
సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ అధికార ప్రతినిధిగా తెలంగాణ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ నియమితులయ్యారు. ఈమేరకు ఏఐసీసీ సోమవారం ఒక ప్రకటన వెలువరించింది. శ్రవణ్ సహా 10 మందిని ఏఐసీసీ అధికార ప్రతినిధులుగా నియమించింది. రాజ్యసభ ఎంపీ సయ్యద్ నజీర్ హుస్సేన్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. అధికార ప్రతినిధిగా ఎన్నికైన సందర్భంగా శ్రవణ్, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా, ఏఐసీసీ మీడియా కమిటీ చైర్మన్ రణదీప్‌సింగ్ సుర్జేవాలా, ఏఐసీసీ నాయకుడు కొప్పుల రాజు తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ప్రధాన కార్యదర్శిగాతన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రవణ్, అనతికాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు తెచ్చకున్నారు. ప్రజారాజ్యం పార్టీ, టీఆర్‌ఎస్‌ల్లో క్రియాశీలకంగా పనిచేసిన శ్రవణ్ 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా, ముఖ్య అధికార ప్రతినిధిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.