కరోనా: పత్తా లేని పచ్చ నేతలు  

Coronavirus: TDP Leaders Not Available To People To Srikakulam District - Sakshi

కరోనా మహమ్మారి ప్రజలను వణికిస్తున్నా టీడీపీ నాయకులకు పట్టని పరిస్థితి 

ఐదేళ్లు అధికారం వెలగబెట్టి, కోట్లు సంపాదించి.. బాధ్యత విస్మరించిన నేతలు 

విశాఖలో అచ్చెన్న, అమరావతిలో కళా వెంకటరావు.. మిగతా వారిదీ అదేబాట 

ఆదుకోవడం మాట దేముడెరుగు.. కనీస భరోసా కరువు

నేతల తీరును టీడీపీ వర్గాలే తప్పుపడుతున్న వైనం 

సాక్షి , శ్రీకాకుళం: ఐదేళ్లు అధికారంలో ఉన్నారు. ఇసుక, నీరు–చెట్టు, ప్రాజెక్టులు, మద్యం, అభివృద్ధి పనుల ముసుగులో కోట్లు వెనకేసుకున్నారు. ఎన్ని ఎన్నికలొచ్చినా ఖర్చు పెట్టగల సామర్ధ్యం ఉందనే ఆరోపణలున్నాయి. ప్రజల ఓట్లతో కోట్లు కూడబెట్టుకున్న టీడీపీ నేతలకు కష్టకాలంలో ఆ ప్రజలు కని్పంచలేదు. కరోనా మహమ్మారితో వణికిపోతున్న జనానికి కనీస పలకరింపు లేదు. ప్రభుత్వం, వైఎస్సార్‌సీపీ నేతలు, స్వచ్ఛంద సంస్థలు, అనేక వర్గాలు ముందుకొచ్చి పేద ప్రజలను చేతనైనంత సాయం చేసి ఆదుకుంటున్నారు. కానీ టీడీపీ ప్రభుత్వంలో అధికారం చెలాయించిన నేతలెవరికీ సాయం చేయాలన్న తలంపు రాలేదు.

కనీసం వారి జాడే కానరావడం లేదు. కరోనా పేదల ఉపాధికి గండికొట్టింది. రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవులు లాక్‌డౌన్‌ కారణంగా పనుల్లేక అల్లాడుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితి రాకూడదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకునేందుకు ఎన్నో చర్యలు చేపట్టింది. ఇలాంటి వారి కోసం ఉచితంగా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. జిల్లావ్యాప్తంగా 33 ఉపశమన కేంద్రాలు ఏర్పాటు చేసింది. వలస జీవులు, జిల్లాలో చిక్కుకుపోయిన వారు, నిరుపేదలు, సంచార తెగలు, చిరువ్యాపారులు, నిరాశ్రయులు, యాచకులు, వృద్ధులు తదితరులందరికీ వేర్వేరుగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటున్నది. ఉచితంగా బియ్యం, కందిపప్పుతోపాటు ఒక్కొక్క రేషన్‌ కార్డుదారుడికి రూ.1000 చొప్పున అందజేసింది.  
 

ఆదుకుంటున్న అన్ని వర్గాలు 
శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలతోపాటు ఇతర ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. భోజనం సమకూరుస్తున్నారు. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగ సంఘాలు, వ్యాపార వర్గాలు, కుల సంఘాలు, రెడ్‌క్రాస్, సీనియర్‌ సిటిజన్స్, వైద్య వర్గాలు....అలా అన్ని రంగాలకు చెందిన వారు తమకు తోచినంత సాయం, వితరణ చేస్తున్నారు. 

టీడీపీ అగ్రనేతలెక్కడ? 
కష్టకాలంలో టీడీపీ అగ్రనేతల అడ్రస్‌ లేకుండా పోయింది. ప్రతి దానికి నోరు పారేసుకునే ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు విశాఖపట్నంలో ఉంటున్నారు. తన నియోజకవర్గ ప్రజలను గాలికొదిలేశారు. జనతా కర్ఫ్యూ, ప్రధాన పిలుపు మేరకు చేపట్టిన దీపాల కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహించి, కొన్ని పత్రికల్లో ఫొటోలు వేయించుకున్నారు. తర్వాత పత్తాలేరు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు పరిస్థితీ అంతే. గత కొంతకాలంగా అమరావతిలోనే ఉంటున్నారు. నియోజకవర్గ ప్రజలను గాని, జిల్లాను గాని చూసిన సందర్భాల్లేవు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ది కూడా అదే దారి. తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని ఎక్కువగా విశాఖలోనే గడుపుతున్నారు. నియోజకవర్గ ప్రజలను ఆదుకున్న పరిస్థితుల్లేవు.

నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, పలాస మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ్‌సుందర్‌ శివాజీ, పార్టీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష, మాజీ ఎమ్మెల్యేలు కోండ్రు మురళీమోహన్, కలమట వెంకటరమణ, గుండ లక్ష్మీదేవి, కావలి ప్రతిభా భారతి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి తదితర నేతలంతా ఎక్కుడున్నారో తెలియడం లేదు. వారెక్కడా సేవా కార్యక్రమాలు చేపట్టిన దాఖలాల్లేవు. ఇక, గురువారం వరకు ప్రెస్‌మీట్‌లు పెట్టి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న మాజీ విప్‌ కూన రవికుమార్‌ మాత్రం.. వారిపై వస్తున్న విమర్శల నేపథ్యంలో శుక్రవారం బూర్జ మండలం హనుమాయపేట, సలికం, కలపరతి తదితర గ్రామాల్లో సరుకులు పంపిణీ చేశారు.

విశేషమేమిటంటే అగ్రనేతలు పలాయనం చిత్తగించినా స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఉన్న టీడీపీ నాయకులు మాత్రం అక్కడక్కడ ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, భోజనం పంపిణీ చేపట్టారు. ఏదేమైనప్పటికీ టీడీపీ అగ్రనేతల తీరు చూస్తుంటే.. ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకొస్తారని, కష్టకాలంలో కని్పంచరనే అభిప్రాయాన్ని మరోసారి రుజువైంది.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top