మనం భయపడాల్సిన పనిలేదు : ఒవైసీ

Asaduddin Owaisi Tells Muslims to BJP Return No Cause For Worry - Sakshi

హైదరాబాద్‌ : బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిందని ముస్లింలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని... దేశంలోని ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించిందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. దేవాలయాలను ప్రధాని మోదీ సందర్శిస్తే... మనం మసీదులను సందర్శిద్దామని పిలుపునిచ్చారు. శుక్రవారం మక్కామజీదులో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. భారత్‌లో గొప్ప రాజ్యాంగ వ్యవస్థ ఉందని మతాన్ని ఆచరించే స్వేచ్ఛను భారతీయ చట్టాలు, రాజ్యాంగం ఇచ్చాయని ఒవైసీ తెలిపారు. మన దేశంలో 300లకు పైగా సీట్లను సాధించడం గొప్ప విషయమేమీ కాదని... 300 సీట్లు సాధించిన బీజేపీ మన హక్కులను కాలరాయలేదన్నారు.

భారత్ లో మనం కిరాయిదారులం కాదని... అందరితో సమానంగా, గౌరవంగా బతికే హక్కు మనకు రాజ్యంగం కల్పించిందని చెప్పారు. భారత్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని... మనమంతా మన దేశాన్ని ప్రశాంతంగా ఉంచేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. శ్రీలంకలో చోటుచేసుకున్న ఉగ్రదాడులపై స్పందిస్తూ... ఇస్లాంలో హింసకు తావు లేదని తెలిపారు. ప్రార్థనా స్థలాల్లో, ఇతర ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడి, 40 మంది అమాయక చిన్నారులతో సహా 200 మందికి పైగా ప్రాణాలను బలికొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ఇస్లాం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. హంతకులు ఇస్లాంను కాకుండా సైతాను బోధనలను అనుసరిస్తున్నారని మండిపడ్డారు. ఇక హైదరాబాద్‌ ఎంపీగా ఒవైసీ వరుసగా నాలుగోసారి విజయం సాధించిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top