1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు; అయితే ఇప్పుడేంటి?

BJP Demands Sam Pitroda Apology Over His Comments On Anti Sikh Riots - Sakshi

న్యూఢిల్లీ : 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు శ్యామ్‌ పిట్రోడా క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ డిమాండ్‌ చేసింది.  మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఢిల్లీలో జరిగిన అల్లర్లలో సిక్కులు మరణించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ...‘ 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లలో నానావతి కమిషన్‌ ఇచ్చిన నివేదికలో.. భారతదేశంలో చెలరేగిన మారణహోమంలో ఇది ఒకటి. ప్రభుత్వమే తన సొంత పౌరులను పొట్టనబెట్టుకుంది అని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రధాని రాజీవ్‌ గాంధీ కార్యాలయం నుంచే ఆదేశాలు వచ్చాయి. ఈ కర్మకు వాళ్లు ఫలితం అనుభవించే రోజును చూడాలని దేశం మొత్తం ఎదురుచూస్తోంది’ అంటూ బీజేపీ ట్వీట్‌ చేసింది.

ఈ విషయంపై స్పందించిన శ్యామ్‌ పిట్రోడా.. ‘ అప్పుడేం జరిగింది? ఆ విషయాన్ని పక్కనబెట్టి ఈ ఐదేళ్లలో ఏం జరిగిందో దాని గురించి మాట్లాడండి. 1984లో జరిగిందేదో జరిగిపోయింది. అయితే ఇప్పుడేంటి? అదే విధంగా రాజీవ్‌ గాంధీ ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను సొంత ట్యాక్సీలా వాడుకున్నారనేది అబద్ధం. బాధ్యత ఉన్న నేవీ అధికారులు ఈ విషయంపై స్పందిస్తారని ఆశిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. కాగా శ్యామ్‌ పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ, శిరోమణి అకాలీదళ్‌ నేతలు మండిపడుతున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన పిట్రోడా వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో.. ‘ సిక్కు సమాజం ఎంతో వేదన అనుభవించింది. 1984లో కాంగ్రెస్ నాయకుల చేతిలో హత్యకు గురైన వారి కుటుంబాలు ఇప్పటికీ బాధ పడుతూనే ఉన్నాయి. ఢిల్లీలో జరిగిన ఈ దాడిపై శ్యామ్‌ పిట్రోడా వ్యాఖ్యలు ఇవి.. జరిగిందేదో జరిగిపోయిందట. భారత్‌ ఇలాంటి పాపాలు చేసిన కాంగ్రెస్‌ హంతకులను ఎన్నటికీ క్షమించబోదు అంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ట్వీట్‌ చేశారు.

ఇక మాజీ ప్రధాని ఇందిరా గాంధీని 1984లో ఆమె అంగరక్షకులైన సత్వంత్‌ సింగ్‌, బియాత్‌సింగ్‌లు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఇందిరా గాంధీని హత్య చేసింది సిక్కు మతస్తులు కావడంతో సిక్కులకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు చెలరేగాయి. ఈ క్రమంలో ఢిల్లీలో జరిగిన అల్లర్లలో సిక్కు యువకులు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. 34 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఈ కేసులో ఢిల్లీ కోర్టు ఇటీవలే తీర్పు వెలువరించింది. ఈ కేసులోని నిందితుల్లో ఒకరికి మరణ శిక్ష, మరొకరికి యావజ్జీవ శిక్షను విధించింది. ఈ కేసులో దోషులుగా తేలిన యశ్‌పాల్‌ అనే వ్యక్తికి ఉరిశిక్ష, నరేష్‌ అనే వ్యక్తికి జీవిత ఖైదు ఖరారు చేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top