‘ఆప్‌’ మాత్రమే టార్గెట్‌ ఎందుకు?

AAP Asks EC for MLAs Disqualification - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై నిరసన వ్యక్తం చేస్తున్న ఆప్‌ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. కేవలం ఢిల్లీ ప్రభుత్వాన్ని మాత్రమే ఎందుకు టార్గెట్‌ చేశారని? నిలదీస్తోంది. శనివారం ఉదయం పార్టీ అధికారిక ట్విటర్‌లో వరుస ట్వీట్లు చేసింది.

‘‘పార్లమెంటరీ సెక్రెటరీలను నియమించటం అన్నది చాలా సాధారణమైన విషయం. ఒక్క ఢిల్లీ మాత్రమే కాదు. మిగతా రాష్ట్రాలు కూడా ఈ నియామకాలు చేపడతుంటాయి. ఈ విషయంలో వివాదాలు చెలరేగితే కోర్టులు ఆ నియామకాలపై స్టేలు విధించటం చూశామే తప్ప.. ఎన్నికల సంఘం జోక్యం చేసుకున్న దాఖలాలు లేనే లేవు. లాభదాయకమైన పదవుల పేరిట మిగతా రాష్ట్రాలు కోట్లు ఖర్చు పెడుతున్నాయి. కానీ, ఆప్‌ మాత్రం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మరి అలాంటప్పుడు ఆప్‌ విషయంలోనే అనర్హత వేటు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది?  అని ఎన్నికల సంఘాన్ని ఆప్‌ ప్రశ్నించింది. దీని వెనుక రాజకీయ కుట్ర దాగుందన్న విషయం స్పష్టమవుతుందని.. రాజ్యాంగ పదవిని ప్రధాని కాళ్ల దగ్గర ఎన్నికల ప్రధానాధికారి తాకట్టుపెట్టారని ఆప్‌ ఆరోపిస్తోంది.

చివరకు సత్యమే గెలుస్తుంది : కేజ్రీవాల్‌
ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వేళ.. ఆ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మాత్రం కాస్త ఆలస్యంగా స్పందించారు. ‘‘నిజాయితీ, సత్యంతో కూడుకున్న మార్గంలో వెళ్తున్నప్పుడు ఎదురు దెబ్బలు తప్పవు. అది సహజం. అలాంటప్పుడు దేవుడు దీవెనలు మీపైనే ఉంటాయి. ఎందుకంటే మీరు మీ కోసం కాకుండా దేశం కోసం.. సమాజం కోసం ఆలోచిస్తారు కాబట్టి’’ అంటూ ట్వీట్‌ చేశారు. ఏదిఏమైనా ఈ పోరాటంలో చివరకు సత్యమే జయిస్తుందని ఆయన పేర్కొన్నారు. 

మరోవైపు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ట్విటర్‌లో కేజ్రీవాల్‌కు మద్ధతు తెలిపారు. ‘‘రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థను రాజకీయాల కోసం ఉపయోగించటం దారుణం. కేజ్రీవాల్‌కు ఆయన సభ్యులకు మా మద్ధతు ఉంటుంది’’ అని ఆమె పేర్కొన్నారు. సీపీఐ(ఎం) బృందా కారత్‌ కూడా ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

సోమవారానికి విచారణ వాయిదా... 
రాజ్యాంగానికి విరుద్ధంగా లాభదాయకమైన పదవులు అనుభవిస్తున్నారంటూ 20 మంది ఆప్‌ ఎమ్మెల్యేలపై ఈసీ వేటు వేసిన సంగతి తెలసిందే. దీంతో ఆరుగురు ఆప్‌ ఎమ్మెల్యేలు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈసీ తరపున న్యాయవాది నివేదికను రాష్ట్రపతికి పంపిన విషయాన్ని దృవీకరించకపోవటంతో కోర్టు పిటిషన్‌ పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 

మొత్తం 70 మంది సభ్యులు గల ఢిల్లీ అసెంబ్లీలో 67 సీట్లను ఆప్‌(2015 ఎన్నికల్లో) గెలుచుకుంది.  20 మందిపై వేటు పడినా కనీస బలం కన్నా ఎక్కువ సీట్లే ఉండటంతో ప్రభుత్వం కుప్పకూలే అవకాశాలు లేవు. ఈ తరుణంలో ఆయా స్థానాలకు ఉప ఎన్నికలకు వెళ్లటమే మంచిదని కేజ్రీవాల్‌కు పలువురు సూచిస్తున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top