‘ఐటీగ్రిడ్‌ మాదిరిగా కేసు నమోదు చేస్తారా’

Dasoju Sravan Slams TRS Government Over Samagra Vedika - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పౌరుల వ్యక్తిగత సమాచార గోప్యతను దెబ్బతీస్తోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘సమగ్ర వేదిక’పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పౌరుల వ్యక్తిగత సమాచార వివరాల్ని 25 ప్రభుత్వ శాఖల నుంచి సేకరించి రూపొందించే సమగ్ర నివేదిక ఉద్దేశాలను వెల్లడించాలని అన్నారు. గాంధీ భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల వ్యక్తిగత సమాచారం అందుబాటులో ఉంటుందని టీఎస్‌ ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ చెప్పడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ప్రజల ఫుట్‌ప్రింట్‌ కూడా లభిస్తుందన్న జయేశ్‌ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.

ఐటీగ్రిడ్‌ మాదిరిగానే.. 
ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సమాచారం చోరీ చేసిందని ఐటీగ్రిడ్‌ కంపెనీపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారని శ్రవణ్‌ గుర్తుచేశారు. ఈ కేసును తెలుగుదేశం పార్టీతో ముడిపెట్టి గత ఎన్నికల్లో విమర్శలతో దుమ్మెత్తిపోశారని అన్నారు. మరి తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై కూడా కేసు పెడతారా అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌ ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత వివరాల్ని క్రోడీకరించి దుర్వినియోగానికి తెర తీసిందని మండిపడ్డారు. ప్రజల అనుమతి లేకుండా అధికారులు వారి వివరాల్ని క్రోడీకరించడం చట్ట విరుద్ధమన్నారు.

వ్యక్తిగత సమాచారం వెల్లడవుతోందన్న ఆందోళనల నేపథ్యంలో ఆధార్‌ను అన్ని పథకాలకు ముడిపెట్టొద్దని సుప్రీంకోర్టే ఆదేశించిందని, పౌరుల ఫుట్‌ప్రింట్‌ కూడా తమవద్ద ఉంటుందని ఐటీ కార్యదర్శి అనడం ఆందోళన కలిగిస్తోందని శ్రవణ్‌ చెప్పారు. గోప్యంగా ఉండాల్సిన వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం  ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వలేదన్న గ్యారెంటీ ఏమిటని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సైబర్‌ సెక్యూరిటీ కిందకు వచ్చే ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాలని, సమగ్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం అందిస్తామని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top