భట్టి ఆమరణ దీక్ష భగ్నం

Congress Leader Mallu Bhatti Vikramarka Hunger Strike Is Over - Sakshi

బలవంతంగా నిమ్స్‌కు తరలించిన పోలీసులు

మధ్యాహ్నం వరకు ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగించిన సీఎల్పీ నేత

వైద్యానికి నిరాకరణ... ఏఐసీసీ నేతల జోక్యంతో చికిత్సకు అంగీకారం

నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన ఉత్తమ్‌ తదితరులు

నేడు కలెక్టరేట్ల ఎదుట ధర్నాలకు టీపీసీసీ పిలుపు

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ శాసనసభాపక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తూ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా గత మూడు రోజులుగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందన్న వైద్యుల సమాచారం మేరకు సోమవారం ఉదయం 7 గంటలకు చిక్కడపల్లి ఏసీపీ నర్సింహారెడ్డి నేతృత్వంలో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని నిమ్స్‌కు తరలించారు. భట్టి దీక్షను భగ్నం చేస్తున్న సమయంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు కొందరు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ పోలీసులు చాకచక్యంగా ఆయన్ను అక్కడి నుంచి తరలించారు.

అయితే నిమ్స్‌కు తరలించిన తర్వాత కూడా భట్టి తన దీక్షను విరమించేది లేదని వైద్యానికి నిరాకరించారు. దీంతో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఈ విష యాన్ని ఏఐసీసీ నేతల దృష్టికి తీసుకెళ్లారు. చివరకు ఏఐసీసీ నేతల సూచనతో భట్టి తన దీక్ష విరమించడానికి సిద్ధమయ్యారు. సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీలు మల్లు రవి, వి. హన్మంతరావు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్, ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌ల సమక్షంలో ఉత్తమ్‌ ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
 
ఫ్లూయిడ్స్‌ ద్వారా చికిత్స... 

మూడు రోజుల దీక్షతో నీరసించిన భట్టికి నిమ్స్‌ వైద్యులు ఫ్లూయిడ్స్‌ ద్వారా చికిత్స అందిస్తున్నారు. సోమవారం సాయంత్రానికి ఆయన బీపీ అదుపులోకి వచ్చిందని, షుగర్‌ లెవల్స్‌ ఇంకా తక్కువగానే ఉన్నాయని, కీటోన్స్‌ పరిస్థితి కూడా మెరుగుపడలేదని, మరో రెండ్రోజులు ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతారని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. కాగా, నిమ్స్‌లో చికిత్స పొందుతున్న భట్టిని పలువురు కాంగ్రెస్‌ నేతలు పరామర్శించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, రాజ్యసభ సభ్యుడు కె.వి.పి. రామచంద్రరావు, మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, షబ్బీర్‌ అలీ, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కె. నాగేశ్వర్, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తదితరులు భట్టిని పరామర్శించిన వారిలో ఉన్నారు.
 
నేడు కలెక్టరేట్ల ఎదుట ధర్నా... 

భట్టి దీక్షను విరమించిన నేపథ్యంలో సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ఉద్యమాన్ని కొనసాగించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. మంగళవారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి నాయకులు, పార్టీ శ్రేణులంతా ధర్నాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.  

ప్రాణాలకు తెగించి భట్టి దీక్ష: టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ 
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు భట్టి తన ప్రాణాలకు తెగించి నిరాహార దీక్ష చేశారని, పోలీసులు దీక్షా శిబిరంపై దాడి చేసి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ చెప్పారు. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారే విషయంలో తమ ఫిర్యాదులను పట్టించుకోకుండా స్పీకర్‌ ఏకపక్షంగా వ్యవహరించారని ఉత్తమ్‌ ఆరోపించారు. ఈ వ్యవహారంపై తాము హైకోర్టులో దాఖలు చేసిన కేసు మంగళవారం విచారణకు రానుందని, ఈ విషయంలో సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని వెల్లడించారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ కోరామని, పార్లమెంటులో కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని చెప్పారు. తెలంగాణను వ్యతిరేకించిన ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. తమ ఎమ్మెల్యేల కొనుగోలుపై కేసీఆర్‌ నోరు విప్పాలని డిమాండ్‌ చేశారు. 

కౌరవులపై పోరాటం చేస్తాం: ఎంపీ కోమటిరెడ్డి 
దళితుడిని సీఎం చేస్తానని మోసం చేసిన కేసీఆర్‌ కనీసం ఓ దళిత నేతను ప్రతిపక్ష నాయకుడిగా ఉండటాన్ని కూడా ఓర్వలేకపోయారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. నిమ్స్‌లోచికిత్సపొందుతున్న భట్టిని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేలు పాండవుల్లా 100 మంది కౌరవ ఎమ్మెల్యేలపై పోరాటం చేస్తారని చెప్పారు. అలాగే ముగ్గురు ఎంపీలం త్రిమూర్తుల్లా పార్లమెంటులో రాష్ట్ర సమస్యలపై గళం విప్పుతామన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన కార్యకర్తలు వెళ్లడం లేదని చెప్పారు.

ఓటేయకపోతే సంక్షేమ పథకాలు నిలిపేస్తామని ప్రజలను భయపెట్టి టీఆర్‌ఎస్‌ నేతలు ఓట్లు వేయించుకున్నారని, రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్‌ నామరూపాలు లేకుండా పోతుందన్నారు. కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు అధైర్యపడొద్దని చెప్పిన కోమటిరెడ్డి... మంగళవారం కలెక్టరేట్ల ముందు నిర్వహించే ధర్నా కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ అధికారం మత్తులో కేసీఆర్‌ నిరంకుశ పాలన చేస్తున్నారని విమర్శించారు. అహంకారపూరిత పాలన చేస్తున్న కేసీఆర్‌కు భట్టి దీక్ష ఓ హెచ్చరిక అని వ్యాఖ్యానించారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top