వారానికో నియోజకవర్గ స్థాయి భేటీ 

Congress Decides To Weekly One Constituency Level Meet - Sakshi

కాంగ్రెస్‌ కొత్త కార్యదర్శుల కార్యాచరణ సిద్ధం 

టీపీసీసీ కీలక భేటీలో నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షణ కోసం కొత్తగా నియమితులైన ఏఐసీసీ కార్యదర్శులు పని ప్రారంభించారు. రెండు నెలల పాటు రాష్ట్రంలోనే ఉండి తమకు కేటాయించిన పార్లమెంటు స్థానాల్లో వారు పర్యటించనున్నారు. వారానికోసారి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వ హించి నేతల పనితీరును సమీక్షించనున్నారు. సోమ వారం హైదరాబాద్‌కు వచ్చిన కొత్త కార్యదర్శులను పరిచయం చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్య నేతలు, డీసీసీ అధ్యక్షులతో గాంధీభవన్‌లో సమావేశం నిర్వ హించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. కాంగ్రెస్‌ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కాంగ్రెస్‌ కమిటీలు మరో 10 రోజుల్లో భర్తీ చేయాలని భేటీలో నిర్ణయించారు. కొత్త కార్యదర్శుల పర్యటనలు సిద్ధం చేయడంతో పాటు సమన్వయం కోసం ముగ్గురు టీపీసీసీ ప్రధాన కార్యదర్శులకు బాధ్యతలివ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాలకు రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యులు కూడా తప్పనిసరిగా హాజరు కావాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పర్యటించే రెండు నెలల్లో పార్టీ పరంగా ప్రతి నియోజకవర్గంలో పరిస్థితులను చక్కదిద్ది ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిం చాలని కూడా భేటీలో నిర్ణయించారు. రాష్ట్రంలోని రిజర్వుడ్‌ నియోజకవర్గాల్లో పోలింగ్‌ బూత్‌ స్థాయి లో కార్యకర్తల అనుసంధానం కార్యక్రమం సరిగా జరగని 4 నియోజకవర్గాలపై దృష్టి సారించను న్నారు. సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, సలీం అహ్మద్, శ్రీనివాసన్, వి.హనుమంతరావు, చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ఉపాధ్యక్షు లు డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి, మల్లు రవి, నాగయ్య, పొన్నం ప్రభాకర్‌లతోపాటు ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్‌ అధ్యక్షులు హాజరయ్యారు. 

టికెట్‌పై అధిష్టానానిదే నిర్ణయం: కుంతియా
పనిచేసే వారికే ప్రాధాన్యం ఉంటుందని ఆర్‌సీ కుంతియా తేల్చి చెప్పారు. టికెట్‌ ఎవరికి ఇవ్వాలో అధిష్టానమే నిర్ణయిస్తుందన్న కుంతియా.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరారు.  ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఉత్తమ్‌ కోరారు. 

కొత్త ఏఐసీసీ కార్యదర్శులకు బాధ్యతలు 
క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంతోపాటు నేతల మధ్య సమన్వయం కోసం కాంగ్రెస్‌ పార్టీ పని విభజనకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా కొత్తగా నియమితులైన ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులను లోక్‌సభ స్థానాలవారీ ఇన్‌చార్జులుగా నియమించింది. హైదరాబాద్‌ పరిసర పార్లమెంటు స్థానాలకు ఎన్‌.ఎస్‌. బోసురాజు, దక్షిణ తెలంగాణకు సలీం అహ్మద్, ఉత్తర తెలంగాణకు శ్రీనివాస కృష్ణన్‌లకు బాధ్యతలు అప్పగించింది. కొత్తగా పార్లమెంటరీ స్థానాలవారీగా ఇన్‌చార్జులుగా నియమితులైన ఏఐసీసీ కార్యదర్శులు గ్రామస్థాయి నుంచి పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆలోచనల మేరకు పోలింగ్‌ బూత్‌స్థాయిలో కమిటీల ఏర్పాటు, శక్తి యాప్‌ ద్వారా కార్యకర్తల రిజిస్ట్రేషన్‌ కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు. గ్రామ, మండల, అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల స్థాయిలో పార్టీ పరిస్థితి గురించి నివేదికలు తెప్పించుకోనున్నారు. ఒక్కో పార్లమెంటు స్థానంవారీగా ఇన్‌చార్జులను నియమించి వారి ద్వారా పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి నివేదికలు తీసుకోనున్నారు. నివేదికల ఆధారంగా ఆయా స్థాయిల్లో చేయాల్సిన మార్పులు, చేపట్టాల్సిన చర్యలపై కొత్త కార్యదర్శులు నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top