
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి, ఆయనపై నమ్మకంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానని దేవినేని అవినాష్ అన్నారు. గురువారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తనకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పినందుకు పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల గెలుపునకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని పేర్కొన్నారు. పార్టీలో చేరడానికి తనకు సహకరించిన పెద్దలకు కృతఙ్ఞతలు తెలిపిన అవినాష్... తూర్పు నియోజకవర్గ ప్రజలను కలుపుకొని ముందుకు సాగుతానన్నారు.
అదే విధంగా తాను పార్టీ మారడంపై వస్తున్న విమర్శలపై అవినాష్ స్పందించారు. కార్యకర్తల అభిమానాన్ని సంపాదించానే తప్ప ఏనాడు డబ్బు సంపాదించలేదని స్పష్టం చేశారు. ‘ టీడీపీకి నేను ఉపయోగపడ్డాను. కానీ ఆ పార్టీ వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు. టీడీపీలో ఉండి నేను భూకబ్జాలు చేయలేదు. నా మీద ఎటువంటి నేర ఆరోపణ లేదు. నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. కాగా విజయవాడకు చెందిన ప్రముఖ టీడీపీ నేత, దివంగత సీనియర్ నాయకుడు దేవినేని రాజశేఖర్(నెహ్రూ) కుమారుడు దేవినేని అవినాష్ గత గురువారం వైఎస్సార్ సీపీలో చేరిన విషయం తెలిసిందే. కడియాల బుచ్చిబాబుతో కలిసి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలవగా.. ఆయన వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.