
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తనయుడు, మంత్రి నారా లోకేశ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఎట్టకేలకు స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. రాజధాని పరిధిలోని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నట్టు తాజా సమాచారం. ఇప్పటివరకు లోకేశ్ పోటీ చేస్తారంటూ ఐదు నియోజకవర్గాల పేర్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబునాయుడు లీకులు ఇవ్వడంతో.. టీడీపీ అనుకూల మీడియా లోకేశ్ ఇక్కడ పోటీ చేయబోతున్నారు.. లోకేశ్ అక్కడ పోటీ చేయబోతున్నారని హడావిడి చేసింది.
భీమిలి, విశాఖ నార్త్, పెదకూరపాడు, పెనమలూరు, హిందుపురం తదితర నియోజకవర్గాల్లో లోకేశ్ పోటీ చేయవచ్చునని టీడీపీ లీకులను అనుకూల మీడియా ప్రచారం చేసింది. ఆయా నియోజకవర్గాల్లో వ్యతిరేకత రావడం.. లోకేశ్ పట్ల పెద్దగా పార్టీ నేతలు ఉత్సాహం చూపించకపోవడంతో తాజాగా నియోజకవర్గం మార్చినట్టు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో లోకేశ్ పార్టీపై పార్టీలో స్పష్టత లేదని, చివరకు మంగళగిరిలోనూ ఆయన పోటీ చేస్తారో.. లేక మరో నియోజకవర్గం మారుతారో తెలియదని టీడీపీ కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది.