కాషాయ ప్రభంజనమే!

Exit Polls Forecast Big Win For BJP In Maharashtra, Haryana - Sakshi

అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ ప్రభంజనం ఖాయంగా కనిపిస్తోంది. పోలింగ్‌ అనంతరం సోమవారం పలు మీడియా సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. గెలిచే సంఖ్యలో కొద్ది తేడాలున్నా గెలుపైతే ఖాయమేనని అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చేశాయి. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ శివసేన కూటమి సునాయాసంగా డబుల్‌ సెంచరీ సాధిస్తుందని న్యూస్‌ 18– ఐపీఎస్‌ఓఎస్, ఏబీపీ– సీ ఓటరు పోల్స్‌ తేల్చాయి.

బీజేపీ సొంతంగానే మెజారిటీ సాధించడానికి 3 స్థానాల దూరంలో ఆగిపోయిందని న్యూస్‌ 18– ఐపీఎస్‌ఓఎస్‌ పేర్కొంది. అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ సగటును పరిగణనలోకి తీసుకుంటే బీజేపీ శివసేన కూటమికి 211, కాంగ్రెస్‌ – ఎన్సీపీ కూటమికి 64  సీట్లు వస్తాయని తేలింది. హరియాణాలో కూడా బీజేపీ విజయం లాంఛనమేనని దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చాయి. 90 స్థానాల అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తుందని పేర్కొన్నాయి. టైమ్స్‌ నౌ పోల్‌ బీజేపీ 71, కాంగ్రెస్‌ 11 స్థానాల్లో గెలుస్తుందని వెల్లడించింది. జన్‌ కీ బాత్‌ సర్వే బీజేపీకి 57, కాంగ్రెస్‌కు 17 స్థానాలు ఇచ్చింది.

న్యూస్‌ ఎక్స్‌ 77  సీట్లు బీజేపీవేనంది. టీవీ9 భారత్‌వర్‌‡్ష ఎగ్జిట్‌ పోల్‌ మాత్రం బీజేపీ మెజారిటీ కన్నా ఒక స్థానం ఎక్కువగా 47 సీట్లు గెలుస్తుందంది. కాంగ్రెస్‌ 23 స్థానాల్లో, ఇతరులు 20 స్థానాల్లో గెలుస్తారని చెప్పింది. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమికి 46.4 శాతం వస్తాయని ఐఏఎన్‌ఎస్‌– సీఓటర్‌ సర్వే పేర్కొంది. 2014 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి 47.2 శాతం ఓట్లు సాధించాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ – ఎన్సీపీ కూటమి 38.3% ఓట్లు పొందగా, ఈ సారి 36.9% ఓట్లు వస్తాయని ఐఏఎన్‌ఎస్‌– సీఓటర్‌ సర్వే తెలిపింది.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top