రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం

Published Tue, Apr 3 2018 1:57 AM

Congress Leaders Fires On TRS Government - Sakshi

సాక్షి, పెద్దపల్లి/పెద్దపల్లి: తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం వీస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో సోమవారం రాత్రి జరిగిన ప్రజా చైతన్య బస్సుయాత్రలో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతృత్వ పాలనకు ప్రజలు విసుగెత్తి పోయారని, గద్దె దించేందుకు సమయం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. తన మాటల గారడీలతో ప్రపంచ బ్యాంకు నుంచి రూ.లక్ష కోట్ల అప్పులు తెచ్చి.. దానినే ఆదాయంగా చూపిన ఘనుడు కేసీఆర్‌ అని మండిపడ్డారు. ఈ అప్పులు కుప్పలై భావి తరాలను సైతం తాకట్టుపెడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కేవలం 33 శాతం ఓట్లతోనే టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిందని, 67 శాతం మంది కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారని ఉత్తమ్‌ పేర్కొన్నారు.

అసెంబ్లీలో ఏదో విసిరారట.. స్వామిగౌడ్‌కు తాకిందట.. ఇందుకు ఇద్దరు శాసన సభ్యులను డిస్మిస్‌ చేశారని మండిపడ్డారు. హైకోర్టు ఏజీ ప్రకాశ్‌రెడ్డి రాజీనామాతో అధికార పార్టీ బండారం బట్టబయలైందని చెప్పారు. హైకోర్టుకు వీడియో ఫుటేజీలను అందిస్తామన్న ప్రకాశ్‌రెడ్డి ఎందుకు రాజీనామా చేశాడో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను అసెంబ్లీలో నిలదీస్తారన్న భయంతోనే తమ వాళ్లపై విషం కక్కారన్నారు. కేవలం అసెంబ్లీ నుంచి ప్రతిపక్షాన్ని గెంటేయడానికి కేసీఆర్‌ కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. న్యాయం జరిగే వరకు కోమటిరెడ్డి, సంపత్‌ల వెంట కాంగ్రెస్‌పార్టీ ఉంటుందని చెప్పారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన కేసీఆర్‌ కుటుంబానికి, ప్రతిపక్షం, తెలంగాణ ప్రజలంటే అసహనం కలుగుతోందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల జీవితాలను ఆంధ్రా కాంట్రాక్టర్లకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, మహిళా గ్రూపులకు రూ.1లక్ష, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తామని పునరుద్ఘాటించారు.

ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం: ఎస్‌. జైపాల్‌ రెడ్డి 
ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్న కేసీఆర్‌కు రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబతారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఎస్‌.జైపాల్‌రెడ్డి అన్నారు. రూ.1.50 కోట్ల అప్పులతో తెలంగాణలోని ప్రతిబిడ్డను అప్పుల పాలు చేశారన్నారు. ప్రజలతో పాటు బ్యాంక్‌లను, రాజ్యాంగాన్ని మోసం చేసిన ఘనుడు కేసీఆర్‌ అన్నారు. బ్రెజిల్‌లోని ప్రధాని దిల్‌మారోస్‌ను అప్పుల పాలు చేసింనందుకు అక్కడి ప్రజలు గద్దె దించిన విషయాన్ని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రైతులకు రూ. 4వేల చొప్పున ఎకరాకు పంట సాయం అందించడం పెద్ద నాటకమని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ పట్ల కేసీఆర్‌ చేస్తున్న వ్యాఖ్యలను ఖండించాలన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు.

రజాకార్లను తరిమికొట్టిన పుస్తకం చదివావా?: రేవంత్‌రెడ్డి
80 వేల పుస్తకాలు చదివానంటున్న కేసీఆర్‌ తెలంగాణ ప్రాంతాన్ని పీడించిన రజాకార్లను మట్టి కరిపించిన పుస్తకం చదివావా.. అంటూ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కోసం వేలాది మంది తమ ప్రాణాలను అర్పించారని, అలాంటి తెలంగాణ గడ్డపై నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నాడన్నారు. పెన్నులను మట్టితో కప్పేస్తే అవి గన్నులై మొలుస్తాయని హెచ్చరించారు. నిర్భంధాలు లేని తెలంగాణ కోసం ప్రజల ఎదురు చూస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి అధికారం అప్పగించాలని ఆయన కోరారు. డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అధ్యక్షతన జరిగిన సభలో సీఎల్‌పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, డీకే అరుణ, షబ్బీర్‌అలీ, దానం నాగేందర్, పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, ఆరెపల్లి మోహన్, సత్యనారాయణగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement