
సాక్షి, బళ్లారి: పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలి అని పెద్దలంటారు. అదే మాదిరిగా కూడ్లిగిలో డీఎస్పీగా పని చేస్తూ అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టించి ప్రభుత్వం, మంత్రిపై వ్యతిరేకతతో చివరకు డీఎస్పీ పదవినే త్యజించిన ఉద్యమ నారి అనుపమ షణై రాజకీయ భేరి మోగించారు. అనుపమ షణై బుధవారం జిల్లాలోని కూడ్లిగిలో అభిమానులు, కార్యకర్తల మధ్య ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్త రాజకీయ పార్టీ పేరు ప్రకటించారు. పార్టీకి భారతీయ జనశక్తి కాంగ్రెస్ పార్టీ అని నామకరణం చేశారు. కేసరి తెలుపు, పచ్చ రంగులతో కూడిన పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ముందుగా పట్టణంలో మహాత్మాగాంధీ సమాధికి పూజలు నిర్వహించిన అనంతరం పెద్ద ఎత్తున ఊరేగింపుతో పంచాచార్య కళ్యాణ మంటపంలో నూతన పార్టీకి అంకురార్పణ చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పార్టీలపై జనం విసుగు చెందారని, ఈ నేపథ్యంలో కొత్త పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. కర్ణాటక సమగ్రాభివృద్ధి కోసం పనిచేసే విధంగా ముందుకెళ్తామన్నారు. తమ పార్టీలో నాయకత్వ లక్షణాలు, ప్రజలకు సేవచేసే గుణం కలిగినవారిని చేర్పించుకుని అసెంబ్లీకి వెళ్తామన్నారు. ప్రజల మద్దతు తప్పకుండా లభిస్తుందని, తాము 80 లేదా అంతకన్నా ఎక్కువ సీట్లలో పోటీచేసి ప్రజల మద్దతు కోరతామని చెప్పారు.