టెలిఫోన్‌ ఆపరేటర్‌ నుంచి కేంద్రమంత్రిగా 

Arjun Meghwal Who Started Out As A Telephone Operator  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణస్వీకారోత‍్సవానికి సర్వం సిద్దమైంది. ప్రాథమికంగా అందుతున్నసమాచారం ప్రకారం ప్రధాని నరేంద్రమోదీ సహా మొత్తం 60మంది మంత్రులతో జెంబో క్యాబినెట్‌ కొలువు దీరనుంది. ఈ మేరకు రాష్ట్రపతిభవన్‌లో  ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఇప్పటికే  పలువురి కొత్తవారితోపాటు 46 మంది మంత్రులు ఖరారయ్యారు. ఎన్డీయే భాగస్వామ్యపక్షాలైన శివసేన, జేడీయూ, అప్నాదళ్, ఎల్జేపీ సభ్యులకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కనుంది. మరోవైపు తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి కేబినెట్లో బెర్త్ దక్కింది. 

ముఖ్యంగా కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రాజస్థాన్ ఎంపీ అర్జున్ రామ్ మేఘవాల్ (65) ఒకరు.  మూడుసార్లు ఎంపీగా గెలిచి వరుసగా రెండవసారి మోదీ 2.0లో స్థానం దక్కించుకోనున్నారు. గతంలో మోదీ నేతృత‍్వంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల, నీటివనరులు, రివర్ డెవలప్మెంట్‌ అండ్‌ గంగా రెజువెనేషన్ మంత్రిగా మేఘవాల్ పని చేశారు. తనకు కూడా పిలుపు వచ్చిందనీ, ఇందుకు ప్రధాని మోదీకి  కృతజ్ఞతలు తెలుపుతున్నాననంటూ  మేఘవాల్ సంతోషం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచినందుకు  ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

మేఘవాల్‌  కరియర్‌, రాజకీయ ప్రస్థానం
1977లో లా కోర్సు, 1979 ఆర్ట్స్‌లో పీజీ చేశారు. అనంతరం ఇండియన్ పోస్ట్ అండ్ టెలీగ్రాఫ్ డిపార్ట్‌మెంట్‌లో టెలిఫోన్ ఆపరేటర్‌గా కరియర్‌ను ప్రారంభించారు. ఆ ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షలకు హాజరయ్యేవారు. 1982లో ‘రాస్‌’ (రాజస్థాన్‌ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్) అర్హత సాధించి రాజస్థాన్‌ ఉద్యోగ్‌ సేవాకు అసిస్టెంట్‌ డైరెక్టరయ్యారు. 1994లో  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హరిశంకర్ బాబ్డాకు ఓఎస్‌డీగా నియామకం. అలా ఐఏఎస్‌కు ప్రమోటై పలు కీలక పదవులను నిర్వహించారు. ఫిలిప్సీన్స్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా సాధించారు. వివిధ రంగాల్లో పరిశోధన చేశారు. ముఖ్యంగా  కేంబ్రిడ్జ్ యూనివర్శిటీకి ఆంగ్లంలో కొన్ని సాహిత్య  పేపర్స్‌ను సమర్పించారు.

ఐఏఎస్‌గా రాజీనామా చేసి 2009లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మాజీ ఐఎఎస్ అధికారి అయిన అర్జున్‌ మేఘవాల్‌ బికనూర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు లోక్‌సభకు ఎంపిక కావడం విశేషం. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని 19వేల ఓట్ల మెజార్టీతో ఓడించారు. 2014 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శంకర్ పన్నూపై విజయం సాదించారు. తాజా ఎన్నికల్లో 6.5 లక్షల ఓట్లతో కాంగ్రెస్ పార్టీకే చెందిన మదన్ గోపాల్ మేఘవాల్‌ను ఓడించారు. 2004లో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ధర్మేంద్ర బికనీర్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.

అవార్డులు  
2013లో ‘బెస్ట్‌ పార్లమెంటేరియన్‌’ అవార్డు కూడా దక్కించుకున్నారు. దీనితోపాటు మరికొన్ని అవార్డులను కూడా  సొంతం చేసుకున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top