నగరమా.. నరకమా..?

Anil Kumar yadav Protest For Road Works In PSR Nellore - Sakshi

రోడ్ల దుస్థితిపై  ఎమ్మెల్యే అనిల్‌ నిరసన దీక్ష

మరమ్మతులు చేపట్టకపోతే పనులను నిలిపేస్తాం

నెల్లూరు(సెంట్రల్‌): నగరంలో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పైప్‌లైన్‌ పనుల నిమిత్తం తవ్వేసి వదిలేసిన రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేసి యథాస్థితికి తీసుకురాకపోతే పనులను నిలిపేస్తామని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ హెచ్చరించారు. రోడ్లకు మరమ్మతులు చేయాలని డిమాండ్‌ చేస్తూ ‘రోడ్ల గుంతలు పూడ్చండి...ప్రజల ప్రాణాలను కాపాడండి’ అనే నినాదంతో నగరంలోని గాంధీబొమ్మ సెంటర్‌లో గురువారం చేపట్టిన నిరసన దీక్షలో ఆయన మాట్లాడారు. రోడ్లని తవ్వేసి రెండేళ్ల నుంచి సక్రమంగా పూడ్చకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అనేక సార్లు మంత్రి నారాయణ, అధికారులకు తెలియజేసినా ఆర్నెల్లుగా కాలయాపన చేస్తున్నారే తప్ప ప్రయోజనం శూన్యమన్నారు. నగరంలోని ఏ ప్రాంతంలో రోడ్లను చూసినా అధ్వానంగా మారాయని, ఫలితంగా పాదచారులు, వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు.

తవ్వేసిన గుంతలో పడి ఇటీవల ఇద్దరు మృతి చెందిన విషయాన్ని ప్రస్తావించారు. ఇంత జరుగుతున్నా మంత్రి నారాయణలో చలనం కూడా లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. మృతుల కుటుంబాల కు జరిగిన అన్యాయాన్ని ఎవరు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు టీడీపీ నేతలే కావడంతో ప్రజల తరఫున మాట్లాడే పరిస్థితి లేదన్నారు. రోడ్ల విషయమై ఏనాడైనా సంబంధిత అధికారులతో మంత్రి సమావేశాన్ని నిర్వహించారానని ప్రశ్నించారు. మరికొన్ని రోజులు చూస్తామని, అప్పటికీ రోడ్ల మరమ్మతులను పూర్తి చేయకపోతే పనులను నిలిపేస్తామని హెచ్చరించారు. వైఎస్సా ర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేషన్‌ ఫ్లోర్‌లీడర్‌ రూప్‌కుమార్‌యాదవ్, కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర, దామవరపు రాజశేఖర్, గోగుల నాగరాజు, ఖలీల్‌అహ్మద్, నాయకులు దార్ల వెంకటేశ్వ ర్లు, వేలూరు మహేష్, మాళెం సుధీర్‌కుమార్‌రెడ్డి, కర్తం ప్రతాప్‌ రెడ్డి, వందవాసి రంగ, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, లోకిరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, ఇంతియాజ్, పఠాన్‌ ఫయాజ్‌ఖాన్, కాలేషా, జనార్దన్‌రెడ్డి, చందవోలు సతీష్, మజ్జిగ జయకృష్ణారెడ్డి, మున్వర్, గంధం సుధీర్‌బాబు, వంగాల శ్రీనివాసులురెడ్డి, శ్రావణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top