వ్యాఖ్యానించారు.

కాగా, బీజేపీ సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ ఖడ్సే అసెంబ్లీ సమావేశాల్లో... మంత్రాలయంలో(సచివాలయం) ఎలుకల నిర్మూలనకు కాంట్రాక్టు సంస్థ సమర్పించిన బిల్లులలోని లోపాలను ఎత్తి చూపుతూ.. మంత్రాలయంలోని 3,19,400 ఎలుకలు ఉన్నట్టు కాంట్రాక్ట్‌ సంస్థ చెప్పిందని గుర్తు చేశారు. వాటి నిర్మూలన కోసం ప్రభుత్వం ఆ సంస్థకు ఆరు నెలల సమయం ఇచ్చిందనీ, కానీ ఆ సంస్థ కేవలం ఏడు రోజుల్లోనే 3 లక్షల ఎలుకలను చంపినట్టు ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని చర్చలేవనెత్తిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top